ఎన్నికల వ్యూహకర్తలు అనే పేరుతో రాజకీయ పార్టీలకు మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్ లు, మార్కెటింగ్ కాంట్రాక్టర్లు, ఈవెంట్ మేనేజర్లు .. ఆ బాపతు సేవలు అందించేవాళ్లు నిన్నటితరంలోనే కదా పుట్టుకువచ్చారు! అంతకుముందు రాజకీయ పార్టీలకు వ్యూహాలు లేవా? పార్టీలు మనుగడలో లేవా? అంచనాలకు భిన్నంగా విజయాలు సాధించిన సందర్భాలు లేవా? అయితే ఇప్పుడు ఎందుకు అంత అతిగా ప్రతి పార్టీ కూడా వ్యూహకర్తల మీద ఆధారపడుతున్నదో అర్థంకాని సంగతి.
తెలుగుదేశం అధినేత నారా చంద్రబాబునాయుడు.. ఎన్నికల వ్యూహకర్తగా కీర్తి ఉన్న ప్రశాంత్ కిషోర్ తో తాజాగా భేటీ అయ్యాక రకరకాల చర్చోపచర్చలు నడుస్తున్నాయి. అయినా పార్టీ వర్గాల్లోనే చంద్రబాబుకు తెలియని వ్యూహాలంటూ ఉంటాయా? అనే చర్చ కూడా నడుస్తున్నది.
ఇప్పుడున్నంత కమ్యూనికేషన్ వ్యవస్థలు లేని రోజుల్లోనే చంద్రబాబునాయుడు క్యాంపు రాజకీయాలు నిర్వహించి.. తాను అనుకున్న కార్యాన్ని నెరవేర్చుకోగలిగే రాజకీయ చాణక్యుడుగా పేరు తెచ్చుకున్నారు. తన రాజకీయ వ్యూహచాతుర్యం మీద అపారమైన నమ్మకం ఉన్నది గనుకనే.. ఆయన గతంలో కేంద్ర రాజకీయాలలో కాంగ్రెసేతర కూటమికి కన్వీనరుగా కూడా వ్యవహరించారు. అలాంటి కీలకమైన నాయకుడికి ఇప్పుడు ఇంకొకరి అవసరం వచ్చిందా? అనేది అందరికీ ఎదురవుతున్న సందేహం.
అయితే చంద్రబాబునాయుడు ప్రధానంగా తన సొంత వ్యూహాల మీదనే ఆధారపడతారని, వాటిని అనుసరించే వెళతారని.. కాకపోతే.. ఈ ఎన్నికలను చాలా కీలకంగా భావిస్తున్నారు గనుక.. ఇప్పుడు మిస్సయితే ముఖ్యమంత్రిగా జగన్ పాతుకుపోతారనే అభిప్రాయంతో ఉన్నారు గనుక.. చాన్స్ తీసుకోకుండా ఉండేందుకు ప్రశాంత్ కిషోర్ కు కోట్లాదిరూపాయలు చెల్లించాల్సి వచ్చినా సరే.. ఆయన వైపు నుంచి వచ్చేవాటిలో కనీసం ఒక చిన్న అయిడియా ఉపయోగపడకపోతుందా అని అనుకుంటుండవచ్చునని పార్టీ నాయకులు భావిస్తున్నారు.
Discussion about this post