మహారాష్ట్ర ముఖ్యమంత్రి ప్రమాణస్వీకారోత్సవ కార్యక్రమానికి ప్రత్యేక అతిథిగా ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ హాజరు కాబోతున్నారు. మహారాష్ట్ర ఎన్నికల ప్రచారంలో మహాయుతి కూటమి తరఫున ఎన్నికల ప్రచారంలో ముమ్మరంగా పాల్గొన్న జనసేనానికి ప్రమాణస్వీకారోత్సవానికి ప్రత్యేక ఆహ్వానం అందింది. ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ఆయన వెళ్లనున్నట్టు సమాచారం.
సార్వత్రిక ఎన్నికల్లో ఏపీలో అటు ఎంపీ, ఇటు ఎమ్మెల్యే ఎన్నికల్లో వందశాతం ఫలితాలుసాధించి రికార్డు సృష్టించిన పవన్ కల్యాణ్.. మహారాష్ట్ర ఎన్నికల్లో నిర్వహించిన ప్రచారంలో కూడా 90 శాతానికి పైగా సత్ఫలితాల్ని సాధించారు. మహాయుతి కూటమి తరఫున డిప్యూటీ ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ మొత్తం 11 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ప్రచారం నిర్వహించారు. వాటిలో ఒక్క లాతూరు సిటీ మినహా మిగిలిన అన్ని నియోజకవర్గాల్లోనూ మహాయుతి కూటమి అభ్యర్థులు ఘనవిజయం సాధించారు. మరట్వాడా, విదర్భ, పశ్చిమ మహారాష్ట్ర ప్రాంతాల్లోని కీలకమైన నియోజకవర్గాల్లో పవన్ ప్రచారం నిర్వహించారు. అలాగే డేగ్లూర్, భోకర్, షోలాపూర్ సెంట్రల్, నార్త్, సౌత్, బల్లార్‌పూర్, చంద్రాపూర, పుణె కంటోన్మెంట్, కస్బాపేట్, హడప్పర్ నియోజకవర్గాల్లో కూటమి అభ్యర్థుల తరఫున పవన్ కల్యాణ్ బహిరంగ సభలు రోడ్ షోలు నిర్వహించారు.
సనాతన ధర్మ పరిరక్షణ అవసరం గురించి, మహాయుతి ద్వారా మాత్రమే అది సాధ్యమవుతుందనే విషయాన్ని ఆయన తన ప్రసంగాల్లో ప్రజల్లోకి తీసుకువెళ్లారు. మొత్తానికి అక్కడ ఘనవిజయం దక్కింది. ప్రత్యేక ఆహ్వానం రావడంతో మహా ముఖ్యమంత్రి ప్రమాణస్వీకరోత్సవానికి డిప్యూటీ ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ బయల్దేరి వెళ్లనున్నారు.
Discussion about this post