వారం రోజులు.. 10,446 కేసులు. పాజిటివిటీ రేటు 56.21శాతం. ఇదేదో రాష్ట్ర రిపోర్టు కాదండోయ్.. చిత్తూరు జిల్లాలో అధికారికంగా నమోదైన కొవిడ్ కేసులు. ఇందులో సగానికి పైగా తిరుపతి లోనివే. జిల్లాలో కొవిడ్ ఉధృతి ఎలా ఉందో ఈ లెక్కలే మనకు సాక్ష్యం. పరీక్షల సంఖ్య పెంచితే.. కొవిడ్ కేసులు రెట్టింపు సంఖ్యలో బయట పడతాయని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు.
చిత్తూరు జిల్లాలో కరోనా కల్లోలం సృష్టిస్తోంది. పల్లె, పట్నం తేడా లేకుండా ఈ వైరస్ తన ప్రతాపం చూపుతోంది. గత రెండు దశల్లో ఇంత పెద్ద మొత్తంలో కేసులు నమోదు కాలేదని వైద్యశాఖ వర్గాలు అంటున్నాయి. పవిత్ర పుణ్యక్షేత్రంగా ప్రపంచ ప్రసిద్ధి గాంచిన తిరుపతిలో ఏ వీధికి వెళ్లినా కరోనా బాధితులే. తిరుపతికి వెళితే.. కొవిడ్ బారి నుంచి తప్పించుకోవడం కష్టం అనే భయం జనంలో పట్టుకుంది అంటే.. పరిస్థతి ఎంత తీవ్రంగా ఉందో అర్థం చేసుకోవచ్చు.
తిరుపతిలోనే లక్ష మందికి పైగా జ్వర పీడితులు ఉన్నారని అనధికారిక అంచనా. ప్రభుత్వం పరీక్షలు భారీగా తగ్గించినా.. ఈ నగరంలో రోజుకు సగటున 600కు పైగా కొవిడ్ కేసులు నమోదు అవుతున్నాయంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఇక చిత్తూరు, మదనపల్లె, శ్రీకాళహస్తి, పుంగనూరు, పలమనేరు, నగరి, పుత్తూరు, కుప్పం పురపాలక సంఘాల పరిధిలో సైతం కొవిడ్ కేసులు నిత్యం పెద్ద సంఖ్యలో నమోదవుతున్నాయి.
గ్రామీణ ప్రాంతాల్లో సైతం మూడవ దశ ప్రభావం చాలా ఎక్కువగా కనిపిస్తోంది. చిత్తూరు జిల్లాలో ఈ నెల 15 నుంచి 21వ తేదీ వరకు 18,582మందికి పరీక్షలు నిర్వహించగా.. ఇందులో 10,446 మందికి కరోనా సోకినట్లు నిర్దారణ అయింది. ఈ లెక్కన వారం రోజుల్లో నిర్వహించిన పరీక్షల్లో 56.21 శాతం పాజిటివిటీ రేటు నమోదైంది.
దేశ రాజాధాని ఢిల్లీలో కూడా ఈ తరహా కేసులు రాలేదని వైద్యశాఖ వర్గాలే చెబుతుండటం విశేషం. రోజు వారీ పరిశీలిస్తే.. 15న 2,155 పరీక్షలు చేయగా 1,039 మందికి.. 16న 1,759మందికి పరీక్షలు చేయగా 1,124 మందికి.. 17న 4,097 మందికి పరీక్షలు చేయగా 1,004 మందికి.. 18న 3,216 మందికి పరీక్షలు చేయగా 1,534 మందికి.. 19న 2,929 మందికి పరీక్షలు చేయగా 1,822 మందికి.. 20న 2,626 మందికి పరీక్షలు చేయగా 2,338 మందికి.. 21న 1,800 మందికి పరీక్షలు చేయగా 1,585 మందికి కొవిడ్ సోకినట్లు నిర్దారణ అయింది.
ఇవి అధికారిక గణాంకాలు. ఇవి చూస్తేనే కొవిడ్ ఉధృతి ఎలా ఉందో మనకు అర్థమవుతోంది. ప్రభుత్వం కిట్ల కొరత సాకు చూపకుండా చిత్త శుద్ధితో పరీక్షలు నిర్వహిస్తే.. ఇంతకు రెట్టింపు సంఖ్యలో కేసులు బయట పడతాయనడంలో ఎలాంటి సందేహం లేదు. కరోనా పరీక్షలు చేయలేదంటూ శుక్రవారం మదనపల్లె ప్రభుత్వ ఆస్పత్రి వద్ద బాధితులు ధర్నా చేశారంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు.
ఏ కారణంగానో ఒక్కో ప్రభుత్వ ఆస్పత్రిలో రోజుకు 20కి మించి పరీక్షలు చేయొద్దని కీలక అధికారులు మౌఖిక ఆదేశాలు చేయడంతో క్షేత్రస్థాయిలో ఈ దుస్థితి ఏర్పడింది. వాస్తవాలు కప్పి పుచ్చడానికి అధికారులు ఇలా చేస్తున్నారనే ఆరోపణ ఉంది. అధికారులు ఇకనైనా స్పందించి చిత్తశుద్ధితో కొవిడ్ పరీక్షలు నిర్వహించి.. అవసరమైన వారందరికీ వైద్య సదుపాయాలు అందించాల్సి ఉంది. లేదంటే కొవిడ్ బాధితులు ఇబ్బందులు పడే అవకాశం ఉంది. వ్యాధి ఉధృతి మరింత పెరిగే ప్రమాదం కూడా ఉంది..!
.

Discussion about this post