నాలుగు రోజుల్లో వినాయక చవితి.
శివుడి నాన్న నారాయణ వినాయక బొమ్మలు తయారుచేసి అమ్ముతాడు. బంక మన్నుతోనే చేసి చక్కని ఆకు పసర్లు పూసి సంప్రదాయబధ్ధంగా అమ్మడం తాతల కాలం నుంచి అలవాటు.
అదీకాక అన్ని పండగలకి ఆయా పండగల్లో ఏమి అవసరమవుతాయో అవి అమ్మి ఆ సంపాదనతో శివుణ్ణి చదివిస్తాడు.
వాళ్ళు ఉండేది మామూలు టౌన్.
హైదరాబాదు లోలా పెద్ద పెద్ద వినాయక విగ్రహాల హడావుడి ఏమీ లేని ఊరు. అయినా ఈ మధ్య ఈ ఊరులో కూడా మట్టి వినాయకుడి బొమ్మలు ఎవరూ కొనడం లేదు. అందరూ కెమికల్స్ పూసిన బొమ్మలే కొంటున్నారు. అయినా నారాయణ చాదస్తంగా మట్టిబొమ్మలే చేస్తాడు. దానికోసం వారం రోజులముందు ఒక బుధవారం ఉపవాసం ఉండి మట్టిమీద పసుపు, కుంకుమ, ధాన్యపు కంకులు జల్లి చాలా పవిత్రంగా వినాయకుణ్ణి తలుచుకుని ఆ మట్టితో బొమ్మలు తయారు చేయడం అతనికిష్టం.
మేఘాలు ఆకాశంలో సందడి చేస్తున్నాయి. వానమొదలైంది.
శివా ! శివా! అంటూ మంచంమీద ఉన్న నారాయణ గొంతు నూతిలోంచి వచ్చినట్టుగా మెల్లగా నీరసంగా వినబడుతోంది.
వాన పెరిగింది. పాకచూరులోంచి వాననీరు పాకలోకి చోరబడుతోంది. నారాయణ కొడుకుని కంగారుగా పిలుస్తున్నాడు. తండ్రి పిలుపు విని శివుడు పరుగెత్తుకుంటూ వచ్చాడు. “నాన్న పిలిచావా? అంటూ ఇంట్లోకి వర్షపు నీరు లోనికి రావడం చూసి కంగారు పడి సీవండి గిన్నెలతో నీళ్ళు తోడి బయటకి పోసి, పోసి అలసిపోయాడు.
శివుడికి తల్లి లేదు అన్నీ నాన్నే వాడికి.
నారాయణ కూడా మళ్ళీ పెళ్ళిచేసుకుంటే కొడుకుని వచ్చే ఆడది సరిగ్గా చూడదని భయంవలన మళ్ళీ పెళ్ళి చేసుకోలేదు.
శివుడు తండ్రి దగ్గరకి వెళ్ళి, అయ్యా! జొరం తగ్గలే ! అని నుదుటమీద చెయ్యిపెట్టి చూసి, అమ్మో కాలిపోతోంది! అయ్యా! గోలీ ఏసుకుంటావా ? అని అడిగాడు.
అదేమి వద్దుగాని బయల మన్ను లో నీరు పడి పాడవుతోందేమో సూడు నాన్న ! అని లేవలేక లేచి తూలి పడబోతుంటే తండ్రిని జాగ్రత్తగా పట్టుకొని మంచంమీద కూచోపెట్టి అయ్యా! నేను సూత్తాగా అని వానలోనే పాక పక్కన పడున్న మట్టిని చూసి అయ్యో తడిసిపోతోంది అని గబ గబ పరుగెత్తి పాకలో గోనె సంచి పరచి దానిమీద తన చిన్న చిన్న చేతులతో ఆ మట్టిని చేరవేస్తున్నాడు.
ఆ మట్టే వాళ్ళ జీవనాధారం! నాలుగు రోజుల్లో రాబోయే వినాయకచవితికి తయారుచేయబోయే బొమ్మలు తయారుచేయడానికి పనికొచ్చే మట్టి వానలో తడిస్తే పనికిరాదని కంగారు పడుతూ మట్టిని తీసి ఇంట్లోకి చేరవేయాలని శివుడు తాపత్రయ పడుతున్నాడు.
నారాయణ మూలుగుతూ కొడుకు పడుతున్న కష్టాన్ని చూసి చలించిపోయి,
శివా జాగత్రా! పోన్లే నేను లేసాకా సూద్దారిలే అని అంటే శివుడు ఎంతో లేదయ్య! అయిపోనాది అని కష్టపడి మొత్తం మట్టిని లోపలకి చేరవేసాడు. చీకటిపడింది. వాళ్ళ పాకకి నాలుగు ఇళ్ళఅవతల ఉన్న శివాలయం మీద ఉన్న దీపాల కాంతి ఆ వీధి అంతా ఆవరించింది.
నారాయణ ఆ పాక ఏర్పరుచుకునే సమయంలో ఆ వీథిలో ఏమీ లేవు. శివాలయం చాలా ఏళ్ళతర్వాత వచ్చింది. రోజూ పనిలోకి వెళ్ళే ముందు ఆ గుడిలో ఉన్న వినాయకుణ్ణి, శివపార్వతుల్ని ఓ సారి దణ్ణం పెట్టుకోడం అలవాటు. రత్తాలు శివుణ్ణి కని శివుడిలో ఐక్యమై పోయింది. బిడ్డ ఆలనాపాలనా చూడడంతో నారాయణ జీవితం గడిచిపోతోంది.
అయ్యా! ఈ మజ్జిగ తాగు అంటూ నారాయణకి మాత్ర ఇచ్చి మజ్జిగ తాగించి దుప్పటి కప్పాడు శివుడు. రెండురోజులనుండి కురుస్తున్న వానవల్ల బయటకి వెళ్ళలేని పరిస్థితి. నారాయణకి జ్వరం ఎక్కువై పోయింది.శివుడికి ఏం చేయాలో తెలియక కాళ్ళు చేతులూ ఆడడం లేదు.
ఎదురింటి చంద్రశేఖరం మాష్టారు గారు ఒక్కరే వాళ్ళగురించి పట్టించుకుంటారు . పడుతున్న వానని లెక్కచేయక పరుగెత్తుకుంటూ వెళ్ళి ఆఇంటితలుపు తట్టాడు. చాలాసేపటికి బనీనుతో ఉన్న మాష్టారు బయటకి వచ్చి శివా! ఇలా వచ్చేవేరా? అనగానే మాష్టారండి! మరేమో మా అయ్యకి జొరం తగ్గడం లేదండి నాకు బయమేత్తోందండి అని ఏడుపు మొహంతో చెప్పగానే చంద్రశేఖరం గారు లోపలనుండి గొడుగు తీసుకొని వాడితో పాటు పాకలోకెళ్ళి నారాయణ నుదుట చెయ్యి పెట్టి చూసి జ్వరం ఎక్కువగా ఉందే అని ఆలోచనలో పడ్డాడు.శివుడు అమాయకంగా చూస్తున్నాడు.
చంద్రశేఖరం గారు ఒరేయ్ శివా ! నువ్వు నీళ్ళుతో తడిపి ఈ గుడ్డ తో మీ నాన్న నుదుట మీద అరగంట అరగంటకి వేస్తూ ఉండు. అనిచెప్పి ఇంట్లోకి వెళ్ళి తన దగ్గరనున్న టాబ్లెట్ తీసుకొచ్చి. నారాయణ! కాస్త ఓపిక తెచ్చుకో ! ఈ మాత్ర వేసుకో! అని లేపి మందు మింగించి, శివా! అన్నం తిన్నావా? అని వాడేమి తినలేదని తెలిసి మనస్సు చివుక్కుమనిపించి, అయ్యో వీడి కడుపుగురించి పట్టించుకోలేదని బాథగా అనిపించి మనస్సు చివుక్కుమంది.
రా! అన్నం తిందువుగాని అనగానే , శివుడు మరి నాన్నకో! అనగానే మీ నాన్నకి కూడా పెడదాంలేరా! అని వాడికి కడుపునిండా అన్నం తినిపించి, కాస్త జావ నారాయణకి పంపించాడు.
తెల్లవారింది! కాస్త ఎండపొడచూపింది. మెత్తపడ్డ మట్టిని ముద్దలు చేస్తున్నాడు శివుడు. నారాయణకి జ్వరం తగ్గినా నిస్సత్తువుగా ఉండడం వల్ల ఏ పని చేయలేక పోతున్నాడు.ఇక పండగ ఒక రోజుకొచ్చింది. నారాయణ చాలా బాథపడుతున్నాడు.
ఇన్నేళ్ళుగా బొమ్మలు చేసి అమ్ముతున్నాడు. తన తండ్రి , తాత కూడా మట్టితోను, ఆకుపసర్లు పూసి పవిత్రంగా చేసి అమ్మడం సంప్రదాయంగా పెట్టుకున్నారు. కాని ఇప్పుడేంటి ఇలా జరిగింది. అస్సలు ఓపిక లేదు నీరసం, నిస్సత్తువు తొక్కేస్తున్నాయని బాథ పడుతున్న నారాయణ శివుడు కేసి చూసేడు.
శివుడు తనతండ్రి చేసిన ఎన్నో ఏళ్ళబట్టి చేసిన నమూనా వినాయక బొమ్మలు దగ్గరగా పెట్టుకొని పరిశీలిస్తున్నాడు.పాక బయట కలకలం వినిపించి బయటకి వచ్చిన శివుడికి తన తోటి స్నేహితులు బడికి వెడుతూ శివా! బడికి పోదాం రా! అని పిలుస్తున్న మాటలు విన్న నారాయణ శివా ! బడికి పోరాదా?.అనగానే లేదు నేను పండగ అయ్యాక పోతాను అయ్యా! అని మళ్ళీ గోను బరకం మీద ఉన్న మట్టిముందు జాగిలపడి మట్టిని కలిపి గుండ్రటి ఉండలు చేసాడు. చేసేముందు శ్రథ్థగా దేవుడికి దణ్ణం పెట్టుకున్నాడు.
నాన్న చేసిన నమూనా గణపతుల్లో నాట్య గణపతి, పెద్ద ఎలుకమీద ఎక్కిన గణపతి. శివపార్వతుల పక్కన గణపతి, సింహాసనం మీద కూర్చున్న గణపతులు అలా రకరకాల వాటిని చేసిన నాన్న నారాయణ తో సమానంగా తయారు చేయడానికి శివుడు సిథ్థమయ్యాడు.అలాగే నాన్నకి సాయం చేయడానికి కూడా!
ఇంతలో చంద్రశేఖరం మాష్టారు ఒక గిన్నెలో అన్నం, చారు, కాస్త కూర మజ్జిగ తెచ్చి, నారాయణ ! ఈ మాత్ర వేసుకొని కాస్త చారు అన్నం తిను! ఒరేయి శివ! నువ్వు కూడా అన్నం తిని మీ నాన్నని కనిపెట్టుకొని ఉండు! అవసరమైతే నన్ను పిలవరా! నేను స్కూలుకి వెడుతున్నాను అనగానే! అలాగే అయ్యా! అని లేవలేక లేవబోతున్న నారాయణ ని పడుకో ! నువ్వు విశ్రాంతి తీసుకో! వస్తానే అని ఆయన స్కూలుకి వెళ్ళారు.
శివ అవిరామంగా వినాయకుడి బొమ్మ తయారుచేయడానికి తన చిన్న చిన్న చేతులతో ప్రయత్నం చేస్తున్నాడు. ఎంత ప్రయత్నం చేసినా ఒకసారి తొండం సరిగ్గా వస్తే గజాననుని పొట్ట సరిగ్గారాలేదు. అన్ని సరిగ్గా వస్తే ఎలుక వాహనం మర్చిపోయాడు. బువ్వ తినరా! శివా! అని తండ్రి పిలిచినా వినలేదు ఏకాగ్రతగా చేస్తున్నాడు, సరిగ్గా రాకపోతే మళ్ళీ మళ్ళీ చేస్తున్నాడు.
అలాగ రాత్రి ఒంటిగంట అయింది. నిద్రపోకుండా చమురుదీప కాంతిలో జాగ్రత్తగా నైపుణ్యంగా చేయడానికి చేసిన ప్రయత్నం ఫలించబోతోంది. శివుడు నారాయణుడు గణపతి కి ఇరుపక్కలనుండి ఆశీర్వదిస్తున్నట్టు బొమ్మ తయారుచేసాడు.
తెలతెలవారుతోంది, ఆ రోజే వినాయక చవితి . నిద్రలేచిన నారాయణ తన కళ్ళు తనే నమ్మలేక పోయాడు.గదిలో గోనెమీద ఆరబెట్టిన అందంగా ఉన్న గణపతి బొమ్మలు కనిపించాయి.అలా ఒక పది బొమ్మలు తయారుచేసినట్టున్నాడు. అలిసిపోయి అక్కడే వాటి మథ్య నిద్రపోతున్న పిల్లాణ్ణి చూసిన నారాయణకి కళ్ళల్లో నీళ్ళు తిరిగాయి.నారాయణే వాటికి సహజసిథ్థమైన రంగులు అద్దాడు. శివుడు వాటిని ఒక పళ్ళెంలో పెట్టుకొని వినాయకబొమ్మలు ! వినాయకబొమ్మలోయ్ అంటూ అరుచుకుంటూ వీథుల్లో అమ్ముతున్న కొడుకుని చూసిన నారాయనకి ఏదో తెలియని బలము వచ్చింది.
శివుడి బొమ్మలు అందరికీ నచ్చడం , ఈ మధ్య పర్యావరణం పాడయిపోతోంది అందరూ మట్టి వినాయక బొమ్మలకే పూజలు చేయండి అని పర్యావరణ వేత్తలు గోల పెట్టడం, పండితులు , ఉపన్యాస కర్తలు మట్టి వినాయకుణ్ణే పూజించాలి అని హితవు పలకడం వల్ల, శివుడి తెచ్చిన బొమ్మలు అన్నీ అమ్ముడయ్యాయి కొద్దిగా లాభం కూడా వచ్చింది. కొంత డబ్బుతో కాస్త పత్రి, పువ్వులు, ఒక పాలవెల్లి పట్టుకొని శివుడు ఇంటికెళ్ళి సంబరంగా నాన్న! అన్నీ బొమ్మలు అమ్ముడయిపోయాయి , ఇదిగో డబ్బులు అని చూపించాడు. నారాయణకి ఆనందం తో కళ్ళు చెమ్మగిల్లాయి వాడి చిరు సాయానికి.
..చాగంటి ప్రసాద్ (చా.ప్ర )
Discussion about this post