ముఖ్యమంత్రిగారూ… మేము టీచర్లమే… కానీ వెట్టి చాకిరీగాళ్లం కాదు… ఎందుకంటే వెట్టి చాకిరీకన్నా ఘోరంగా మమ్మల్ని వాడుకుంటున్నారు. సర్కారు గిరీ వచ్చిందంటే ఇంట్లో అందరికీ సంబరమే. ఒక పండగ లాంటి వాతావరణం ఉంటుంది. తొలి నెలజీతం చేతికి రాగానే అందరికీ పార్టీలు ఇవ్వడం.. సంబరాలు చేసుకోవడం… అంతా బాగానే ఉంటుంది. కానీ తర్వాత తర్వాత అందులో ఉండే బాధలు గోదాలో ఉండేవాడికే లోతు తెలిసినట్టు మాకు మాత్రమే తెలుస్తాయి.
ప్రభుత్వం వారికి ఎలాంటి నివేదిక కావాలన్నా అది మేమే చేసిపెట్టాలి. ఎలాంటి లెక్కలు సేకరించాలన్నా అది మేమే చేయాలి. ఇళ్ల సర్వే, జనాభా లెక్కల సేకరణ, పశువులు తదితరాల లెక్కల సేకరణ, ఎన్నికల నిర్వహణ ఇలా ఇది అది అని కాదు… కాస్త తలతో పనిచేయాల్సిన అన్ని పనులకు మమ్మల్ని వెనుకముందు ఆలోచించకుండా వాడేసుకుంటారు. కాదంటే వారిపై చర్యలు… మెమోలు… సంజాయిషీలు… ఇలా బోలెడు. అయినా మేము అన్నింటినీ సహిస్తూ, మాకు రాని పనులను కూడా నేర్చుకుని చేస్తూనే ఉన్నాం. వరదలు వచ్చినపుడు అవతలి ఒడ్డుకు వెళ్లడానికి వీలు లేని పరిస్థితుల్లో ఎలాగోలా అవతలి ఒడ్డుకు చేరుకుని బడుల తాళాలు తెరిచి పాఠాలు చెప్పాం. వెళ్లడానికి కనీస ప్రయాణ సౌకర్యాలు కూడా లేని ప్రాంతాల్లో నడిచి వెళ్లి పాఠశాల తాళం తెరిచి విద్యార్థులకు బోధించాం. సరైన బోధనా వనరులు లేకున్నా… మా సొంత డబ్బుతో కొన్నింటిని సమకూర్చుకుని పాఠాలు చెప్పి విద్యార్థులను అభివృద్ధి పధంలోకి పయనించేలా చేశాం. ఇన్ని చేస్తున్నాం… అయినా మేమంటే అందరికీ చిన్న చూపే… మాకు కాస్త జీతాలు పెంచండి మహాప్రభో అంటే… ఎప్పటికోగానీ జీతాలు పెంచడానికి సుముఖత చూపరు.
కేంద్రం కరువు భత్యం పెంచినా… రాష్ట్రం మాత్రం ఆ ఊసే ఎత్తదు. అదే ఎమ్మెల్యేలకు, సర్పంచ్ లకు ఇలాంటి రాజకీయ నాయకులకు మాత్రం జీతాలు పెంచడానికి ముందుంటారు. మాపై దయతలచి ఏదో కొంత కరువు భత్యం రూపేణా ప్రకటిస్తే దాన్ని మీడియా వారు పెద్ద పెద్ద అక్షరాలతో ప్రచురిస్తారు. దీంతో సామాన్యుడికి వీళ్లంతా సర్కారు సొమ్ము ఉత్తి పుణ్యానికే తినేస్తున్నారనే భావం సహజంగా కలుగుతుంది. చేసే సాయం గోరంత… పొందే ప్రచారం కొండంత… చందంగా తయారవుతోంది. ఇప్పుడు కొత్తగా కరోనా మహమ్మారి ప్రపంచాన్ని వణికిస్తోంది. ఈ నేపధ్యంలో ప్రపంచంలోని పలు దేశాలు పాఠశాలలను మూసేశాయి. మన దేశంలో కూడా ఇంతకాలం పాఠశాలలను మూసేసి వున్నా… తాజాగా ఆంధ్రప్రదేశ్ సర్కారు వారు మాత్రం రెండు రోజుల నుండి పాఠశాలలను ప్రారంభించడం అనేది మా ప్రాణాలకు వచ్చింది.
రెండు రోజులకే పలువురు ఉపాధ్యాయులు కరోనా కోరల్లో చిక్కుకున్నారు. ఇక మునుముందు మరెంతమంది ఉపాద్యాయులు కరోనా కాటుకు గురి కానున్నారో తెలయడం లేదు. సర్కారు మాత్రం హెల్త్ కార్డుపై కరోనా వైద్యం అందించాలని చెబుతున్నా మరోవైపు ప్రైవేటు ఆసుపత్రుల్లో మాత్రం ససేమిరా అంటన్నారు. దీంతో చేసేది లేక సొంత డబ్బుతో వైద్యం చేయించుకోవాల్సి వస్తోంది. ఉన్నా లేకున్నా అప్పు చేసి అయినా ప్రాణాలు కాపాడుకోవాలి కదా… ఇలాంటి పరిస్థితుల్లో మేం చేసేది ప్రభుత్వ ఉద్యోగమేనా… లేక వెట్టి చాకిరీనా అనే అనుమానం వస్తోంది.
ఇకనైనా సర్కారు వారు కాస్త కనికరించి ఉపాధ్యాయుల సమస్యలను అర్థం చేసుకుని ఇలాంటి సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకునే ముందు మాలాంటి సమిధల గురించి కాస్త ఆలోచిస్తే బాగుంటుందేమో… అందుకే అంటున్నాం… మేం టీచర్లమే కానీ… వెట్టి చాకిరీ కూలీలము కాము… మా గురించి కూడా కాస్త ఆలోచించండి సార్…
.
Discussion about this post