మానసిక ఒత్తిడికి నిర్వహణే మార్గం !
కాలంతో పాటు పరుగులు పెడుతున్న ఆధునిక సమాజంలో మానసిక ఒత్తిడి ప్రతి వారిని ఆవహిస్తోంది. దీర్ఘ కాలిక ఒత్తిడి వల్ల మానసిక, శారీరక అనారోగ్య సమస్యలు వచ్చే ప్రమాదం ఉంది. దీనివల్ల తలనొప్పి,ఆందోళన, అలసట, చిరాకు వంటి సమస్యలు ఎదురవుతాయి. రక్త పోటు, మధు మేహం, గుండె పోటుకు దారితీసే అవకాశాలు ఉన్నాయి. ఒత్తిడి ముదిరి డిప్రెషన్‌కు దారి తీస్తుంది. ఒక్కో సారి ప్రాణాంతకంగా మారుతుంది.
లక్ష్యాన్ని చేరుకోవాలంటే కాలంతో పాటు పరుగెత్తక తప్పదు. దీని వల్ల ఒత్తిడి కూడా తప్పదు. ఒత్తిడిని నివారించడం వీలుకాదు. కాబట్టి నిర్వహించడం, ఉపశమనం పొందడం నేర్చుకోవాలి.
ఏదైనా ఒక పని చేసేముందు ఎలా చెయ్యాలి అన్న ప్రణాళిక వేసుకోవాలి. మీరు పని చేసే చోటు మీకు ఇబ్బంది పెట్టేవి ఉండకుండా చూసుకోవాలి. ప్రణాళిక ప్రకారం వెళ్లిన ఒత్తిడి తగ్గడానికి అవకాశాలు ఉన్నాయి. అలాంటి సమయంలో పరిష్కార మార్గాలు అన్వేషించాలి. నిద్ర ఒత్తిడిని తగ్గించడంలో ప్రధాన పాత్ర పోషిస్తుంది. ప్రస్తుత జీవనశైలితో నిద్రవేళలు క్రమంగా తగ్గుతున్నాయి. కనీసం మనిషికి రోజుకు 7నుంచి 8 గంటల నిద్ర ఉండాలి.
ఒత్తిడి తగ్గాలి అంటే వ్యాయామం, వాకింగ్, రన్నింగ్ తప్పక చెయ్యాలి. కనీసం రోజుకు 45నిమిషాల పాటు ఈ వ్యాయామాలు చెయ్యడం వల్ల ఒత్తిడి తగ్గి మనసు ప్రశాంతంగా ఉండడానికి సహాయ పడుతుంది.
తీసుకునే ఆహారం కూడా ఒత్తిడి తగ్గడానికి ఉపయోగపడుతుంది. కూరగాయలు, పండ్లు, చేపలు,చిరు ధాన్యాలు తీసుకోవాలి. వీటిలో కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్స్, విటమిన్స్‌తో పాటు మినరల్స్ ఉంటాయి. యాంటీ ఆక్సిడెంట్లూ, విటమిన్ బి2, బి12, మాంసకృత్తులూ, క్యాల్షియం ఎక్కువగా ఉండే ఆహారం అవసరం. పాలలో ఉండే లాక్టియమ్ అనే పదార్థం మెదడుకి ఎంతో ప్రశాంతతనిస్తుంది. ఇందులో ఉండే బయోయాక్టివ్ ప్రొటీన్ దీనికి కారణం. ఈ ప్రొటీన్ వల్ల ఒత్తిడినుంచి ఇట్టే ఉపశమనం పొందగలుగుతాం. పాలలో పొటాషియం శాతం కూడా ఎక్కువ. ఇది కండరాల నొప్పుల్ని తగ్గిస్థాయి.
కాఫీ, టీలు తగ్గించి,మంచి నీరు ఎక్కువగా తాగాలి. పాలలోగానీ, నిమ్మరసంలో గానీ తేనెను కలుపుకుని తాగితే చాలా ఉపశమనం లభిస్తుంది.
పరిశీలించడం వంటివి కూడా ఒత్తడిని తొలగించడానికి ఉపకరిస్తాయి. యోగ, ధ్యానం వల్ల ఒత్తిడి ఉపశమనం కలుగు తుంది. సరదాగా కబుర్లు చెప్పుకోవడం, ఇష్టమైన వారితో మాట్లాడటం, అభిరుచులతో కాలం గడపటం ఒత్తిడి బాగా తగ్గుతుంది. ఒత్తిడి స్థాయి ఎక్కువగా ఉన్నప్పుడు తప్పని సరిగా నిపుణులను కలవడం మంచిది.
– డాక్టర్ ఎన్ బి సుధాకర్ రెడ్డి,
సైకాలజిస్ట్
Discussion about this post