మనం ఏదైనా మొక్కను నాటిన తర్వాత క్రమం తప్పకుండా నీరు పోస్తే అది ఎదుగుతుంది. ఒకవేళ నీరు పోసినా ఎదగకపోతే అప్పుడు దానికి అవసరమైన ఎరువును అందించినట్లయితే ఏపుగా పెరిగి ఫలాలను ఇవ్వడమే కాకుండా పదిమందికి నీడ నిస్తుంది. అంతేకాదు, పలురకాల పక్షులకు, జంతువులకు ఆవాసంగా ఉపయోగపడుతుంది.
అలాకాకుండా మొక్కను నాటిన తర్వాత నీరు పోయకపోయినా, నీరు పోసిన తర్వాత అది సక్రమంగా పెరుగుతుందా? లేదా? అని పరిశీలించకపోయినా సరిగా వికసించక మొగ్గ దశలోనే మోడుబారిపోతుంది.
అలాగే…
పిల్లలు సక్రమమైన మార్గంలో నడుస్తున్నారా? లేరా? అని తల్లిదండ్రులు నిత్యం గమనిస్తూ ఉండాలి. ఒకవేళ పిల్లలు ఆ మార్గంలో నడవలేకపోతే, అందుకు వారికి ఎదురైన ఆటంకాలు, ఇబ్బందులు ఏమిటనేది గుర్తించి వాటిని తొలగించినట్లయితే వాళ్ళు కూడా మొక్కలులాగే దినదినాభివృద్ధి చెందుతూ ఉన్నతంగా పెరిగి పదిమందికి ఉపయోగపడుతారు. అలాకాకుండా వాళ్ళను మనం అసలు పట్టించుకోకపోయినా, అవసరమైనవి సమకూర్చకపోయినా మొగ్గదశలోనే మొద్దుబారిపోయి దేనికీ పనికిరాని వాళ్ళుగా మిగిలిపోతారు.
నేటి సమాజంలో…
పిల్లల పరిస్థితి దయనీయంగా ఉంది. నూటికి తొంభై శాతం మంది పిల్లలు తమకు ఏది సరైన మార్గమో ఎంచుకోలేక అవస్థలు పడుతున్నారు. ఐదుశాతం మంది పిల్లలు తలకు మించిన భారం మోయలేక మానసిక ఒత్తిడికి గురై ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. మిగిలిన ఐదు శాతం మంది పిల్లలు మాత్రమే తమకు నచ్చినవి ఎన్నుకుని ఆ రంగంలో విజయం సాధిస్తున్నారు.
మరి పిల్లలకు ఈ పరిస్థితి దాపురించడానికి కారకులు
ఎవరు? అని అడిగితే…
వెంటనే.. మనం ప్రభుత్వం మీదనో, విద్యావ్యవస్థ మీదనో, లేక ఉపాధ్యాయుల మీదనో తప్పును తోసేస్తాం. పూర్తిగా తప్పును వీళ్ళమీదకే నెట్టేయడం సరైన అభిప్రాయం కాదు. ఆ వైపు నుండి తప్పు కొంతవరకు ఉండొచ్చేమోగాని పూర్తిగా మాత్రం కాదు. పిల్లలు గాడితప్పడానికి అసలైన కారకులు తల్లిదండ్రులేనని మనం అంగీకరించక తప్పదు.
ఎందుకంటే…
పిల్లల శారీరక, మానసిక పరిస్థితి, వారి శక్తి సామర్థ్యాలు, ఇష్టాయిష్టాలు తల్లిదండ్రులకే తెలుస్తాయి. తదనుగుణంగా వారి స్థాయికి తగినట్లు వాళ్ళకు ఇష్టమైన రంగంలో అవకాశాలు కల్పించనట్లయితే తప్పకుండా విజయం సాధిస్తారు.
కానీ, మనం అవేవీ పట్టించుకోకుండా ప్రపంచంలో ఉత్తమమైన చదువులు ఎం.బి.బి.ఎస్, ఇంజనీరింగులే తప్ప మరేవీ లేవనే అవివేకంతో వాళ్ళకు ఇష్టమున్నా, లేకున్నా అవే చదవాలని పిల్లలపై ఒత్తిడి తెస్తున్నాం. అందుకోసం చిన్నతనం నుంచే వాళ్ళని కార్పోరేట్ అనే అందమైన జైళ్ళల్లో బంధించడమే కాకుండా క్లాసులో అందరికన్నా ఫస్ట్ రావాలని, స్టేట్ ర్యాంకు తేవాలనే భారమైన లక్ష్యాలను వాళ్ళపై మోపి నరకకూపాలలోకి నెట్టేస్తున్నాం. అక్కడ ఆ చదువులు చదివే సామర్థంలేని కొంతమంది పిల్లలు తమ బాధలను ఇటు తల్లిదండ్రులకు చెప్పుకోలేక, అటు ఆ నరకకూపాల నుండి బయటపడే మార్గాలు తెలియక వాళ్ళల్లో వాళ్ళే మానసిక ఒత్తిడికి గురై ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు.
ఇలాంటి చదువులు అవసరమా? అసలు.. విద్య అంటే ఏమిటి?
ఇలాంటి చదువులు అవసరంలేదు. విద్య అంటే మానసిక వికాసం. వ్యక్తిలో శారీరక, మానసిక, ఆధ్యాత్మిక, నైతిక విలువలను, సృజనాత్మక శక్తిని, వృత్తి నైపుణ్యాలను పెంపొందించేదే విద్య. క్లుప్తంగా చెప్పాలంటే వ్యక్తి యొక్క పరిపూర్ణ మూర్తిమత్వాన్ని పెంపొందించేదే విద్య.
మరి పిల్లల పరిపూర్ణ మూర్తిమత్వాన్ని పెంపొందించడానికి తల్లిదండ్రులుగా మన బాధ్యత ఏమిటి?
1. పిల్లల శారీరక, మానసిక పరిస్థితిని గుర్తించాలి. ఒకవేళ వాళ్ళల్లో ఏమైనా లోపాలుంటే వెంటనే సరిదిద్దాలి.
2. పిల్లల శక్తి సామర్థ్యాలను అంచనా వేయాలి. అంటే వాళ్ళు ఏ అంశాల పట్ల ఆసక్తిని చూపుతున్నారో పరిశీలించి, ఆ అంశంలో శిక్షణ ఇప్పించాలి. ఉదాహరణకు: బొమ్మలు గీయడం, పాటలు పాడడం, సంగీతం నేర్చుకోవడం, ఆటలు ఆడడం మొదలగునవి.
3. కేవలం మార్కులు తెచ్చుకోవడమే ధ్యేయంగా, ర్యాంకులు సాధించడమే లక్ష్యంగా కాకుండా చదువుతో పాటు సమాంతరంగా ఏదైనా ఒక కళని పిల్లలకు నేర్పించినట్లయితే వాళ్ళకు మానసిక పరిపక్వత వస్తుంది. అప్పుడు వాళ్ళు అర్థవంతమైన చదువును చదవగలగుతారు.
4. భారతదేశం యొక్క సంస్కృతి, సంప్రదాయాల ఔన్నత్యాన్ని తెలియజేసే రామాయణం, మహాభారతాల గురించి, నైతిక విలువలను పెంపొందించే సుమతి శతకం, వేమన పద్యాలు గురించి చిన్నతనం నుంచే పిల్లల నరనరాల్లోకి
ఎక్కించాలి.
పై అంశాలన్నింటినీ బాధ్యతగా తల్లిదండ్రులు నిర్వర్తించగలిగితే పిల్లలు పరిపూర్ణ మూర్తిమత్వాన్ని సాధించగలగుతారు. తద్వారా సమాజాన్ని పట్టిపీడిస్తున్న మానభంగాలు, రౌడియిజం, భూకబ్జాలు, హత్యలు ఆత్మహత్యలు క్రమంగా తగ్గుముఖం పడతాయి. అప్పుడు రేపటి తరంవారు ఆహ్లాదకరమైన, ఆరోగ్యకరమైన సమాజంలో హాయిగా, ప్రశాంతంగా జీవించగలుగుతారు.
…దేవీప్రసాద్ ఒబ్బు
9866251159.
.
Discussion about this post