చంద్రగిరి ఎమ్మెల్యే తుడా ఛైర్మన్ చెవిరెడ్డి భాస్కర రెడ్డికి మంత్రి పదవి లేనట్టే. ఈ విషయంలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి.. క్లారిటీ ఇచ్చేశారు. తుడా ఛైర్మన్ గా చెవిరెడ్డి పదవీకాలాన్ని రెండేళ్లపాటు పొడిగిస్తూ శనివారం ఉత్తర్వులు జారీ అయ్యాయి. ఈ నియామకపు ఉత్తర్వుల ద్వారా.. ఇక మంత్రి పదవి లేనట్టే అని స్పష్టీకరించినట్లు అయింది.
చిత్తూరు జిల్లా నుంచి చాలా గట్టిగా మంత్రి పదవి ఆశిస్తున్న వారిలో తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి, నగరి ఎమ్మెల్యే రోజా ఉన్నారు. శ్రీకాళహస్తి ఎమ్మెల్యే మధుకు మంత్రి పదవి రావాలని కూడా అభిమానులు పూజలు చేస్తున్నారు. ఇదంతా ఇలా ఉండగా ఆ జిల్లా నుంచి ప్రస్తుతం ఉన్న మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి.. కొనసాగింపు ఉంటుందనే వార్తలు కూడా ముమ్మరంగా ఉన్నాయి.
ఇక్కడొచ్చిన సమస్య ఏంటంటే.. ఈ జిల్లానుంచి మంత్రి పదవిని గట్టిగా ఆశిస్తున్న వారంతా ఒకే రెడ్డి వర్గానికి చెందిన వారు. పెద్దిరెడ్డిని కొనసాగించడం జగన్‌కు తప్పనిసరి అయ్యే పరిస్థితుల్లో అదే జిల్లా నుంచి అదే సామాజిక వర్గానికి చెందిన మరొకరికి ఎలా స్థానమిస్తారనేది ప్రశ్న. అయినా ఈ ముగ్గురిలో ఆశలు మెండుగానే ఉన్నాయి.
ప్రస్తుతానికి తుడా ఛైర్మన్ పదవిని కొనసాగిస్తూ ఉత్తర్వులు రావడంతో చెవిరెడ్డిక పదవి రావడం లేదని క్లారిటీ వచ్చేసింది. చెవిరెడ్డికి ప్రస్తుతం ఉన్న పదవి ఈ ఏడాది జూన్ 12న ముగుస్తుంది. అందుకు రెండు నెలల ముందుగానే మరో రెండేళ్లు కొనసాగించే ఉత్తర్వులు రావడం.. ఆయనలో అసంతృప్తి రేగకుండా ఉండడానికే అని అర్థమవుతోంది.
చెవిరెడ్డికి మంత్రి పదవి లేదని తేలిపోయింది. మరి ఆ అవకాశం ఎవరిని వరిస్తుంది? భూమన కరుణాకర రెడ్డినా? రోజానా? అనేది మీమాంస. ఇద్దరూ ఎవరికి వారు దేవుళ్లను వేడుకుంటూ పూజాదికాలు నిర్వహిస్తూ గుడులు తిరుగుతూ బిజీగా ఉన్నారు. మరో రెండు రోజుల్లో ఈ సస్పెన్స్ కూడా తీరుతుంది.
.

Discussion about this post