ప్రొఫెసర్ అబ్దుల్ కలాం, విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగిస్తూ.. అలా కుప్పకూలిపోయి కన్నుమూసినప్పుడు.. నా మటుకు నేను ‘ఆయన ధన్యజీవి’ అనుకున్నాను. ‘నన్ను మాజీ రాష్ట్రపతిగా గుర్తించొద్దు, ప్రొఫెసర్ అనే గుర్తించండి’ అని కోరేంతగా ఆ పనిని ఇష్టపడిన ఆయన, పనిలోనే పరమపదించడం ఒక వరం. అంత అద్భుతం కాకపోయినా అలాంటిదే మరొకటి యిది… ఇష్టమైన పనిలో ఉంటూనే ఉన్నపళంగా… తుది సెలవు తీసుకున్న మరొకరు నాకు తెలుసు.
== ==
వెంకటకృష్ణ మరీ ర్యాంకులు కొట్టేసేంత చురుకైన విద్యార్థి కాదు. నిజానికి అతనికంత అవకాశం కూడా లేదు. పొద్దున్లేచి సద్ది తాగి పదిమైళ్లు నడిచి శ్రీకాళహస్తి బడికి రావాలి. మధ్యాహ్నం కేరేజీ డబ్బాలో ఏది ఉంటే అది, తోటి పిల్లల డబ్బాల్లోంచి పచ్చడో, ఊరగాయో తీసుకుని తిని… సాయంత్రం మళ్లీ యీసురోమని అంతదూరమూ కాళ్లీడ్చుకుంటూ యింటికి వెళ్లాలి. ఎండావానలకు తాళుకోవాలి. యిలా చదువుతూ చురుకైన లేదా తెలివైన విద్యార్థుల కేటగిరీలో ఎలా ఉండగలడు? దానికి తగ్గట్లే సాగింది చదువు. ఎస్సెస్సెల్సీ ఒక పరీక్ష తప్పాడు.
కానీ, అతడి ఆసక్తులు వేరు. పిల్లలందరినీ పోగేసి సంఘాలు కట్టడం… వాళ్లకోసం ఇంకేదైనా తనకు నచ్చినది చేయడం. హైస్కూలు చదివే రోజుల్లోనే నాలుగు తెల్లకాగితాలు సంపాదించి, వాటిలో కథో, కవిత్వమో, సమాచారమో యింకేదైనానో రాసేవాడు. కార్బను కాపీలు తీసేవాడు. ఆ విధంగా, అప్పటికది నాలుగైదు కాపీల సర్కులేషన్ ఉన్న చిన్న పత్రికగా తయారయ్యేది. రాతపత్రిక అన్నమాట. అన్నీ పిల్లలకు సంబంధించిన సంగతులే. ఊర్లో ఎవరిదైనా సైకిలు అరువు పుచ్చుకుని.. చుట్టు పక్కల పల్లెలు తిరిగి అక్కడి స్కూలు పిల్లలతో తాను ఏర్పాటు చేసిన బాల సంఘాలకు ఆ కాపీలు ఇచ్చేసి.. వారిని చదువుకొమ్మని చెప్పి ఆనందించేవాడు.
ఎస్సెస్సెల్సీ తర్వాత బతుకు రకరకాలుగా మలుపులు తిరిగింది. కుటుంబంలో కొన్ని తరాలు కొనసాగవలసిన నమ్మకం (సెంటిమెంటు) కోసం తన పేరును వెంకటకృష్ణ నుంచి ఎల్లయ్యగా మార్చుకున్నాడు. కడుపు చేతిలో పట్టుకుని రకరకాల కొలువులు చేశాడు. జీవితానికి స్థిరత్వాన్ని యివ్వగల సర్కారీ కొలువులే. కానీ.. అవేవీ అతని ఆత్మను పట్టుకోలేకపోయాయి. మళ్లీ మళ్లీ వాటిని వదిలిపెట్టాడు. పత్రిక అనేది అతని ముచ్చట. ప్రారంభించాడు. నడిపాడు- అదే పిచ్చి అతడిని మదరాసు యీడ్చుకెళ్లింది. ‘పద్మశ్రీ’ గుత్తా మునిరత్నం (ఇప్పుడు తిరుపతిలోని రాష్ట్రీయసేవా సమితి- రాస్ సారథి) గారితో బాలసంఘాల పుణ్యమాని కుదిరిన స్నేహంతో.. ఆయన స్థాపించిన కళా ప్రెస్‌లో ప్రూఫ్ రీడర్‌గా కుదురుకున్నాడు. మళ్లీ పత్రికలు నడిపాడు.. మూతపెట్టాడు.
బతుకు దేవులాటలో తిరిగి శ్రీకాళహస్తి చేరాడు. 1970లో ఆదర్శిని వారపత్రిక మొదలైంది. నిండా నాలుగుపేజీలే ఉండే చిన్న పత్రిక. చెమటోడ్చాడో, కష్టానికోర్చాడో నడుపుతూ వచ్చాడు. బతుక్కి అదొక్కటే ధ్యాస, వ్యాసంగం. అదే ధ్యానం.. అదే యోగం! ముఖ్యమంత్రులతో, రాష్ట్రపతితో ఎదట సోఫాల్లో కూర్చుని ఎంత సరళంగా సంభాషించాడో… అదేమాదిరిగా మదరాసు న్యూస్ ప్రింట్ దుకాణం అరుగు మీద ఎండలో పేర్చిన పేపర్ రీముల మీద కూర్చుని గడిపేవాడు. ప్రెస్ ఒక్కటీ సొంతంగా సమకూరింది గనుక… పేపర్ (న్యూస్‌ప్రింట్) సమకూర్చుకుంటే పత్రిక బయటకు వచ్చేస్తుంది. ప్రతి బుధవారం, పత్రిక చందాదార్లకు పోస్టు అయిపోతూ ఉంటే అదొక తృప్తి. వెయ్యేనుగుల బలం. చివరి వరకూ అదొక యజ్ఞంలా నడిపాడు.
2000 జనవరి 23 ఆదివారం పత్రిక పని జరుగుతోంది. ఉదయం నుంచి దగ్గరుండి కంపోజిటరుతో ఒక పేజీ పూర్తిచేయించాడు. భోజనం తర్వాత మరో పేజీకోసం మేటర్ (ఆర్టికల్స్) రాసి సిద్ధం చేశాడు. అప్పుడు వచ్చింది గుండెలో నొప్పి. లోకల్ డాక్టరు తిరుపతికి తీసుకెళ్లమన్నాడు. తీరా తిరుపతి వెళ్లాక… ‘ఓ పది నిమిషాల ముందు వచ్చి ఉండాల్సింది’ అన్నారు.
జీవితాంతం ఇష్టపడిన పనిలో తుదిక్షణాలను గడపగలడం ఖచ్చితంగా వరం.
ఆ ధన్యజీవి ఆదర్శిని ఎల్లయ్య.. నాకు నాన్న.
ఇవాళ ఆయన చనిపోయిన రోజు గనుక ఎరిగిన నలుగురితోనూ చెప్పుకోవాలనిపించింది.
… సురేష్ పిళ్లె
23 జనవరి 2020
.

Discussion about this post