తెలంగాణలో సీనియర్ నాయకుల్లో ఒకరు.. నిన్నమొన్నటి వరకు తెలంగాణ రాష్ట్ర సమితిలో ఉన్న గట్టు రాంచందర్రావు.. వైఎస్సార్ తెలంగాణ పార్టీలో చేరారు. లోటస్ పాండ్ లో జరిగిన కార్యక్రమంలో పార్టీ అధ్యక్షురాలు షర్మిల ఆయనకు పార్టీ కండువా కప్పి.. ఆహ్వానించారు. అనుచరులతో సహా పార్టీలో చేరిన గట్టు రాకతో… వైఎస్సార్ తెలంగాణ బలోపేతం అవుతుందని ఈ సందర్భంగా వారు వ్యాఖ్యానించారు.
ఈ చేరికతో.. సుమారు నెలన్నర కిందట ‘ఆదర్శిని’ చెప్పిన జోస్యం నిజమైంది. తెలంగాణ రాష్ట్ర సమితి తరఫున ఎమ్మెల్సీలను కేసీఆర్ తేల్చుతున్న సమయంలో.. అప్పటిదాకా తెరాసలో ఉన్న గట్టు రాంచందర్రావు రావు పార్టీకి రాజీనామా చేశారు. అప్పుడే ఆదర్శిని క ప్రత్యేక కథేనాన్ని అందించింది. ‘జగనన్న అనుచరుడు షర్మిల పార్టీలోకి’ అనే శీర్షికతో నవంబరు 26వ తేదీన అందించిన ఆ వార్తలో.. గట్టు రాంచందర్రావు రావు వైతెపాలో చేరబోతున్న వైనం వివరించింది. ఇప్పుడు అచ్చంగా అదే జరిగింది. గట్టు రాంచందర్రావు మొత్తానికి షర్మిల గూటికి చేరుకున్నారు.
గట్టు రాంచందర్రావు.. జగన్మోహన్ రెడ్డి వైసీపీ ప్రారంభించిన తర్వాత.. ఆ పార్టీలో తెలంగాణ నుంచి కీలకంగా ఉన్న నేతల్లో ఒకరుగా ఉన్నారు. అప్పట్లో తెరాసనుంచి వచ్చే విమర్శలను తిప్పికొట్టేవారు. జగన్ పూర్తిగా ఏపీ రాజకీయాలకు మాత్రమే పరిమితం అయిన తర్వాత.. గట్టు రాంచందర్రావు- కేసీఆర్ పంచన చేరారు. ఎమ్మెల్సీ పదవిని ఆశించారు గానీ.. ఇన్నాళ్లుగా ఆ పదవి దక్కలేదు. మొన్నటికి మొన్న 12 ఎమ్మెల్సీ స్థానాలను భర్తీ చేస్తున్నప్పుడు కూడా తనకు అవకాశం ఇవ్వకపోవడంపై ఆయన కినుక వహించి పార్టీనుంచి బయటకు వచ్చారు. అప్పుడు ఆదర్శిని అంచనా వేసినదే ఇప్పుడు జరిగింది.
ప్రస్తుతం వైతెపాలో షర్మిల తర్వాత.. కనీసం పార్టీ గళం మీడియా ముందు వినిపించడానికి తగిన నాయకులు కూడా లేరు. ప్రజా బలం సంగతి తరువాత.. కనీసం మీడియా ముందు మాట్లాడుతూ.. రాజకీయ విమర్శలతో హడావుడి చేసేవారు కూడా లేరు. గట్టు రాంచందర్రావు ఆ పాత్రను చాలా సమర్థంగా పోషించగలరు గనుక.. పార్టీకి ఆమేరకు ఉపయోగపడతారు.
పార్టీలో చెప్పుకోదగ్గ నాయకుల కొరత షర్మిల పార్టీకి ఉంది. ఈ కొరతను అధిగమిస్తూ.. పార్టీని ఆమె ఏ రకంగా ముందుకు తీసుకువెళ్లగలరో చూడాలి.
.

Discussion about this post