సీఏఏ, ఎన్నార్సీ పేరుతో దేశంలో చాలా రభస జరుగుతోంది. మూలాలు, పర్యవసానాల గురించి కూడా సరైన అవగాహన లేకుండా.. ఏదో ఒక ప్రసంగానికి, ఏదో ఒక భావజాలానికి లోబడి ప్రజలు తమ తమ అభిప్రాయాలు ఏర్పాటుచేసుకుంటున్నారు. మూలాలు తెలుసుకోకుండానే.. వాదించుకుంటున్నారు. ఇలాంటి నేపథ్యంలో వీలైనంత సరళంగా.. సాకల్యమైన వివరాలను అందించేందుకు ‘ఆదర్శిని డాట్ కామ్’ ద్వారా మేళ్ల కృష్ణయ్య చేస్తున్న ప్రయత్నం ఈ వ్యాసం…
దేశవ్యాప్తంగా రెండు నెలలుగా జరుగుతున్న ఆందోళనలు అర్థ రహితమైనవే. భవిష్యత్తులో ఏదో జరుగుతుందని ఊహించి ఆందోళనలు చేస్తుండడం అవగాహన లేమికి నిదర్శనం. దేశంలో సి ఎ ఎ, ఎన్ ఆర్ సి అమలుపై జరుగుతున్న దుష్ప్రచారం సైతం ఆందోళనకు కారణం అవుతున్నాయి. వాస్తవానికి పౌరసత్వ చట్టానికి జరిగిన సవరణ దేశంలోని పౌరులకు సంబంధించింది కాదు. కాబట్టి దేశంలోని పౌరులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు.
ఇపుడు పౌరసత్వ చట్టానికి ఎందుకు సవరణ చేయాల్సి వచ్చిందో పరిశీలిద్దాం. బంగ్లాదేశ్ నుంచి సరిహద్దులోని అస్సాంలో కి లక్షలాది మంది ప్రజలు 1971 యుద్ధ సమయంలో వలస వచ్చారు. తర్వాత అస్సాంలోని స్థానిక ప్రజల్లో వలస వచ్చిన వారి పట్ల వ్యతిరేకత మొదలైంది. తమ సంస్కృతి పాడవుతుందని అస్సాం ప్రజల్లో ఆందోళన నెలకొంది. దీంతో కేంద్ర ప్రభుత్వం ప్రజలకు భరోసా ఇచ్చే ప్రయత్నంగా, మూడున్నర దశాబ్దాల ముందు కొన్ని చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా పలు కేసులు సుప్రీంకోర్టులో దాఖలు అయ్యాయి. ఈ కేసుల్లో సుప్రీం కోర్టు తీర్పు ఇస్తూ జాతీయ పౌర పట్టికను తయారు చేయాలని ఆదేశించింది. ఇందుకు విధి విధానాలను కేంద్రం నిర్దేశించింది.
ఈ ప్రక్రియ గత ఐదేళ్లుగా కొనసాగి, గత ఏడాది ముగిసింది. ఈ క్రమంలో దాదాపు 19 లక్షల మంది స్థానికేతరులని లెక్క తేలింది. వాస్తవానికి సర్వే సందర్భంగా క్షేత్రస్థాయిలో అక్కడక్కడా పొరపాట్లు జరిగి ఉండవచ్చు. ఈ దృష్ట్యా మరోసారి క్షుణ్ణంగా నివేదికలను పరిశీలించాలని కేంద్రం నిర్ణయించింది. స్థానికేతరులైన 19 లక్షల మందిలో దాదాపు 14 లక్షల మంది ప్రజలు హిందువులే. ఇస్లామిక్ దేశమైన బంగ్లాదేశ్‌లో హిందువులు మత వివక్ష ఎదుర్కొంటున్నందున అధిక సంఖ్యలో వలస వచ్చారు. హిందువులతో పాటు ఇతర మతస్తులు స్వల్ప సంఖ్యలో వలస వచ్చిన వారిలో ఉన్నారు. ఆ సర్వే నివేదిక బహిర్గతం అయ్యాక కేంద్రం ఆలోచనలో పడింది. మత వివక్ష కారణంగా అధిక సంఖ్యలో ముస్లిమేతరులు వలస వచ్చినందున వీరికి భారత పౌరసత్వం ఇవ్వాలని కేంద్రం భావించింది. ఇందుకోసం భారత పౌరసత్వం చట్టానికి సవరణ అవసరం అయింది. ఈ నేపథ్యంలోనే 1955 పౌరసత్వ చట్టానికి సవరణ తీసుకు వచ్చింది.
చట్టం సవరణ మేరకు బంగ్లాదేశ్‌తో పాటు ముస్లిం దేశాలుగా అధికారికంగా ప్రకటించుకున్న పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్ నుంచి మత వివక్ష వల్ల భారత దేశంలోకి వచ్చిన హిందువులు, క్రైస్తవులు, జైనులు, పార్సీలు, సిక్కులు, బౌద్ధులు.. ఈ ఆరు మతాలకు చెందిన ప్రజలకు పౌరసత్వం ఇవ్వాలని సవరణ చట్టం పేర్కొంది. ఇందుకు ఈ వ్యవధిని 11 సంవత్సరాల నుంచి ఆరేళ్లకు కుదించింది. అంటే 2014 డిసెంబరు చివరి నాటికి పై మూడు దేశాల నుంచి వచ్చి దేశం లో స్థిరపడిన 6 మతాలకు చెందిన ప్రజలకు పౌరసత్వం లభిస్తుంది.
కేవలం మూడు దేశాల నుంచి నిర్దేశిత వ్యవధిలో వచ్చి నివాసం ఉంటున్న వారికి పౌరసత్వం ఇచ్చేందుకు చట్ట సవరణ వీలు కల్పిస్తుంది. అంతేతప్ప దేశంలో ఇది వరకే పౌరులుగా ఉన్న వారి పౌరసత్వం తొలగింపు ప్రస్తావనే లేదు. దీనిపై అనవసరంగా దుష్ప్రచారం జరిగింది అనేది స్పష్టం అవుతోంది.
ఇక జాతీయ పౌర పట్టిక తయారీ ప్రస్తుతానికి అస్సాంకే పరిమితం అయింది. దేశవ్యాప్తంగా పౌర పట్టిక అమలు చేస్తామని కేంద్రం చెబుతోంది. స్వాతంత్రం తర్వాత తొలిసారిగా జాతీయ పౌర పట్టిక దాదాపు ఏడు దశాబ్దాలకు ముందు జరిగింది. తర్వాత దానిని నవీకరించలేదు. ఇప్పుడు దేశవ్యాప్తంగా పౌర పట్టికను తయారు చేయడం అవసరమని కేంద్రం భావిస్తోంది. ఇందుకు సంబంధించి మార్గదర్శకాలు ఇంకా రూపొందలేదు. మార్గదర్శకాలు వెలువడక ముందే అస్సాంలో క్షేత్ర స్థాయిలో జరిగిన పొరపాట్లు ఆధారంగా దేశవ్యాప్తంగా ఒక వర్గానికి అన్యాయం జరిగి పోతుందని ఊహించి ఆందోళనలు చేయడం అంతు పట్టడం లేదు. భవిష్యత్తులో ఇదివరకే దేశపౌరులు అయిన ఏ వర్గానికి అన్యాయం జరిగినా సుప్రీంకోర్టు జోక్యం చేసుకుంటుందనడంలో సందేహం లేదు. అంతేకాక అన్యాయం జరిగిన ప్రజలకు అండగా దేశం యావత్తు నిలుస్తుంది. పౌరసత్వ చట్టానికి జరిగిన సవరణ ఇతర దేశాల నుంచి వచ్చిన వారికి పౌరసత్వం ఇవ్వడానికి తప్ప దేశంలోని పౌరులకు పౌరసత్వం తొలగించడానికి కాదు.
Discussion about this post