జిహెచ్ఎంసి ఎన్నికల ఫలితాల్లో ఓటమికి బాధ్యతగా ఉత్తమ్ రాజీనామా తరువాత నూతన పిసిసి ఎంపిక ప్రక్రియ కసరత్తు కొనసాగుతూనే ఉందని మాణిక్కమ్ టాగూర్ ప్రకటించారు. సాగర్ ఉప ఎన్నిక పూర్తయ్యేదాకా అధ్యక్ష ప్రకటన ఉండదని తేల్చి చెప్పారు. నాగార్జున సాగర్ నుంచి పోటీ చేసేందుకు జానారెడ్డి సమ్మతించారని అన్నారు. కొద్దిరోజుల్లో నాగార్జున సాగర్ అసెంబ్లీ ఉప ఎన్నిక ఉంది కాబట్టి పిసిసి అధ్యక్ష ఎంపిక వాయిదా వేయాలని జానారెడ్డి కోరారన్నారు.
జానారెడ్డి విజ్ఞప్తి పై తెలంగాణ కాంగ్రెస్ నేతల అభిప్రాయాలు తీసుకున్నామని, సోనియాగాంధీకి నేతల అభిప్రాయాలు వెల్లడించి, ఆమె సూచన మేరకు నాగార్జున సాగర్ ఉప ఎన్నిక తరువాతే నూతన అధ్యక్షుడి ప్రకటన ఉంటుందని అన్నారు.
నాగార్జున సాగర్, వరంగల్ మున్సిపల్ ఎన్నికలకు ఉత్తమ్ కుమార్ రెడ్డి నేతృత్వంలోని బృందంతో వెళ్తామని మాణిక్కమ్ ఠాగూర్ అన్నారు.
మరీ అంత భయమా
అధ్యక్షుడు ఎవరో ప్రకటించడానికి కాంగ్రెస్ పార్టీ మరీ భయపడిపోతున్నట్టుంది. ఎవరి పేరు చెబితే ఎవరికి కోపం వస్తుందో.. ఎవరెవరు పార్టీ వీడిపోతారో అని సంకోచంలో ఉంది. అందుకే.. సాగర్ ఉప ఎన్నిక పేరుతో ప్రస్తుతానికి గండం గడిచినట్లు ఫీలవుతోందని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు.