తెలుగులో కూడా చెప్పుకోదగ్గ ప్రేక్షకుల ఫాలోయింగ్ ఉన్న తమిళ హీరో సూర్య. అలాగే తెలుగు మార్కెట్ ను కూడా దృష్టిలో పెట్టుకుని ఆమెజాన్ ప్లాట్‌ఫాం కోసం తక్కువ బడ్జెట్ లో ప్లాన్ చేసుకుని సూర్య-జ్యోతిక స్వయంగా నిర్మించిన చిత్రం ‘జైభీమ్’! ఇలాంటి నేపథ్యంలో ఈ చిత్రం ఎలా రూపొందింది.. ప్రేక్షకులను ఎలా మెప్పిస్తోంది? అనేదీ చర్చనీయాంశం.
తరాలు మారుతున్నా సరే.. నిమ్నవర్గాల అణచివేత అనేది ఫిలిం మేకర్లకు ఎప్పటికీ ఒక ఆకర్షణీయమైన సబ్జెక్టే. తమిళ పరిశ్రమకైతే మరీ ఎక్కువ! అలాంటి సబ్జెక్టులను డీల్ చేయడం తమ ముద్రగా కలిగిన దర్శకులూ కొందరున్నారు. వారిని అనుసరిస్తూ.. కీర్తి గడించవచ్చుననుకునే వారు బోలెడు మంది ఉన్నారు. సమకాలీన, వర్తమాన ప్రపంచంలో వారికి అలాంటి నిమ్నవర్గాల అణచివేత దృష్టాంతాలు దొరక్కపోతే గనుక.. రెండు మూడు దశాబ్దాలు వెనక్కి వెళ్లి సినిమా కథను తయారు చేసుకోవడం అనేది.. ఒక టెక్నిక్ గా ఇటీవలి కాలంలో బాగానే చెలామనీ అవుతోంది.
ఇటీవల కాలంలో వాస్తవికతను ప్రతిబింబిస్తూ వచ్చిన కొన్ని సినిమాలు ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. జై భీమ్ కూడా ఆ తరహా సినిమా అని చాలా మంది భావించారు. తొంభయ్యో దశకంలో తమిళనాడులో ఒక గిరిజనుడిని పోలీసులు అక్రమంగా నిర్బంధించి, చంపేస్తారు. ఆ తర్వాత అతని శవాన్ని మాయం చేస్తారు. అప్పుడు చంద్రు అనే లాయర్ హైకోర్టులో పోరాడి, న్యాయాన్ని గెలిపిస్తాడు. చంద్రు గారికి అంబేడ్కర్ రచనలు స్ఫూర్తి అని సినిమా చివర్లో చెప్పారు. ఆ రకంగా టైటిల్ జస్టిఫై చేశారు.
అయితే విచారణ సినిమా ప్రేక్షకులను ఆలోచింప జేస్తే, జై భీమ్ సినిమాలో దర్శకుడు జ్ఞాన్ వేల్ చిన్న తల్లి ఇతర ఆదివాసీ పాత్రల పట్ల మనలో జాలి కలుగజేయాలని ప్రయత్నించి, సినిమాను పాడుచేశాడు.
కథ లోకి వస్తే చెంచు తెగకు చెందిన రాజన్న, చిన్నతల్లి అనే జంట ఎలుకల్ని పట్టుకుంటూ తండాలో జీవిస్తుంటారు. రాజన్న (మణి కందన్) ఒక పామును పట్టడానికి ఊరి సర్పంచ్ ఇంటికి వెళతాడు. ఆ తర్వాత ఆ ఇంట్లో నగలు చోరీకి గురవుతాయి. రాజన్న మీద పోలీసులకు అనుమానం వస్తుంది. వేరే ఊరికి పనికి పోయిన రాజన్న లేకపోవడంతో అతని భార్య చిన్నతల్లి ( లైజో మొల్ జో)ను, వారి చుట్టాలను పోలీసులు చిత్రహింసలు పెడతారు. ఆ తర్వాత రాజన్న ను పట్టుకుని హింసిస్తే అతను చనిపోతాడు.
పోలీసులు దాని ఏక్సిడెంట్‌గా చిత్రీకరిస్తారు. అప్పుడు చంద్రు ( సూర్య) అనే లాయర్ రంగంలోకి దిగి పోలీసులకు శిక్షలు పడేలాచేసి చిన్న తల్లి, ఆమె చుట్టాలకు న్యాయం జరిగేలా చూస్తాడు.
ఈ సినిమాలో ప్రతి ఒక్కరూ గొప్పగా నటించారు. నిర్మాణ విలువలు గొప్పగా ఉన్నాయి. అయితే మంచి కథ మంచి సినిమాగా మారాలంటే కొన్ని జాగ్రత్తలు, కొంత సున్నితత్వం తప్పనిసరి. చంద్రు పాత్ర మీద ఎక్కువ దృష్టి పెట్టి, కథను కలగాపులగం చేశాడు దర్శకుడు.
‘అదృష్టాన్ని నేను నమ్మను. న్యాయాన్ని నమ్ముతాను’ అని సూర్యతో ఒక చోట అనిపిస్తాడు.
చంద్రు కోర్టులో వాదించడం తప్ప ఆ పాత్రకు రంగు, రుచి, వాసన లేవు. ఆదివాసీల జీవితాన్ని ప్రతిబింబిస్తూ మొదలైన సినిమా తర్వాత గాడి తప్పుతుంది. ఒక ఎస్‌ఐ తప్పులు చేస్తుంటే, డీజీపీ, ఐ జీ, అడ్వకేట్ జనరల్, అందరూ కిందా మీద పడటం హాస్యాస్పదంగా, చిరాగ్గా అనిపిస్తుంది.
‘పోలీసులకు చెడ్డపేరు రాకూడదు’ అని పదే పదే అనే డీజీపీ తప్పు మీద తప్పు చేస్తున్న ఎస్ ఐ ను ఎందుకు సస్పెండ్ చేయడో అర్థం కాదు. కారల్ మార్క్స్, లెనిన్, పెరియార్, అంబేడ్కర్ ఫోటోలను, బొమ్మలను చూపించారు సినిమా అంతా. అలాగే ఎర్ర జండాలను చూపించారు. కానీ సినిమాలో సెన్సిబిలిటీ లేదు. రాజకీయ నాయకత్వం, మీడియా పాత్ర చూపించక పోవడం వల్ల సమగ్రత రాలేదు. సూర్య జ్యోతిక లు నిర్మించిన ఈ సినిమా టెక్నికల్ గా గొప్పగా ఉంటే, కథా పరంగా బలహీనంగా ఉంది. బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ ఉపయోగించి హింసను గ్లోరి ఫై చేయడం వల్ల ఇబ్బందిగా అనిపిస్తుంది.
.. రాజేంద్రప్రసాద రెడ్డి
సీనియర్ పాత్రికేయుడు
(సమీక్ష విమర్శకుని దృష్టికోణం మాత్రమే)

.

Discussion about this post