కేరళ ప్రాంతంలో ఏపీఎంసీ చట్టం లేదని, వ్యవసాయ మార్కెట్లు కూడా లేవని అలాంటప్పుడు వాళ్లు ఎందుకు ఆందోళన చేయడం లేదంటూ ప్రధాని నరేంద్ర మోడీ వ్యాఖ్యానించడాన్ని ఆలిండియా కిసాన్ సభ తీవ్రంగా ఖండించింది. ఈ మేరకు ఈ సభ ఒక ప్రకటనను విడుదల చేసింది.
కేరళలో వ్యవసాయం విషయంలో ప్రధాని తప్పుదోవ పట్టిస్తున్నారని కిసాన్ సభ ఆరోపించింది. కేరళ, జమ్ము-కాశ్మీర్ వంటి రాష్ట్రాల్లో ఏపీఎంసీ చట్టాలు లేకపోవడానికి చారిత్రక కారణాలు ఉన్నాయని, కేరళలో సుమారు 82% వాణిజ్య పంటలే సాగు చేస్తారని ఈ సందర్బంగా ఆలిండియా కిసాన్ సభ వెల్లడించింది.
కేరళలో కొబ్బరి, జీడి పప్పు, రబ్బర్, టీ, కాఫీ, మిరియాలు, యాలకులు, లవంగాలు మొదలైన వాణిజ్య పంటలే పండిస్తారని, ఈ పంటలకు సంబంధించిన మార్కెటింగ్ అంతా స్పెసెస్ బోర్డ్, కాఫీ బోర్డ్, టీ బోర్డ్, కోకోనట్ డెవలప్మెంట్ అథారిటీ, రబ్బర్ బోర్డ్ వంటి ప్రత్యేక బోర్డుల ద్వారా జరుగుతుందని, ప్రపంచ మార్కెట్ ధరలకు అనుగుణంగా ఈ పంటలకు ధర లభిస్తుందని ఈ సందర్భంగా కిసాన్ సభ తెలిపింది.
ఈ నేపధ్యంలో కేంద్రం కొబ్బరి పంటకు కనీస మద్ధతు ధర ప్రకటించ లేదని తెలిపింది. ఈ పంటల వ్యాపారం ద్వారా విదేశీ మారకం ఎక్కువగా తెచ్చిపెడుతున్నా కేంద్రం మాత్రం క్రమేణా ఈ బోర్డులను నిర్వీర్యం చేస్తోందని కిసాన్ సభ ఆరోపించింది. దేశంలో బీజేపీ-కాంగ్రెస్ ప్రభుత్వాలు ఇండియా ఆసియా ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్లు చేసుకుని నష్టం కలిగిస్తున్నాయని కిసాన్ సభ ఆరోపించింది.
గతంలో రైతుల సంక్షేమం కోసం ఎల్డీఎఫ్ ప్రభుత్వం ఎన్నో కార్యక్రమాలు చేపట్టింది. కనీస మద్ధతు ధర కంటే ఎక్కువ చెల్లించి వరి సహా అనేక పంటలు సేకరించిందని ఈ సందర్భంగా ఆలిండియా కిసాన్ సభ గుర్తు చేసింది. ఇకనైనా ప్రధాని మోదీ అవాస్తవాల ప్రచారం ఆపి కేరళ తరహాలో చర్యలు తీసుకునే ప్రయత్నం చేయాలని ఈ సందర్భంగా ఆలిండియా కిసాన్ సభ డిమాండ్ చేసింది.
.

Discussion about this post