కాలంమారుతోంది. దీంతో అన్నింటిలోనూ ఆడవాళ్లు తన సామర్ధ్యాలను ప్రదర్శిస్తూ ముందుకు దూసుకుపోతున్నారు. అయితే మిగిలిన విషయాల్లో ఎలా వున్నా వివాహం విషయంలో మాత్రం మొన్నటివరకు కాస్త వెనుకంజలోనే ఉన్నట్టు కనిపించేవారు. ప్రేమ వివాహాలు, కాదంటే పెద్దలు కుదిర్చిన వివాహాలు చేసుకునేవారు. కానీ ఇటీవల ఒక వధువు చూపిన ధైర్యం మరికొంతమంది ముదితలకు ధైర్యాన్నిచ్చిందనే చెప్పవచ్చు.
ఇటీవల కోయంబత్తూరులో ఒక వివాహం జరగడానికి వరుడు, వధువు తరపున బంధువులు అందరూ కూడా కళ్యాణ మండపానికి వచ్చేశారు. వివాహ తంతు కూడా జరుగుతోంది. ఆ సమయంలో వధువు ఒక బాంబు లాంటి విషయాన్ని బయటపెట్టింది. తనకు పెళ్లి కొడుకు ఇష్టం లేదని… తను మరొకరిని ప్రేమించానని… సదరు ప్రేమికుడు వస్తే అతడినే వివాహం చేసుకుంటానని… ఒకవేళ అతను రాకుంటే అప్పుడు నిన్నే చేసుకుంటానని పాపం వరుడికి ఛాయిస్ ఇచ్చిందట… దీంతో ఇటు వరుడితోబాటు అతని తల్లిదండ్రులు మాకొద్దీ పిల్ల అంటూ వెళ్లిపోగా… నీ చావు నువ్వు చావంటూ పిల్ల తల్లిదండ్రులు కూడా వధువుని వదిలేసి వెళ్లిపోయారు… మరోవైపు నమ్ముకున్న ప్రియుడు నట్టేనముంచి కనిపించకుండా పోయాడు. దీంతో పాపం ఏం చేయాలో తెలియక మండపంలో బిక్కమొగం వేయడం వధువు వంతయింది.
ఈ నేపధ్యంలో.. ఇదేమాదిరి పరిస్థితులలో తాజాగా మరొక వధువు కూడా నువ్వంటే నాకిష్టం లేదంటూ నేరుగా వరుడితోనే చెప్పడంతో షాక్ తినడం వరుడివంతయింది. అంతేకాదు… బలవంతంగా తనకు పెళ్లి చేస్తున్నారంటూ తనప్రియుడి ద్వారా పోలీసులకు ఫిర్యాదు కూడాచేయించింది. పోలీసులు రంగప్రవేశంతో పెళ్లి ఆగిపోయింది. చిత్తూరు జిల్లా గుర్రంకొండలో ఈ ఘటన జరిగింది. ఎంఆర్‌వో సమక్షంలో అధికారులు వధువును చెన్నైకు పంపించారు.
కోయంబత్తూరు ఘటన వల్ల మగువల్లో తెగువ వచ్చిందేమో అనుకుంటే… తెగువ మంచిదే… కానీ ఇలా చావు తెలివిలాగా పీటల మీదకు వచ్చేదాకా ఇంట్లో చెప్పకుండా నానిస్తే ఎంత రాద్ధాంతం అవుతుందో చూశారు కదా? కాస్త ముందుగానే తల్లిదండ్రులకు తమ ఇష్టాయిష్టాలను చెప్పి, వారిని ఒప్పిస్తే… మరొక కుటుంబం మనవల్ల బాధపడకుండా ఉంటుందికదా…! అమ్మాయిలు మంచి తెగువ గల వారిగానే మారుతున్నారు గానీ.. వారి తీరు తల్లిదండ్రులను భయపెడుతోంది.
.

Discussion about this post