దుబ్బాక ఎమ్మెల్యే స్థానానికి ఉపఎన్నిక పోలింగ్ మంగళవారం జరుగుతుంది. సాయంత్రానికి పోలింగ్ పూర్తవుతుంది. ఇప్పటిదాకా దుబ్బాక కేంద్రంగా తెరాస, కాంగ్రెస్, బీజేపీ పార్టీలు విపరీతంగా మాటలు, విమర్శల యుద్ధం చేశాయి. ఒకరినొకరు నానా మాటలు అనుకున్నారు. ఆదివారం సాయంత్రం ప్రచారానికి తెర పడడంతో మాటల యుద్ధం ఆగింది. ఈ పార్టీల మధ్య విమర్శల జడివానకు కేంద్రస్థానం అనేది దుబ్బాక కాకుండా, హైదరాబాదుకు మారింది. అయినా ఒక రకంగా వాతావరణం స్తబ్దుగానే ఉంది. మంగళవారం పోలింగ్ నాడు కూడా సాయంత్రం దాకా ఇదే స్తబ్దత కొనసాగుతుంది. సాయంత్రం తర్వాత ఏమవుతుంది. ఈ రెండురోజులు సైలెంట్ గా ఉన్న నాయకులు ఆ తర్వాత ఏం మాట్లాడతారు?
పోలింగ్ తర్వాత.. అక్రమాలు, అరాచకాల ఆరోపణలు
‘ప్రభుత్వం పోలింగ్ లో అక్రమాలకు పాల్పడింది. అధికారాన్ని అడ్డుపెట్టుకుని అనేక దుర్మార్గాలకు పాల్పడింది. రీపోలింగ్ కు డిమాండ్ చేస్తాం.’ అని ఈ రెండు పార్టీలు డిమాండ్ చేసే అవకాశం ఉంది. పోలింగ్ సందర్భంగా పరిస్థితి మొత్తం అదుపు తప్పిపోయిందని.. రీపోలింగ్ జరిగితే తప్ప ప్రజాస్వామ్యానికి న్యాయం జరిగే అవకాశం లేదని ఆ రెండు పార్టీలు గళమెత్తే అవకాశం కనిపిస్తోంది.
రిజల్ట్ తర్వాత.. అక్రమాలతో నెగ్గారనే ఫిర్యాదుల
అదే సమయంలో.. కౌంటింగ్ పూర్తయి ఎన్నికల ఫలితాలు వచ్చిన తర్వాత వీరు ఏం మాట్లాడతారు. ‘ప్రభుత్వం అక్రమాలు చేసినందువల్ల మాత్రమే గెలిచింది. ఈ ఎన్నికను రద్దు చేయాలి. లేకపోతే ప్రజాస్వామ్యాన్ని చంపేసినట్టే’ అని ఇదే పార్టీలు మళ్లీ కొన్నాళ్లు గోలచేసే అవకాశం కనిపిస్తోంది.
ఎందుకలగ?
రేపు ఏం గోల చేయాలో.. పార్టీలు ఇవాళే నిర్ణయించుకున్నట్లుగా కనిపిస్తోంది. ఏంటి కారణం అని ప్రశ్నిస్తే గనుక.. ఎవ్వరికైనా దొరికే సమాధానం ఒక్కటే. ఈ దుబ్బాక ఉప ఎన్నికలో అధికార పార్టీకే విజయావకాశాలు కనిపిస్తున్నాయి. సర్వేల్లో తెరాస వ్యతిరేకత వ్యక్తమైంది. బీజేపీ గెలుస్తుందని వచ్చింది.. అని ఆ పార్టీ కొంత ప్రచారం చేసుకున్నది గానీ.. ఎట్టి పరిస్థితుల్లోనూ తెరాసనే గెలుస్తుందని సమాచారం.
దీనికి పెద్ద రీజనింగ్ కూడా అనవసరం. సాధారణంగా సిటింగ్ ఎమ్మెల్యే చనిపోయినప్పడు.. వారి కుటుంబ సభ్యులే ఉప ఎన్నికలో పోటీచేస్తే విజయావకాశాలు ఖచ్చితంగా వారికే ఉంటాయి. సానుభూతి చాలా పెద్ద ఫ్యాక్టర్ గా ఓటింగ్ పై ప్రభావం చూపిస్తుంది. అత్యంత అరుదైన సందర్భాల్లో తప్ప.. వేరేరకమైన ఫలితం ఇలాంటి ఉప ఎన్నికలో రాదు. అందుకే చాలా సార్లు.. పార్టీలో పోటీ పెట్టకుండానే వెనక్కు తగ్గుతుంటాయి. కానీ దుబ్బాక విషయంలో సోలిపేట రామలింగా రెడ్డి కుటుంబానికి సానుభూతి పనిచేసి ఆయన భార్య నెగ్గే అవకాశమే ఎక్కువ అని పలువురి అభిప్రాయం. అందుకే ఓడిపోయిన తర్వాత కేసీఆర్ మీద, హరీష్ మీద, తెరాస పార్టీ మీద ఎలాంటి నిందలు వేయాలో.. ఆ రెండు పార్టీలు ఇప్పటినుంచే స్క్రిప్టు సిద్ధం చేసుకుంటున్నాయనిన తెలుస్తోంది.
(ఇదీ చదవండి : పవన్ వారి ఆబ్లిగేషన్‌ను పట్టించుకోలేదా )
Discussion about this post