ఆకలితో ఉన్న మనిషికి చేపను ఇవ్వడం కన్నా.. చేపలు పట్టడం నేర్పించడం మిన్న… అనేది చైనా సామెత. ఆ మాటను సంక్షేమ పథకాలకు అన్వయించుకుంటే మన దేశంలో ప్రభుత్వాలు నడుచుకుంటున్న తీరు భిన్నంగా కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో తాగునీటి ధరలకు కళ్లెం వేస్తూ కేరళ సర్కారు తీసుకున్న నిర్ణయం ప్రజల మన్ననలందుకుంటోంది.
కేరళ రాష్టం అవడానికి సముద్ర తీర ప్రాంతమైనా.. తాగునీటిని కొనుక్కొని తాగాల్సిన పరిస్థితి అక్కడి ప్రజలది. ఈ దుస్థితికి పరిస్థితులు, కారణాలు ఏవైనా.. తాగునీటి కార్పొరేట్ వ్యాపారానికి ముకుతాడు వేయాలని అక్కడి ప్రభుత్వం నిర్ణయించింది. అనుకున్నదే తడవుగా బాటిల్స్ లో విక్రయించే నీటిని ‘నిత్యావసర వస్తువుల’ జాబితాలో చేర్చింది. మార్కెట్లో రూ.20 స్థాయిలో అమ్ముడవుతున్న బాటిల్ నీటి ధరను గరిష్టంగా 13 రూపాయలకు పరిమితం చేస్తూ తీర్మానించింది. దీనికి సీఎం పినరయి విజయన్ ఆమోదం తెల్పుతూ సంబంధిత ఫైలుపై సంతకాలు కానిచ్చేశారు.
కేరళ తీసుకున్న కొత్త నిర్ణయం వల్ల పౌరుడి ఖర్చు పొదుపు అవుతుండగా.. ఇతర రాష్ట్రాలలో ఇతర పార్టీలు, ప్రభుత్వాలు తెస్తున్న పథకాలు తద్భిన్నంగా ఉంటున్నాయి. కేంద్రంలోని బీజేపీ తీసుకొచ్చిన బేటీ బచావో, బేటీ పడావో.., ప్రధానమంత్రి ఆవాస్ యోజన పౌరుల అభ్యున్నతికి తోడ్పడేవిగా ఉన్నాయి. తెలంగాణలో మిషన్ కాకతీయ, మిషన్ భగీరథ దీర్ఘకాలిక సంక్షేమ పథకాలుగా కనిపిస్తున్నాయి. ఇవికాక రైతుబంధు ఇతర రాష్ట్రాలను, కేంద్రాన్ని సైతం ఆకట్టుకోవడం గమనార్హం. ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తే.. నవరత్నాల పేరిట సీఎం జగన్‌మోహన్‌రెడ్డి ఆయా పథకాలు ప్రవేశపెట్టారు. వీటిలో అమ్మఒడి, వైఎస్‌ఆర్ భరోసా, వృద్ధాప్య పింఛన్లు నేరుగా పౌరుల ఖాతాల్లోకి డబ్బు చేరేవిగా ఉన్నాయి. మరోవైపు ఢిల్లీలో మూడోసారి అధికార పీఠాన్ని దక్కించుకున్న ఆమ్ ఆద్మీ పార్టీ సంక్షేమ పథకాల ద్వారానే గట్టెక్కినట్లు కనిపిస్తోంది.
సంక్షేమం ముసుగులో ఈ ప్రభుత్వాలు అమల్లోకి తెస్తున్న అనేకానేక పథకాల్లో చాలా వరకు ఓటుబ్యాంకును లక్ష్యంగా చేసుకుని సాగిస్తున్నవే. ఉన్నపళంగా ప్రజల జేబులు నింపే పథకాల కన్నా జేబులు పొదుపు అయ్యే పథకాలు అమల్లోకి తీసుకువస్తే బాగుంటుంది.
ఆ కోణంలోంచి చూసినప్పుడు కేరళలో తాజాగా ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ఇతర రాష్ట్రాలకు ఆదర్శం కావాలి. ప్రజల నిత్యావసరాల విషయంలో ఇలాంటి కార్పొరేట్ దోపిడీకి ముకుతాడు వేస్తే.. పేద, మధ్యతరగతి ప్రజలు అందరూ కూడా హర్షిస్తారు. కేరళ సర్కారు రేటు తగ్గించడంతో ఊరుకోలేదు.. నాణ్యత ప్రమాణాల విషయంలో మరింత కచ్చితమైన ఆదేశాలు జారీచేసింది. బీఐఎస్ ప్రమాణాలు లేకుండా.. నీటిని విక్రయిస్తే శిక్షలు విధించేలా ఆదేశాలు చేసింది. దేశంలో అన్ని ప్రభుత్వాలు కూడా.. కేరళ అడుగుజాడల్లో నడిస్తే బాగుంటుంది. కేవలం ఓటుబ్యాంకు సంక్షేమం కాకుండా.. అసలైన సంక్షేమం మీద కూడా ప్రభుత్వాలు దృష్టి పెడతాయని ప్రజలకు నమ్మకం కలుగుతుంది.
.

Discussion about this post