లోక కల్యాణార్థం జూన్ 29 నుండి జూలై 5 తేదీ వరకు టీటీడీ పరిపాలన భవనంలోని మైదానంలో శ్రీ శ్రీనివాస చతుర్వేద హవనం నిర్వహణకు వేగంగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. టీటీడీ తొలిసారి తిరుపతిలో ఈ కార్యక్రమం నిర్వహిచనుంది.
మైదానాన్ని ఆధ్యాత్మిక వాతావరణం ఉట్టిపడేలా తీర్చిదిద్దుతున్నారు. యజ్ఞ వేదిక, హోమ గుండాలు, సాంస్కృతిక కార్యక్రమాల వేదిక, బ్యారికేడ్లు, భక్తులు కూర్చుని వీక్షించేందుకు మ్యాట్లు, వేచి ఉండే భక్తులకు ఇబ్బంది లేకుండా చలువ పందిళ్ళు ఏర్పాటు చేస్తున్నారు. భక్తులను ఆకట్టుకునేలా పుష్ప, విద్యుత్ దీపాలంకరణలు ఏర్పాటు చేస్తున్నారు.
ఆంధ్ర ప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల నుండి 32 మంది రుత్వికులు శాస్రోక్తంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. ఉదయం 8 నుండి మధ్యాహ్నం 1 గంట వరకు చతుర్వేద హవనంలో అన్ని వేదాల్లోని మంత్రాలు పఠిస్తూ హోమ కార్యక్రమాలు జరుగనున్నాయి. కార్యక్రమంలో పాల్గొనే భక్తులందరికీ యజ్ఞ ఫలం లభించేలా ప్రతి ఒక్కరితో సంకల్పం చెప్పించనున్నారు. సాయంత్రం 4 నుండి 6 గంటల వరకు చతుర్వేద మంత్ర పారాయణం, సాయంత్రం 6 గంటల నుండి అన్నమాచార్య ప్రాజెక్టు, దాస సాహిత్య ప్రాజెక్టు కళాకారులతో భక్తి సంగీత, నృత్య, ప్రవచన కార్యక్రమాలను ఏర్పాటు చేశారు.
టీటీడీ నిర్వహిస్తున్న ఈ కార్యక్రమంలో హిందూ ధర్మ ప్రచార పరిషత్, శ్రీ వేంకటేశ్వర ఉన్నత వేదాధ్యయన సంస్థ కీలక భూమిక పోషిస్తున్నాయి. భక్తులు ఈ కార్యక్రమంలో పాల్గొని స్వామివారి కృపకు పాత్రులు కావాలని కోరడమైనది.
Discussion about this post