తెలుగు ప్రాంతాలకు చెందిన వారు ఉన్నత చదువులు చదువుకుని, ఉద్యోగ, వృత్తి, వ్యాపారాలలో తమ కెరీర్‌ను కొనసాగిస్తూ.. అమెరికాలో స్థిరపడడం అనేది ఎన్నో దశాబ్దాలుగా జరుగుతూనే ఉంది. అయితే.. ఒక ఉద్యమం లాగా చాలాచాలా పెద్ద సంఖ్యలో తెలుగువారు అమెరికాలో స్థిరపడడం అనేది గత యాభయ్యేళ్లుగా జరుగుతూనే ఉంది. 2000 సంవత్సరం తర్వాత.. తెలుగువారు అక్కడ స్థిరపడడం ఊపందుకున్నదని అనుకోవచ్చు.
అక్కడ అనేకరకంగాల్లో మనవారి ముద్ర కనిపిస్తుంది. అయితే ఈ యాభయ్యేళ్లుగా లేని ఒక పరిణామం.. గత రెండేళ్లుగా అమెరికాలో చోటు చేసుకుంటున్నది! అమెరికాలో స్థానిక రియల్ ఎస్టేట్ వ్యాపార రంగంలో తెలుగువారి పెట్టుబడులు గత రెండేళ్ల కాలంలో బాగా పెరిగాయి. మరో రకంగా చెప్పాలంటే.. కేవలం తెలుగువారి పెట్టుబడులు ఇబ్బడి ముబ్బడిగా పెరగడానికి మూలకారణం మాత్రం ఆంధ్రప్రదేశ్ లోనే ఉన్నదంటే ఆశ్చర్యం అనిపిస్తుంది గానీ, అది నిజం.!
ఏపీ ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి వచ్చిన తరువాత.. ఆయన తీసుకుంటున్న ప్రతికూల నిర్ణయాలు అమెరికాలో స్థిరపడిన తెలుగు సంపన్నులను పునరాలోచనలెో పడేశాయి. వారిలో మొదలైన పునరాలోచన, పెట్టుబడులు పెట్టే విషయంలో వారు తమ దృక్పథాన్ని మార్చుకోవడం వెరసి అమెరికాలో రియల్ ఎస్టేట్ రంగం తిరుగులేకుండా వర్ధిల్లేలా.. అక్కడ మన తెలుగువాళ్లు కూడా రియల్ వ్యాపారాన్ని శాసించేలా పరిస్థితుల్ని సృష్టించింది.
పృష్టతాడనాత్ దంత భంగః అన్నట్టుగా.. ఎక్కడో తాడేపల్లిలో కూర్చుని వైఎస్ జగన్మోహన్ రెడ్డి పరిపాలన సాగిస్తోంటే.. మరెక్కడో అమెరికాలో రియల్ ఎస్టేట్ రంగం పరిఢవిల్లడానికి అది ఎలా కారణమవుతుంది? అనే సందేహం మీకు కలుగుతోందా? అయితే వివరాల్లోకి వెళ్లాల్సిందే.
ముందే చెప్పుకున్నట్టు యాభయ్యేళ్లకు పైగా తెలుగువారు అమెరికాకు వలస వెళ్లడమూ చాలా పెద్ద సంఖ్యలో అక్కడ స్థిరపడడమూ జరుగుతూ వచ్చింది. అమెరికాలో తెలుగువారు డాక్టర్లుగా, ఇంజినీర్లుగా, సైంటిస్టులుగా, హోటళ్లు, సూపర్ మార్కెట్లు తదితర స్థానిక వ్యాపారాల్లో చురుకైన వారిగా గుర్తింపు తెచ్చుకున్నారు. అమెరికాలో ఉంటూ కోట్లకు కోట్ల రూపాయలు సంపాదిస్తున్న వారు కూడా.. అక్కడ కేవలం తమ నివాసం కోసం ఆస్తులు చేసుకున్న వారే తప్ప.. అక్కడ అవసరానికి ఒకటిరెండు ఆస్తులు చేసుకోవడం తప్ప ఇతర పెట్టుబడులు ఈ రంగంలో పెట్టేవారు కాదు. వ్యాపార విస్తరణ, వృద్ధికి మాత్రమే పెట్టుబడులు పెట్టేవారు.
అమెరికాలో స్థిరపడిన తెలుగువారు.. తమ సంపాదనను రియల్ రంగంలో పెట్టుబడులు పెట్టాలన్నా, కోట్ల రూపాయలు వెచ్చించి సేవా కార్యక్రమాలు చేయాలన్నా.. తిరిగి తమ స్వస్థలాలనే ఎంచుకునే వారు. ఆ రకంగానే.. రెండు తెలుగు రాష్ట్రాల పరిధిలో కొన్ని వందల కోట్ల రూపాయల విలువైన పనులు ఎన్నారై తెలుగువారి విరాళాలతో ప్రజాసంక్షేమం కోసం జరిగాయి.. జరుగుతున్నాయి. ప్రభుత్వాలతో అనుసంధానమై.. ప్రభుత్వ పథకాలకు కోట్ల రూపాయల విరాళాలు ఇస్తూ విద్యా వైద్య రంగాల్లో విప్లవాత్మక పథకాలు అమలు కావడానికి ఎన్నారై తెలుగువారు కారణం అవుతూ వచ్చారు. ఈ సేవా కార్యక్రమాలకు సమాంతరంగా.. తమ స్వస్థలం గనుక.. ఇక్కడి తెలుగు ప్రాంతాల్లో పెట్టుబడులు పెడుతూ వచ్చారు.
ఆంధ్రప్రదేశ్ రెండు ముక్కలు అయిన తరువాత.. ఇలాంటి ఎన్నారై రియల్ పెట్టుబడులు ఎక్కువగా ఏపీకి మళ్లాయి. హైదరాబాదు పురోగతి స్థిరంగా ఉండగా, అక్కడ పెట్టుబడులు కూడా స్థిరంగానే సాగాయి. అయితే.. చంద్రబాబునాయుడు ముఖ్యమంత్రి కావడం, అమరావతి రాజధాని ప్రకటన, రాష్ట్రంలోని మిగతా ప్రాంతాల్లోనూ ప్రకటించిన పథకాలు వెరసి రియల్ పెట్టుబడులకు ఊతమిచ్చాయి. వందల వేల కోట్ల పెట్టుబడులు ఏపీకి వచ్చాయి. అలాగే అమరావతి రాజధానిలో అపార్ట్ మెంట్స్ కడుతూ వాటికోసం ప్రభుత్వం ఆన్ లైన్ విక్రయాలను ప్రారంభించినప్పుడు వెల్లువలా వాటిని ఎన్నారైలు బుక్ చేసుకున్నారు. ఒక రకంగా చెప్పాలంటే విభజిత ఆంధ్రప్రదేశ్ ఏర్పడిన తొలి అయిదేళ్ల కాలంలో.. ఎన్నారై తెలుగుల పెట్టుబడుల ప్రవాహం ఏపీకి వెల్లువలా వచ్చింది.
తర్వాత పరిస్థితులు మారాయి. జగన్ సీఎం కాగానే, ఈ పెట్టుబడులు మందగించాయి. మూడురాజధానుల ప్రకటన వచ్చిన తర్వాత.. ఆ విషయం కోర్టుకు వెళ్లిన తర్వాత.. అసలు రాష్ట్రంలో ఏ ప్రాంతంలోనూ పెట్టుబడులు పెట్టడానికి ఎన్నారైలు ముందుకు రావడం లేదు. పరిస్థితి ఎటు మారుతుందో అనే సంశయంలో కొట్టుమిట్టాడుతున్నారు. తిరుపతి నుంచి విశాఖ వరకు తెలుగుదేశం హయాంలోనే చాలా అభివృద్ధి జరిగింది. తిరుపతిలో ఐఐటీ లాంటివి కూడా వచ్చాయి. వాటికి తగినట్టుగా రియల్ ఎస్టేట్ రంగం విస్తరించకుండా ఆగింది. రాష్ట్రంలో ఏమూల పెట్టుబడి పెట్టినా.. రేపటి పరిణామాలు ఎలా మారుతాయో వేచిచూద్దాం అనే ధోరణిలో అంతా ఉన్నారు. దీని ఫలితం.. కొంత కాలం.. పెట్టుబడులు హైదరాబాదుకు మరలాయి. ఆ తర్వాత అమెరికాలోని ఎన్నారైలు అందరూ.. అమెరికాలోనే రియల్ ఎస్టేట్ రంగంలో పెట్టుబడి పెడితే మేలనే ఆలోచనకు వచ్చారు.
దాంతో అమెరికాలో రియల్ ఎస్టేట్ రంగం తెలుగు వారి పెట్టుబడులతో వర్ధిల్లుతోంది. సొంత ఊర్లలో పెట్టుబడిపెట్టే అవకాశం లేక.. అక్కడే పెడుతున్నప్పటికీ.. అక్కడ అనూహ్యమైన లాభాలు చవిచూస్తూ తెలుగువారు ఆనందంగానే ఉన్నారు.
రియల్ ఎస్టేట్ పెట్టుబడులు అంటే.. కేవలం ఒక వ్యక్తి పెట్టుబడి అతను పొందే లాభం మాత్రమే కాదు. ఆ పెట్టుబడులకు అనుబంధంగా అనేక రంగాలు యాక్టివ్ గా ఉంటాయి. కొన్ని వేల లక్షల మందికి స్థిరమైన ఉపాధి దొరుకుతూ ఉంటుంది. అలా అదంతా కూడా ఒక సమష్టి అభివృద్ధి వ్యవహారం లాగా ఉంటుంది. అయితే.. వాస్తవంలో అమెరికాలోని తెలుగువారు పెట్టగల ఇలాంటి వేల కోట్ల రూపాయల పెట్టుబడులను, తద్వారా విస్తారంగా జరగగల అభివృద్ధి, ఉపాధి అవకాశాలను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కోల్పోయింది. రిజిస్ట్రేషన్ స్టాంప్ డ్యూటీ ల ద్వారా లభించగల వందల కోట్ల రూపాయల ఆదాయాన్ని కూడా ప్రభుత్వం కోల్పోయింది. తద్వారా జరగగల అభివృద్ధి కూడా స్తంభించినట్టే. ఎన్నారైలకు మాత్రం.. అమెరికాలోనే పెట్టుబడుల వల్ల.. లాభాలు అనుకున్నంతగా వస్తూనే ఉన్నాయి. ఎలాంటి టెన్షన్ లేకుండా ఇప్పుడు దక్కుతున్న లాభాలకు వారు.. జగన్మోహన్ రెడ్డికే థాంక్స్ చెప్పుకుంటున్నారు.
ఆంద్రప్రదేశ్ రాష్ట్రంలో అభివృద్ధిని జగన్ డౌట్‌ఫుల్ గా మార్చేయడం వల్లనే.. తాము పంథా మార్చుకుని లాభపడుతున్నామని వారు భావిస్తుండడం కొసమెరుపు.
.. కృష్ణమోహన్ దాసరి
డలాస్
Discussion about this post