సద్యోముక్తి క్షేత్రమైన శ్రీకాళహస్తిలో.. ముక్కంటి బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. శ్రీకాళహస్తీశుని బ్రహ్మోత్సవాల సందర్భంగా ఉత్సవాల్లో వినియోగించేందుకు ప్రత్యేకంగా చెన్నైనుంచి గొడుగులను కూడా భక్తులు కానుకగా అందించారు.
శ్రీకాళహస్తీశ్వర స్వామి వారి దేవస్థానంవారి ఆధ్వర్యంలో జరుగుతున్న బ్రహ్మోత్సవాల సందర్భంగా శ్రీ స్వామి అమ్మవార్లకు నిర్వహించు ఉత్సవాలు, గ్రామోత్సవాలలో వినియోగించేందుకు అవసరమైన గొడుగులను చెన్నై వాస్తవ్యులు ఆర్.ఆర్.గోపాల్ అందజేశారు. ఆయన హిందూ ధర్మార్థ సమితికి ట్రస్టీగా ఉండడంతో పాటు, దినమలర్ దిన పత్రిక ఛైర్మన్ కూడా. సోమవారం నాడు శ్రీకాళహస్తికి వచ్చి.. శ్రీకాళహస్తీశ్వరాలయ ప్రాంగణంలోని ధ్వజ స్తంభం వద్ద కార్యనిర్వహణాధికారి వారికి గొడుగులను విరాళంగా అందించారు. ఈ గొడుగులతో స్వామివారి ఉత్సవాలు మరింత శోభాయమానంగా అలరారనున్నాయి.

తిరుమలేశునికీ చెన్నై గొడుగులే
అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడు తిరుమల వేంకటాద్రీశునికి కూడా బ్రహ్మోత్సవాల సందర్భంగా చెన్నైలోని హిందూ ధర్మార్థ సమితినుంచి గొడుగులు కానుకగా వస్తాయి. తిరుమలేశునికి ఏటా మొత్తం 11 గొడుగులు సమర్పిస్తుంటారు. శ్రీవారి బ్రహ్మోత్సవాల తొలిరోజునే చెన్నైలోని చెన్నకేశవాలయం నుంచి గొడుగులతో కాలినడకన తిరుమల వచ్చి వీటిని స్వామివారికి సమర్పిస్తుంటారు.
తిరుమలేశుని ఉత్సవాల్లో గొడుగులు చెన్నైనుంచి కానుకగా వచ్చేవికాగా, పూలమాలలు ప్రత్యేకంగా తమిళనాడులోని శ్రీవిల్లిపుత్తూరు నుంచి తరలివస్తాయి. అలాగే.. తెలంగాణలోని గద్వాల సంస్థానం నుంచి ఏరువాడ జోడు పంచెలు కూడా స్వామివారికి కానుకగా వస్తుంటాయి.

దేశంలోని చాలా హిందూ ఆలయాలకు ఉత్సవాల సందర్భాల్లో గొడుగులను కానుకగా ఇవ్వడం అలవాటుగా గల హిందూ ధర్మార్థ సమితి.. ఇప్పుడు అదే తరహాలో శ్రీకాళహస్తీశ్వరుని ఉత్సవాలకు కూడా గొడుగులను ఇవ్వడం విశేషం.
.

Discussion about this post