దేశంలో కోవిడ్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో వైకుంఠ ద్వార దర్శనం దృష్ట్యా తిరుమలలో కోవిడ్ మార్గదర్శకాలు మరింత కఠినంగా అమలు చేయాలని టీటీడీ చైర్మన్ శ్రీ వైవి సుబ్బారెడ్డి అధికారులను ఆదేశించారు.
తిరుమల లోని తన క్యాంపు కార్యాలయంలో ఆదివారం రాత్రి ఆయన కోవిడ్ మార్గదర్శకాల అమలు పై అదనపు ఈవో శ్రీ ధర్మారెడ్డి ఇతర ఆధికారులతో సమీక్షించారు.
జనవరి 13వ తేదీ వైకుంఠ ఏకాదశి,14వ తేదీ ద్వాదశి ద్వాదశి తో పాటు మిగిలిన 8 రోజులు భక్తులు, ఉద్యోగుల ఆరోగ్య భద్రతకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని సూచించారు. జనసమూహం ఉండే ప్రాంతాలు, వైకుంఠం క్యూ కాంప్లెక్స్, క్యూ లైన్లు, శ్రీవారి ఆలయంలో శానిటైజర్లు అందుబాటులో ఉంచాలన్నారు.
ప్రతి ఒక్క భక్తుడు, ఉద్యోగులు తప్పనిసరిగా మాస్క్ ధరించేలా చర్యలు తీసుకోవాలని చైర్మన్ ఆదేశించారు. ఇందుకోసం భక్తులకు అవగాహన కల్పించేందుకు ఏర్పాట్లు చేయాలని తెలిపారు.
వైకుంఠ ఏకాదశి, ద్వాదశి రోజుల్లో క్యూ లైన్, శ్రీవారి ఆలయంలో భక్తులు భౌతిక దూరం తప్పనిసరిగా పాటించేలా చూడాలన్నారు. భక్తులు తోపులాటకు దిగకుండా ప్రశాంతంగా దర్శనం చేసుకుని వెళ్ళేలా ఏర్పాట్లు చేయాలని ఛైర్మన్ అధికారులను ఆదేశించారు.
శ్రీవారి దర్శనం కోసం వచ్చే భక్తులు కూడా కోవిడ్ నిబంధనలు పాటిస్తూ, అధికారులు, ఉద్యోగులకు సహకరించాలని ఛైర్మన్ సుబ్బారెడ్డి విజ్ఞప్తి చేశారు.
.

Discussion about this post