ఏపీ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి ‘తన మంత్రివర్గాన్ని పునర్వ్యవస్థీకరించ బోతున్నారు’ అనే ప్రచారం స్థానంలో- ఇప్పుడు కొత్త మాట వినిపిస్తోంది. క్యాబినెట్ నుంచి కొందరిని తొలగించడం, కొందరిని తీసుకోవడం ద్వారా పునర్వ్యవస్థీకరణ అనేది కాకుండా- ఏకంగా నూటికి నూరు శాతం అందరినీ తొలగించేసి కొత్త క్యాబినెట్ తెస్తారని కొత్త ప్రచారం మొదలైంది. అయితే ఇలా క్యాబినెట్ సమూల ప్రక్షాళన అనేది ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి సాధ్యమవుతుందా అనేది మిలియన్ డాలర్ ప్రశ్న.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాలలో ఈ సరికొత్త పుకారుకు బాలినేని శ్రీనివాస్ రెడ్డి తెరలేపారు. నూరు శాతం మంత్రులను తొలగించడం ద్వారా.. కొత్త వారికి అవకాశం కల్పిస్తాం అంటూ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గత కేబినెట్ సమావేశం తర్వాత, తనతో అన్నారని అందుకు వ్యక్తిగతంగా తాను అంగీకారం తెలిపారని ఆయన వెల్లడించారు. జగన్ తో- మామ బాలినేని సులువుగానే తన అంగీకారం తెలిపి ఉండొచ్చు. కానీ మిగిలిన వారంతా అదేరీతిగా స్పందిస్తారా? తమను తాము అతి బలవంతులుగా భావించుకునే స్థాయి నాయకులు, మంత్రులుగా ఉన్నవారు.. తమను పక్కన పెడితే సహించగలరా? అసలు.. నూరుశాతం ఉన్నవారినంతా ఇంటికి పరిమితం చేసి కొత్త కేబినెట్ ను ఏర్పాటు చేయడం జగన్ కు సాధ్యమయ్యే పనేనా? అనే చర్చ ఇప్పుడు రాజకీయ వర్గాల్లో నడుస్తోంది.
జగన్మోహన్ రెడ్డి- తాను ముఖ్యమంత్రిగా అధికారం చేపట్టినప్పుడే.. రెండున్నరేళ్ల తర్వాత.. మంత్రివర్గాన్ని పునర్ వ్యవస్థీకరిస్తాననే ప్రకటన చేశారు. అప్పట్లో అందరూ ఆ నిర్ణయాన్ని అభినందించారు. రెండున్నరేళ్లు పరిశీలించి.. పనితీరు సరిగా లేని మంత్రులను తొలగించే నిర్ణయం తీసుకుంటే గనుక.. అటు పార్టీకి, ఇటు రాష్ట్రానికి, ప్రజలకు కూడా ఎంతో మేలు జరుగుతుందని అంతా అనుకున్నారు.
కానీ రెండున్నరేళ్లు గడుస్తున్న ప్రస్తుత సమయంలో.. ఇవాళో రేపో సరిగా పనిచేయని, అవినీతిపరులైన మంత్రులందరూ ఇంటికి వెళ్తారని, సరైన పనిచేసేవాళ్లు వస్తారని ప్రజలు ఆశ పడుతున్న సమయంలో.. ఇలా కంప్లీట్ కేబినెట్ మొత్తం కొత్తవాళ్లే వస్తారనే ప్రచారం తెరపైకి వచ్చింది. దీనివలన.. బాగా పనిచేసే మంత్రులు కూడా ఇంటికి వెళ్లాల్సిందేనే అనే అభిప్రాయాలు ప్రజలకు కలుగుతున్నాయి.
పైగా ఇలాంటి ఏర్పాటు- పార్టీలో నాయకులకు మంత్రి పదవిని ఉపాధిగా కల్పించే ఏర్పాటు లాగా ఉంటుందే తప్ప.. ప్రతిభను బట్టి, పనితీరును బట్టి పదవులు కట్టబెట్టినట్టుగా ఉండదు. ఇంకో అభిప్రాయం కూడా ప్రజల్లో కలుగుతోంది. సుదీర్ఘ కాలం మంత్రిపదవుల్లో కొనసాగడం ద్వారా.. జగన్ తర్వాతి నెంబర్ టూ స్థానం నాదే అనగలిగేంత బలమైన నాయకులు ఎవరైనా తయారౌతారేమో అనే భయం ప్రభుత్వ అధినేతలో ఉన్నట్లుగా భావిస్తున్నారు.
పార్టీలో నిజంగానే అతి బలవంతులైన మంత్రులు కొందరు ఉన్నారు. వారందరినీ.. ఒక్క నిర్ణయంతో పక్కన పెట్టేయడం టెక్నికల్ గా సాధ్యం కావచ్చు. కానీ.. దానివలన జగన్ కు ముందుముందు ఇబ్బందులు ఎదురైనా ఆశ్చర్యం లేదు అనే వాదన వినిపిస్తోంది. ఏది ఏమైనప్పటికీ.. నూరుశాతం కేబినెట్ పునర్ వ్యవస్థీకరణ అనేది అంత ఈజీగా జరిగే పనేనా అనే అనుమానం ప్రజల్లో కలుగుతోంది.
.

Discussion about this post