ప్రతి మనిషికీ ఆశలు, ఆకాంక్షలు, కోరికలు, ఇష్టాలు, అయిష్టాలు ఉంటాయి. వాటిని సాధించుకోవడం కోసం మనిషి నిరంతరం ప్రాకులాడుతూనే ఉంటారు. ఆ ప్రాకులాటే మనిషి ప్రగతికి ప్రతిబంధకం.
ఒకతనికి తిరుమలకెళ్ళి స్వామిని దర్శించుకోవాలని ఆశ. కానీ అతను వెంటనే బయలుదేరడు. ఇప్పుడు వెళితే స్వామి దర్శనం త్వరగా అవుతుందో లేదో? జనం ఎక్కువగా ఉంటారేమో? తిరుపతి నుంచి నడచి వెళ్తే త్వరగా దర్శనమతుందా? ఇప్పుడు నడక దారిలో పులులు సంచరిస్తున్నాయని అంటున్నారు. అవి మనమీద దాడిచేస్తే? అనే రకరకాల అనుమానాలతో ప్రయాణాన్నివాయిదా వేసి, దాన్ని గురించే ఆలోచిస్తూ ఉంటాడు. అలాంటి ఆలోచనలే అతణ్ణి మరింత బాధిస్తాయి. అలా కాకుండా అనుకున్నదే తడవుగా తిరుమలకి వెళ్ళి దర్శిచుకుంటే అంతటితో ఆ ఆశ నెరవేరిపోతుంది.
మరొకరికి ఒక మంచి ఇల్లు కట్టుకోవాలనే ఆకాంక్ష ఉంటుంది. ఆ ఆకాంక్షను నెరవేర్చుకోవడానికి తగిన వనరులు ఉన్నాయాలేదా? సాధ్యాసాధ్యాలను ఆలోచించి వెంటనే నిర్ణయం తీసుకోవాలి. అలాకాకుండా తన దగ్గర వనరులు లేకపోయినా ఇతరుల మాటలు విని పని ప్రారభించేసిన తర్వాత మధ్యలో పని ఆపలేక అప్పులు చేసి ఇల్లు కట్టుకున్న తర్వాత అప్పులను ఎలా తీర్చాలా? అని ఆలోచిస్తూ మధనపడుతూ ఉంటాడు. అలా కాకుండా ముందే తగిన నిర్ణయం తీసుకుని ఉంటే బాధ పడాల్సిన అవసరం ఉండదు.
ఇంకొకరికి సినిమాల్లోకెళ్ళి కీర్తి ప్రతిష్ఠలు పొందాలని కోరికగా ఉంటుంది. కానీ అక్కడికి ఎలా వెళ్ళాలి? వెళ్తే మనల్ని తీసుకుంటారోలేదో? వెళ్ళినా మనం ఆ రంగంలో రాణిస్తామోలేదో? అనే రకరకాల ఆలోచనలతో కాలంగడుపుతూ ఉంటారు. వెళ్ళాలనుకుంటే వెంటనే నిర్ణయం తీసుకుని వెళ్ళాలి. తాడోపేడో చూసుకుని వచ్చేయాలి. వెళ్తే విజయం వరించిందా మంచిదే. పని కాలేదా వచ్చేసి వేరే పని చూసుకోవాలి. అంతేగాని అదే ఆలోచిస్తూ ఇక్కడే కూర్చుని కాలయాపన చేస్తూ మధనపడుతూంటే లాభంలేదు.
ఒక కుటుంబంలో భర్త “ఇవాళ మసాలదోశ చేయ్” అని భార్యను అడుగుతాడు. అందుకు భార్య, “లేదండి ఇవాళ చపాతి చేస్తున్నాను” అంటుంది. అప్పుడు భర్త సర్దుకుని తింటే సరే. లేకపోతే భార్య ముఖస్తుతి కోసం ఒక చపాతి తినేసి, తన ఇష్ట ప్రకారం హోటల్ కి వెళ్ళి మసాలదోశ తినేస్తే సమస్య అంతటితో సమసిపోతుంది. అలా కాకుండా “నాకు చపాతి అంటే ఇష్టం లేదు. మసాలాదోశ చేయాల్సిందే” అని దానికోసమే ప్రాకులాడితే కుటుంబంలో కలహాలు తలెత్తుతాయి.
ఇలా మన ఇష్టాలను, అయిష్టాలను ఎప్పటికప్పుడు తీర్చేసుకోవాలి. దేన్నీ వాయిదా వేయకూడదు. జీవితమనేది నిత్య నిరంతర పరిణామంలో ఉంటుంది. జీవితంలోకి ఎన్నో అనుభవాలు వస్తాయి. పాతవి వెళ్ళిపోతుంటాయి. కొత్తవి వస్తూంటాయి. పాతవాటిని పట్టుకుని వేళ్ళాడితే జీవితంలో చలనం ఆగిపోతుంది.
మన బాల్యం మధురమయిందనుకుంటే మనకదే కావాలనుకుంటే మనకు వర్తమానముండదు. గతాన్ని వదిలించుకున్నప్పుడే అర్థవంతమయిన వర్తమానముంటుంది.
మనలో ఏదైనా ఆశ చిగురించినప్పుడు, ఆ ఆశను సాకారం చేసుకోవడానికి మనం అర్హులమాకాదా? అని ఆలోచించి వెంటనే నిర్ణయం తీసుకోవాలి. అలాకాకుండా ఆ ఆశను మనసులోనే పెట్టుకుని మధనపడుతూ కాలయాపన చేసి దాన్ని గురించే ప్రాకులాడుతూ ఆలోచిస్తూ కూర్చుంటే మనం ప్రగతిని సాధించలేం.
..దేవీప్రసాద్ ఒబ్బు
9866251159
Discussion about this post