ప్రపంచంలోని ప్రజలంతా ఆయురారోగ్యాలతో ఉండాలని శ్రీవారిని ప్రార్థిస్తూ తిరుమల నాదనీరాజనం వేదికపై శుక్రవారం ఉదయం 6.30 నుండి 8.30 గంటల వరకు 9వ విడత బాలకాండ అఖండ పారాయణం భక్తజనరంజకంగా సాగింది.
ఇందులో 38 నుండి 43 సర్గల వరకు గల 172 శ్లోకాలను పారాయణం చేశారు. వేద పండితుల అఖండ పారాయణం చేయగా పలువురు భక్తులు భక్తిభావంతో వారిని అనుసరించి శ్లోక పారాయణం చేశారు.
ఈ సందర్భంగా ఎస్వీ వేద విశ్వవిద్యాలయం ఆచార్యులు ఆచార్య ప్రవా రామకృష్ణ సోమయాజి మాట్లాడుతూ రామనామం సకలశుభకరమన్నారు. శ్రీరాముడు కుమారునిగా, మహారాజుగా, భర్తగా, సోదరునిగా, తండ్రిగా ఆదర్శప్రాయుడన్నారు. బాలకాండలోని శ్లోకాలను, విషూచికా మహమ్మారి నివారణ మంత్రమును ఎస్వీబీసీ ప్రత్యక్ష ప్రసారంలో కోట్లాది మంది ప్రజలు ఒకేసారి పారాయణం చేస్తే ఫలితం అనంతంగా ఉంటుందని వివరించారు.
ఆచార్య ప్రవా రామకృష్ణ సోమయాజి, శ్రీ కె.రామానుజాచార్యులు, శ్రీ పివిఎన్ఎన్.మారుతి, శ్రీ ఐ.సత్యకిషోర్ శ్లోక పారాయణం చేశారు. అఖండ పారాయణంలో ధర్మగిరి వేద పాఠశాల, ఎస్వీ వేద విశ్వవిద్యాలయం అధ్యాపకులు, ఎస్వీ ఉన్నత వేద అధ్యాయన సంస్థకు చెందిన వేద పారాయణ దారులు, రాష్ట్రీయ సంస్కృత విశ్వవిద్యాలయానికి చెందిన శాస్త్రీయ పండితులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా అన్నమాచార్య ప్రాజెక్టు కళాకారుడు శ్రీ ఉదయభాస్కర్ బృందం రామనామ సంకీర్తనలను ఆలపించారు.
ఈ కార్యక్రమంలో టిటిడి అధికారులు, పండితులు, విశేష సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.
Discussion about this post