చెట్లు, చేమలు…
కొండలు, కోనలు…
నదులు, సరస్సులు…
పర్వతాలు, మైదానాలు…
ఇలాంటి ఎన్నో అందమైన ప్రదేశాల సమాహారమే ప్రకృతి. అందుకే స్త్రీని ప్రకృతితో పోల్చారు. ప్రకృతి తనలోని అందాలను ఎలా పరిరక్షించుకుంటుందో, అలాగే స్త్రీ కూడా తన కష్టాలను భరిస్తూనే కుటుంబాన్ని కాపాడుకుంటుంది. అంతేకాదు స్త్రీకి మాతృత్వం అనే గొప్ప వరాన్ని ప్రసాదించాడు భగవంతుడు. అందుకే స్త్రీకి నాటి నుంచి నేటివరకే కాదు ఎప్పటికీ గౌరవస్థానం ఉంటుంది సమాజంలో.
‘స్త్రీలు ఎక్కడ గౌరవింపబడుతారో, అక్కడ సుఖసంతోషాలతో వర్థిల్లుతారు’ అనే వాక్యం అక్షర సత్యమే. అయితే ఎక్కడో కొన్ని సంఘటనలు స్త్రీకి వ్యతిరేకంగా జరిగినప్పుడు స్త్రీ వాదులు అరచి గగ్గోలు పెడతారు. అదే స్త్రీల నుంచి పురుషులకు బాధకలిగినప్పుడు ఈ స్త్రీ వాదులంతా ఎందుకు మౌనం వహిస్తారో అంతుచిక్కని విషయం.
సమానత్వం అంటే స్త్రీకైనా, పురుషునికైనా ఒకే ధర్మం, ఒకే న్యాయం. మరి నేటి సమాజంలో అలాంటి సమన్యాయం జరుగుతోందా? లేదా? అనేది జవాబులేని ప్రశ్న.
నేటి సమాజంలో పురుషులవల్ల స్త్రీలు ఎంత నరకం అనుభవిస్తున్నారో, పురుషులు కూడా అంతకంటే ఎక్కువ నరకం అనుభవిస్తున్నారు స్త్రీల వల్ల! కాకపోతే స్త్రీలు బయటకు చెప్తున్నారు. పురుషులు బయటకు చెప్పుకోలేక తమలోతామే కుమిలిపోతూ, బయటపడితే కుటుంబం ఎక్కడ కూలిపోతుందేమోనని మౌనంగానే భరిస్తూ బతుకుబండిని నడుపుకొస్తున్నారు. ఒకవేళ బయటపడినా చివరకు పురుషునిదే తప్పు అని తేల్చేసి వాళ్లను వెధవలుగా చిత్రీకరించి చీల్చి చెండాడేస్తారు ఈ అభ్యుదయవాదులు.
ప్రకృతి అంటే సృష్టి. సృష్టికి కర్త ఈశ్వరుడు. అంటే ప్రకృతికి ఆధారం పురుషుడు. అలాగే స్త్రీకి మాతృత్వం అనే గొప్ప వరం ఉన్నా, ఆ వరం సాకారానికి ఆధారం పురుషుడు. కాబట్టి స్త్రీ, పురుషులలో ఒకరు ఎక్కువకాదు, మరొకరు తక్కువ కాదు. ఇద్దరూ సమానమే. ఇద్దరూ సమానమే అనడానికి సజీవ సాక్ష్యమే అర్థనారీశ్వర స్వరూపం.
కాబట్టి…
సమాజంలో స్త్రీకి అన్యాయం జరిగినప్పుడు ఎంతస్పందిస్తామో, పురుషునికి నష్టం జరిగినప్పుడు కూడా అంతే ప్రతిస్పందించాలి. అప్పుడే సమసమాజం అనే పదానికి అసలైన అర్థం. ఇదంతంతా ఎందుకు చెప్తున్నానంటే నేటి సమాజంలో స్త్రీలు ఎంతనరకం అనుభవిస్తున్నారో, పురుషులు కూడా అంతే నరకం అనుభవిస్తున్నారు. బహుశా సమసమాజం అంటే ఇదేనని సరిపెట్టుకోవాలేమో.
ఇప్పటివరకూ స్త్రీల హక్కులకోసం పోరాడాం. పోరాడుతున్నాం. భవిష్యత్తుకాలంలో పురుషుల హక్కులకోసం పోరాడే రోజులు వస్తాయేమోమరి?
(అంతర్జాతీయ పురుషుల దినోత్సవం సందర్భంగా ఈ వ్యాసం పురుషులకు అంకితం)
…దేవీప్రసాద్ ఒబ్బు
98662 51159

.
Discussion about this post