ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి బ్లేడు రెడీగా పెట్టుకుని ఉన్నారుట. టైం చూసి కోసేస్తారట. ఈ మాట అన్నది ఎవరో తెలుసా.. బీకామ్ లో ఫిజిక్స్ చదివిన ప్రముఖుడిగా దాదాపుగా దేశంలో అందరి దృష్టిని ఆకర్షించిన పాపులర్ మాజీ ఎమ్మెల్యే, తెలుగుదేశానికి చెందిన జలీల్ ఖాన్.
ఈ జలీల్ ఖాన్ గురువారం నాడు విజయవాడకు చెందిన మంత్రి వెలంపల్లిపై ఒక రేంజిలో విరుచుకు పడ్డారు. మంత్రి వెల్లంపల్లి ఒక బచ్చా! చంద్రబాబు ను ఏకవచనంతో పిలుస్తారా!? అంటూ ఆగ్రహించారు. రాష్ట్రం లో దేవాలయాల్లో హుండీల కంటే… వెల్లంపల్లి హుండీ ఎక్కువ నిండుతోందని ఆయన అక్రమార్జనల గురించి.. హెచ్చరించారు.
దుర్గ గుడిలో కోటిన్నర స్క్రాప్ ను మంత్రి 15 లక్షలకే అమ్మేశాడని ఆరోపించారు. అధికారుల బదిలీల్లో దోచుకుంటున్నారని అన్నారు. జగన్ బ్లేడ్ సిద్ధం గా పెట్టాడని, ఎప్పుడో గాని కోత పెడతాడని.. వెల్లంపల్లికి పదవీ గండం ఉందన్నట్లుగా జలీల్ ఖాన్ అన్నారు. వెలంపల్లి పదవికోల్పోయిన తర్వాత.. మరోమారు, మళ్ళీ పార్టీ మారేందుకు మంత్రి సిద్ధం గా ఉండాలని ఎద్దేవా చేశారు.