రాజకీయాల్లో తృతీయ ప్రత్యామ్నాయం అనే పదం చాలా తరచుగా, ముమ్మరంగా వినిపిస్తూ ఉంటుంది. అలాంటి తృతీయ ప్రత్యామ్నాయం లాంటిదే.. ‘తృతీయ ప్రధాన కులం’! ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాలకు సంబంధించినంత వరకు రెండు ప్రధాన కులాలు రెండు ప్రధాన పార్టీలను సొంతం చేసుకున్నాయి. ఆ పార్టీలు ఎంతగా కులం రంగు పులుముకున్నాయో మనకు తెలియదు గానీ.. ప్రజలు మాత్రం.. ఆ పార్టీలకు రంగు పులిమేశారు.
అధికారంలో ఉన్న వైఎస్సార్ కాంగ్రెస్ రెడ్ల పార్టీ అని, ప్రతిపక్షంగా ఉన్న తెలుగుదేశం కమ్మవాళ్ల పార్టీ అని విస్తృతంగా ప్రచారం ఉంది. రాష్ట్రంలో ఉన్న అగ్రవర్ణాల్లో మూడో ప్రధాన కులం కాపు వర్గమే. మనల్ని అందరూ వాడుకుంటున్నారు తప్ప.. మన కులానికి అధికారం దక్కదా? అనే ఎజెండా.. ఆ కులం వాళ్లు ప్రత్యేకంగా పార్టీ పెట్టుకోవాలనే ప్రయత్నాలు కూడా చాలా తరచుగా వినిపిస్తూ ఉంటాయి. ఇటీవలి ముద్రగడ పద్మనాభం ఇంటిలోకూడా అలాంటి భేటీ ఒకటి జరిగింది.
ఇవన్నీ కూడా పక్కన పెడితే.. కాపు వర్గాన్ని.. రాజకీయ పార్టీలు అన్నీ అక్కున చేర్చుకోవడానికి శతథా ప్రయత్నిస్తూ ఉంటాయనేది నిజం. కాపులను బీసీల్లో చేరుస్తామని టీడీపీ ప్రకటించినా.. కాపు కార్పొరేషన్ తదితర రూపాల్లో వారికి తమకు మించి ప్రాధాన్యం ఇచ్చిన వారు లేరని వైసీపీ ప్రకటించుకున్నా.. అందుకే! చివరికి రాష్ట్రంలో ఏదో ఒక నాటికి అధికారం దక్కుతుందనే ఆశతో రాజకీయం చేస్తున్న భారతీయ జనతా పార్టీ కూడా.. గతంలోనూ, ఇప్పుడు కూడా.. కాపు వర్గం వారినే రాష్ట్రసారథులుగా నియమించి.. ‘తృతీయ ప్రధాన కులాన్ని’ అధ్యక్ష స్థానంలో కూర్చో బెట్టేది తాము మాత్రమే అని సంకేతాలు ఇవ్వడానికి ప్రయత్నిస్తూ ఉంటుంది.
మరోవైపు ఆ వర్గానికే చెందిన పవన్ కల్యాణ్ జనసేన పార్టీ రాజకీయాలు కాపు ముద్ర తమంతగా వేసుకోకపోయినా.. ఆ వర్గంలోని చాలా మంది ఆ పార్టీని సొంతం చేసుకుంటున్న మాట నిజం. అలాగే.. గతంలో చిరంజీవి ప్రజారాజ్యం పార్టీ స్థాపించినప్పుడు కూడా జరిగింది అదే.
చిరు భేటీ సంకేతాలు ఏంటి?
కాపు సామాజిక వర్గం చుట్టూతా ఇన్ని సమీకరణలు నడుస్తున్న నేపథ్యంలో.. ఆ వర్గంలో అయోమయం సృష్టించడానికి.. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి.. మాజీ కేంద్రమంత్రి చిరంజీవితో విందు సమావేశం నిర్వహించారా? అనేది ఇప్పుడు అనేకమంది మదిలో మెదలుతున్న ప్రశ్న. ఆ వర్గం నుంచి.. ఒకవైపు జనసేనాని పవన్ కల్యాణ్.. ప్రభుత్వం మీద విపరీతమైన దూకుడుతో దాడి చేస్తూనే ఉన్నారు.
ప్రభుత్వం తీసుకుంటున్న ప్రతి నిర్ణయంలోని లోపాలను చాలా సూటిగా ఎత్తిపొడుస్తూనే ఉన్నారు. సినిమా టికెట్లు, సినిమా పరిశ్రమకు సంబంధిచిన సంక్షోభం విషయంలో కూడా ప్రభుత్వం తీరును అందరికంటె ముందు తప్పుపట్టింది.. పవన్ కల్యాణే. ఆయన బహిరంగంగా ప్రభుత్వం తీరును విమర్శిస్తూ.. ఇవాళ నన్ను ఇబ్బంది పెట్టడానికి ప్రభుత్వం నిర్ణయాలు తీసుకోవచ్చు. కానీ ఇండస్ట్రీ స్పందించకుండా ఉంటే మీకందరికీ ఇబ్బందులు తప్పవు అని ఘాటుగానే హెచ్చరించారు.
ఇవాళ పవన్ కల్యాణ్ అన్నదే జరుగుతోంది. అదే సమయంలో పవన్ కల్యాణ్ కు ఆదరణ ఎక్కువగా ఉన్న కాపు వర్గాన్ని ఆయన మాటలు మరింతగా ప్రభావితం చేస్తున్నాయి. ప్రభుత్వానిది కక్షసాధింపు ధోరణి అనే వాదనను పవన్ కల్యాణ్ ప్రజల్లోకి తీసుకువెళ్లగలుగుతున్నారు. ఆయన తరఫున కాపువర్గం ఆ బాధ్యతను అందిపుచ్చుకుంటోంది. ఇలాంటి నేపథ్యంలో కాపుల్లో చీలిక తీసుకురావడం అనేది ప్రభుత్వం ఎంచుకోగలిగిన కనీస ఎత్తుగడ.
జగన్ సర్కారు ఏం చేసింది? పవన్ కల్యాణ్ నోరెత్తిన ప్రతిసారీ.. పేర్ని నానిని మోహరిస్తోంది. పేర్నినాని కేవలం సినిమాటోగ్రఫీ మంత్రి కావడం మాత్రమే కాదు.. కాపు వర్గం వ్యక్తిగా కూడా ప్రెస్ మీట్లలో ప్రభుత్వ వాంఛితాన్ని నెరవేరుస్తున్నారు. పవన్ ప్రస్తావన వచ్చినప్పుడెల్లా.. ‘మావాడే కదా..’ అనే మాట వాడుతూ.. తాను కూడా కాపు వర్గం వాడినే గనుక.. పవన్ కల్యాణ్ అభిమానులైన కాపులు ప్రభుత్వాన్ని వ్యతిరేకించాల్సిన అవసరం లేదు.. అనే సంకేతాలు పంపడానికి ఆయన పాట్లు పడుతున్నారు. అయితే.. కాపుల్లో ఆశించిన చీలిక తేవడానికి పేర్ని నాని బలం సరిపోయినట్లుగా లేదు. తాజాగా.. మెగాస్టార్ నే మోహరించడానికి జగన్ వ్యూహరచన చేసినట్లుగా ఉంది.
విందు భేటీ..
భోగి పండుగ నాడు.. చిరంజీవిని ముఖ్యమంత్రి జగన్ తమ ఇంటికి విందుకు ఆహ్వానించారు. ఇంటివద్దకు రాగానే.. తానే బయటకు వచ్చి స్వాగతించి లోనికి తీసుకువెళ్లారు. ఆయన శ్రీమతి స్వయంగా వడ్డించారు. వంటలన్నీ చాలా రుచికరంగా ఉన్నాయి.
ఈ వివరాలతో పాటు.. ‘జగన్ నాకు తమ్ముడు లాంటివాడు..’ ‘ఎప్పుడైనా భోజనానికి రావొచ్చని ఆహ్వానించారు’ అని చిరంజీవి చాలా మురిపెంగా చెప్పుకున్నారు.
ఒక వైపు సొంత సోదరుడు యుద్ధరంగంలో కాలు దువ్వుతున్నాడు.. శంఖం పూరిస్తున్నాడు.. అస్త్రాలను సంసిద్ధం చేసుకుంటున్నాడు. మరోవైపు ‘అన్నయ్య’ ప్రత్యర్థి యుద్ధ శిబిరంలోకి వెళ్లి.. కొత్త సోదర బంధాన్ని ప్రకటించేశారు.
ఇక కాపువర్గంలో అయోమయం ఏర్పడకుండా ఎందుకుంటుంది?
జగన్ మోహన్ రెడ్డి యుద్ధ తంత్రం కూడా అదే. చీలిక సంగతి తర్వాత.. ముందు ప్రత్యర్థి శిబిరంలో అయోమయం సృష్టించడం. అందులో ఇప్పటికే సక్సెస్ అయ్యారు. ఇక చీలిక సృష్టించడం అనేది రాబోయే రోజుల్లో చాలా సులువుగా సాధ్యమవుతుంది.
ఈ గందరగోళం ఫలితమేంటి..?
అటు చిరంజీవిని, ఇటు పవన్ కల్యాణ్ ను కూడా దేవుళ్లుగా ఆరాధించే కాపు సోదరులు.. రాజకీయంగా తెలుగుదేశం, వైసీపీలలో కూడా పుష్కలంగానే ఉన్నారు. సినిమా వేరు.. రాజకీయం వేరు.. అని వారు తమకు తాము సర్ది చెప్పుకుంటూ ఉంటారు. అలాంటి వారందరికీ కూడా ఇప్పటి పరిణామాలు ఓ గందరగోళం సృష్టిస్తున్నాయి.
తాను ఎంతో ప్రేమిస్తానని ప్రతిసారీ జనసేనాని చెప్పుకునే చిరంజీవి శ్రతు శిబిరంలో చేరిపోవడం.. పవన్ కల్యాణ్ కు నైతిక పరాజయమే. చిరంజీవి విందుభేటీ కేవలం పరిశ్రమకోసం జరిగినట్టుగా లేదు. భేటీ తర్వాత.. ఆయన జగన్ ను బాగా పొగడడమూ.. పరిశ్రమకు ఆమోదయోగ్యమైన పరిష్కారం వస్తుందని.. జగన్ తరఫున పూచీ తీసుకుని తానే హామీ ఇవ్వడమూ కూడా జరిగింది. అప్పటిదాకా పరిశ్రమ నోరెత్తి మాట్లాడవద్దని కూడా.. చిరంజీవి ‘ఒక పరిశ్రమ బిడ్డగా’ ఫత్వా జారీచేశారు కూడా! ఇదంతా కూడా విపరీతమైన గందరగోళం.
అటు పరిశ్రమలోను, ప్రజల్లోను, ఏ వర్గాన్నయితే అన్ని పార్టీలూ టార్గెట్ చేస్తున్నాయో ఆ కాపుల్లోనూ తీవ్ర అయోమయం కలిగించడంలో ప్రభుత్వం కృతకృత్యమైంది.
రాజ్యసభ ఎంపీ పుకార్ల సంగతేంటి?
విందు భేటీ తర్వాత.. ఈ మాజీ కేంద్రమంత్రిని మరోసారి రాజ్యసభకు ఎంపీగా పంపడానికి జగన్ ఆహ్వానించారంటూ.. మరో పుకారు బయల్దేరింది. నిజానికి ఇలాంటి వాటి విషయంలో.. అసలు వ్యక్తులు స్పందించకుండా మౌనం పాటించడం రాజనీతి. కానీ.. చిరంజీవి అంతటి లోతుగా పరిణామాలను చూసే తత్వం లేని వారు గనుక.. వాటిని ఖండించారు. ఆ మాటే రాలేదని అన్నారు. స్పెక్యులేషన్ కు తాను జవాబివ్వనని అన్నారు. అయితే పుకారు మాత్రం మరింత బలపడుతోంది.
ఆ చర్చ వచ్చినా.. ఆ పదవి ఊరిస్తున్నా.. ఇప్పటినుంచి దాని గురించి ప్రజల్లో చర్చకు ఆస్కారం ఇవ్వడం ఎందుకని.. చిరంజీవి అనుకుని ఉండవచ్చు. ‘నేను రాజకీయాలకు దూరంగా ఉన్నాను..’ అని మాత్రమే చిరంజీవి అంటున్నారు. కానీ సాంప్రదాయాలను గమనించినప్పుడు రాజ్యసభ సభ్యత్వాలను రాజకీయాలకు సంబంధం లేని వారికి ఇవ్వడం కూడా రివాజు. ఆయన ఖండించినంత మాత్రాన అది జరగదని అనుకోవడానికి వీల్లేదు.
అదే జరిగితే.. అంటే వైసీపీ తరఫున చిరంజీవి రాజ్యసభ సభ్యుడు అయితే.. కాపు వర్గంలో ఇప్పుడు సక్సెస్‌ఫుల్ గా సృష్టించిన అయోమయానికి సీక్వెల్‌గా చీలిక తీసుకురావడంలో కూడా ప్రభుత్వం ఎత్తుగడ ఫలించినట్లే.
ఇప్పటికే కాపు ఓటు బ్యాంకు మాదంటే మాదని పార్టీలు కొట్టుకుంటున్నాయి. మావి అచ్చంగా కాపు పార్టీలే అని ప్రకటించుకోకపోయినా.. ఎవరైనా ముద్ర వేస్తే అలా ముందుకు వెళ్లడానికి జనసేన, బీజేపీ ఉవ్విళ్లూరుతున్నాయి. ఈ పరిణామాల నడుమ.. ఎన్ని మలుపులు అయినా చోటు చేసుకోవచ్చు. ఏం జరుగుతుందో వేచి చూడాలి.
.. దాసరి కృష్ణమోహన్,
సీనియర్ జర్నలిస్టు
Discussion about this post