అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడు తిరువేంకటగిరినాధుని సామాన్యులు కూడా దర్శించుకోవడానికి సర్వదర్శనం త్వరలోనే మొదలుకానుంది. అయితే.. సర్వదర్శనానికి అనుమతిస్తున్నారు కదాని.. వెల్లువగా తరలివచ్చే భక్తులు ముందుగా దర్శనానికి ఉన్న నిబంధనలను, నియమాలను తెలుసుకోకపోతే ఇబ్బంది పడే ప్రమాదం ఉంది.
కోవిడ్ పరిణామాల నేపథ్యంలో.. తిరుమల ఆలయం చాలా కాలం మూత పెట్టారు. తిరిగి దర్శనాలను అనుమతించినా అనేక నిబంధనల మధ్య సాగుతున్నాయి. ప్రత్యేక దర్శనాలను మాత్రమే అనుమతిస్తున్నారు. తాజాగా సర్వదర్శానికి కూడా అనుమతించాలని నిర్ణయించి రోజుకు 8వేల టోకెన్లు ఆన్ లైన్ లో విడుదల చేయడం ద్వారా.. తిరుమలలో రద్దీ ఉండకుండా, పరిమితంగా భక్తులను పంపాలని టీటీడీ నిర్ణయించింది.
నిజానికి ప్రత్యేక దర్శనాలకు డబ్బు భరించే తాహతులేని కోట్లాది మంది సామాన్య భక్తులకు సర్వదర్శనానికి అనుమతించడం అనేది శుభవార్తే. అయితే.. సర్వదర్శనానికి వచ్చే వారికి ఉండగల కండిషన్లను టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి తాజాగా ప్రకటించారు.
సెప్టెంబరు 25న ఉదయం 9 గంటలకు ఆన్లైన్లో సర్వ దర్శనం టోకెన్లు విడుదల చేస్తారు. 26వ తేదీ నుంచి అక్టోబరు 31వ తేదీ దాకా రోజుకు ఎనిమిది వేల సర్వ దర్శనం టోకెన్లు ఆన్లైన్లో విడుదల చేస్తామని వైవీ సుబ్బారెడ్డి తెలిపారు.
సర్వదర్శనం టోకెన్లు ఆన్లైన్లో అందుబాటులోకి వచ్చిన తర్వాత, సెప్టెంబరు 26 వ తేదీ నుంచి తిరుపతి లో ఆఫ్ లైన్లో సర్వదర్శనం టోకెన్ల జారీని నిలిపి వేస్తారు. తిరుపతితో పాటు ఇతర రాష్ట్రాల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు సర్వదర్శనం టోకెన్ల కోసం గుమికూడుతుండటం వల్ల కరోనా వేగంగా సంక్రమించే ప్రమాదం ఉన్నందువల్ల ఈ నిర్ణయం తీసుకున్నారు.
ఇవి గుర్తుంచుకోండి..
తిరుమల శ్రీవారి దర్శనం కోసం వచ్చే భక్తులు రెండు డోసుల వ్యాక్సిన్ వేయించుకున్న సర్టిఫికెట్ ను కలిగిఉండాలి.
ఒకవేళ రెండు డోస్ ల వేక్సినేషన్ లేనట్లయితే.. దర్శనం సమయానికి మూడు రోజుల ముందు కరోనా పరీక్ష చేయించుకుని తెచ్చుకున్న నెగిటివ్ సర్టిఫికెట్ అయినా తప్పనిసరిగా తీసుకురావాల్సి ఉంటుంది.
కోవిడ్ విచ్చలవిడిగా విస్తరించకుండా నియంత్రణ కోసం టీటీడీ తీసుకున్న ఈ నిర్ణయానికి భక్తులు సహకరించాలని శ్రీ వైవి సుబ్బారెడ్డి విజ్ఞప్తి చేశారు.
అక్టోబరు నెలకు సబంధించిన ప్రత్యేక ప్రవేశ దర్శనం రూ 300 టికెట్లు సెప్టెంబరు 24వ తేదీ ఉదయం 9 గంటలకు ఆన్లైన్ లో విడుదల చేస్తామని చైర్మన్ తెలిపారు.
.

Discussion about this post