ప్రపంచస్థాయి వసతులతో పేదలకు ఉచిత సేవలు.
ఇలాంటి సమ్మిట్లతో నూతన వైద్యులకు ఎంతో ఉపయోగం.
ఆపరేటివ్ ఆర్థో ప్లాస్టీ జాతీయ సమ్మిట్ ప్రారంభసభలో టీటీడీ ఈవో ఎవి ధర్మారెడ్డి.
ప్రపంచ స్థాయి వసతులతో అభివృద్ధి చేసిన బర్డ్ ఆసుపత్రి దేశంలోని అనేక క్లిష్టమైన సర్జరీలకు రెఫరల్ ఆసుపత్రిగా తయారైందని టీటీడీ ఈవో ఎవి ధర్మారెడ్డి చెప్పారు.
గ్రాండ్ రిడ్జ్ హోటల్ లో శుక్రవారం ఆయన బర్డ్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న మూడు రోజుల జాతీయ స్థాయి ఆర్థో ప్లాస్టీ సదస్సును ప్రారంభించారు.
ఈ సందర్బంగా ఈవో మాట్లాడుతూ, దేశంలో ఇలాంటి సమ్మిట్ లు అరుదుగా జరుగుతాయని, అందులో కూడా 10 నుండి 12 దాకా మాత్రమే లైవ్ సర్జరీలు చేస్తారని చెప్పారు. బర్డ్ ఆధ్వర్యంలో తొలిసారి నిర్వహిస్తున్న సమ్మిట్ లోనే 22 లైవ్ సర్జరీలు నిర్వహించడం గర్వకారణమని ధర్మారెడ్డి చెప్పారు. దేశంలో పేరొందిన టాప్ 20 ఆర్థో సర్జన్లు ఇక్కడికి వచ్చి సర్జరీలు చేస్తున్నారని తెలిపారు. దేశంలోని వివిధ ప్రాంతాల నుండి సుమారు 200 మంది సర్జన్లు పాల్గొనడం గొప్ప విషయమన్నారు. ఇలాంటి సమ్మిట్‌లు సర్జరీల్లో నైపుణ్యాన్ని పెంచుకోవడానికి, కొత్త విషయాలు తెలుసుకోవడానికి ఉపయోగ పడతాయని ఆయన తెలిపారు. బర్డ్ లో క్లిష్టమైన, అరుదైన ఆపరేషన్లే కాకుండా సెరిబ్రల్ పాల్సీ తో పాటు ఇతర క్లిష్టమైన ఆపరేషన్లు కూడా పేదలకు ఉచితంగా చేస్తున్నామని చెప్పారు. దేశం లోని వివిధ ప్రాంతాల నుండి అనేక మంది వైద్య నిపుణులు బర్డ్ కు వచ్చి పేదలకు ఉచితంగా ఆపరేషన్లు చేస్తున్నారని ఆయన వివరించారు. సమ్మిట్‌లో పాల్గొన్న సర్జన్లు కూడా బర్డ్ లో పేదలకు ఉచితంగా ఆపరేషన్లు చేయడానికి ముందుకు రావాలని పిలుపు నిచ్చారు. ఇలా ఉచిత సేవ చేయడానికి ముందుకొచ్చే డాక్టర్లకు వసతి, రవాణా, భోజనం, తిరుమల స్వామివారి దర్శనం ఉచితంగా కల్పిస్తామని ఈవో చెప్పారు. సమ్మిట్‌ను చక్కగా నిర్వహిస్తున్న బర్డ్ ప్రత్యేకాధికారి డాక్టర్ రాచపల్లి రెడ్డెప్ప రెడ్డి, డాక్టర్ ప్రదీప్, డాక్టర్ వేణుగోపాల్, డాక్టర్ దీపక్ బృందాన్ని ఈవో ప్రత్యేకంగా అభినందించారు.
హిప్ రీప్లేస్‌మెంట్ నిపుణులు, హైదరాబాద్ మెడికవర్ ఆసుపత్రి
హెచ్ఓడి డాక్టర్ కృష్ణ కిరణ్ మాట్లాడుతూ, ప్రపంచ పటంలో బర్డ్ ఆసుపత్రి చోటు సంపాదించే రోజు రాబోతోందని చెప్పారు. కొత్త సర్జన్లు ఇక్కడి కొచ్చి నేర్చుకోవాల్సిన విషయాలు ఎన్నో ఉన్నాయని చెప్పారు. స్విట్జర్లాండ్ దేశానికి చెందిన ప్రముఖ ఆర్థో సర్జన్ డాక్టర్ మార్టిన్ జిమ్మర్‌మాన్ హిప్ రీప్లేస్‌మెంట్ సర్జరీలో నూతన పరిజ్ఞానం గురించి పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇచ్చారు. ఈ సమ్మిట్ కొత్త సర్జన్లకు ఎంతో ఉపయోగపడుతుందని అన్నారు.
న్యూఢిల్లీలోని ఎయిమ్స్ ఆర్థోపెడిక్స్ విభాగాధిపతి డాక్టర్ రాజేష్ మల్హోత్రా మాట్లాడుతూ కీళ్ల మార్పిడి, మోకాలి మార్పిడికి సంబంధించి దేశవ్యాప్తంగా నిపుణులుగా ఉన్న వైద్యులను ఒకే వేదిక పైకి తీసుకొచ్చి పేదరోగులకు క్లిష్టతరమైన శస్త్రచికిత్సలు నిర్వహించడం ఎంతో గొప్ప విషయమన్నారు. ఇంతటి బృహత్తర బాధ్యతను తీసుకున్న బర్డ్ ఆసుపత్రి దేశంలోనే ప్రముఖ ఆసుపత్రిగా అభివృద్ధి చెందుతుందన్నారు. నిపుణులైన సీనియర్ సర్జన్లు శస్త్రచికిత్సలు చేస్తూ యువ వైద్యులకు సందేహాలను నివృత్తి చేయడం సంతోషకరమన్నారు. ఇలాంటి అవకాశం చాలా అరుదుగా లభిస్తుందన్నారు. ఈ సదస్సులో పాల్గొనే అవకాశం కల్పించినందుకు బర్డ్ ఆసుపత్రి యాజమాన్యానికి కృతజ్ఞతలు తెలియజేశారు.
కాగా మొదటి రోజు స్విట్జర్లాండ్ లోని సీరమ్ టెక్ ఆసుపత్రికి చెందిన డాక్టర్ మార్టిన్ జిమ్మర్‌మ్యాన్, కోల్‌కతా అపోలోకు చెందిన డాక్టర్ బి.డి ముఖర్జీ, సికింద్రాబాద్ లోని కిమ్స్ వైద్యులు డాక్టర్ ఉదయ్ కృష్ణ, బెంగళూరులోని ఎస్టర్ వైద్యులు డాక్టర్ జెవి.శ్రీనివాస్, కోయంబత్తూర్ లోని గంగ ఆసుపత్రి వైద్యులు డాక్టర్ రాజ్ కుమార్, హైదరాబాదులోని కేర్ ఆస్పత్రి వైద్యులు డాక్టర్ చంద్రశేఖర్, న్యూఢిల్లీలోని ఎయిమ్స్ వైద్యులు డాక్టర్ రాజేష్ మల్హోత్రా సదస్సులో ఉపన్యసించారు.
జేఈవో సదా భార్గవి, చీఫ్ ఆడిట్ ఆఫీసర్ శేష శైలేంద్ర, బర్డ్ ప్రత్యేకాధికారి డాక్టర్ రాచపల్లి రెడ్డెప్పరెడ్డి, మెరిల్ సంస్థ ప్రతినిధి డాక్టర్ వివేక్, తిరుపతి ఆర్థో పెడిక్ సొసైటీ అధ్యక్ష్యులు డాక్టర్ పూర్ణ చంద్ర రావు, సహ అధ్యక్ష్యులు డాక్టర్ విష్ణుకుమార్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
బర్డ్ ఆసుపత్రి లోని అధునాతన ఆపరేషన్ థియేటర్ల నుండి వైద్య నిపుణులు నిర్వహించిన క్లిష్టమైన సర్జరీలను సర్జన్లు లైవ్ ద్వారా వీక్షించారు.
Discussion about this post