తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శి గాలి చలపతినాయుడుపై శనివారం శ్రీకాళహస్తిలో దాడి చేశారు. శ్రీకాళహస్తిలో ది కాళహస్తి సహకార పాల సరఫరా సంఘం ఎన్నికలను పురస్కరించకుని నామినేషన్ దాఖలు చేసేందుకు గాలి చలపతి నాయుడు తన కారులో వస్తుండగా.. ఆర్టీసీ బస్టాండు సమీపంలో కొంతమంది వ్యక్తులు ఆయన ప్రయాణించే వాహనాన్ని అడ్డగించారు.
రాళ్లతో వాహనం అద్దాలను ధ్వంసం చేశారు. అదేవిధంగా గాలి చలపతినాయుడుపై కూడా దాడి చేశారు. ఈ ఘటనలో ఆయన గాయపడ్డారు. బాగా రక్తం కూడా కారింది. ఈ విషయం తెలుసుకున్న టీడీపీ శ్రేణులు పెద్ద సంఖ్యలో అక్కడకు చేరుకున్నాయి.
ఆర్టీసీ బస్టాండు సమీపంలోని ఎన్టీ ఆర్ కూడలిలో టీడీపీ శ్రేణులు ఆందోళనకు దిగాయి. అధికార పార్టీకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. గాలి చలపతినాయుడుపై అధికార పార్టీ వారే దాడి చేశారని వారు ఆరోపించారు. ప్రజాస్వామ్య బద్దంగా ఎన్నికలు నిర్వహించకుండా ఇలా దాడులు చేయడం ఎంతవరకు న్యాయమని వారు ప్రశ్నించారు.
గాలి చలపతి నాయుడు చీమకు కూడా హాని తలపెట్టని వ్యక్తి అని… రాష్ట్ర స్థాయి పదవి ఉన్నప్పటికీ ఏ మాత్రం అహంకారం లేకుండా సామాన్య కార్యకర్తలను, పేదలను ఎంతో గౌరవిస్తారని… అలాంటి వ్యక్తిపై అందరూ చూస్తుండగా పట్ట పగలే నడి రోడ్డులో దాడి చేయడం హేయమైన చర్య అని టీడీపీ నేతలు విమర్శించారు.
ప్రఖ్యాతి గాంచిన పుణ్యక్షేత్రంలో ఇలాంటి డాడులకు పాల్పడటం వైసీపీ రౌడీయిజానికి నిదర్శనమన్నారు. దాడికి బాధ్యులైన వారిపై చర్యలు తీసుకోవాలని వారు డిమాండు చేశారు. కాగా గాలి చలపతి నాయుడుపై జరిగిన దాడిని తెలుగు యువత నియోజకవర్గ ఉపాధ్యక్షులు కిలారి మోహన్ క్రిష్ణతో పాటు పలువురు నేతలు ఖండించారు.
Discussion about this post