చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తి పట్టణంలోని శ్రీకాళహస్తీశ్వర ఆలయంలో మహాశివరాత్రి వార్షిక బ్రహ్మోత్సవాలకు రమ్మంటూ సకల దేవతా గణాలకు స్వాగతం పలుకుతూ శుక్రవారం సాయంత్రం కైలాస నాథుని ధ్వజారోహణం కార్యక్రమం వైభవంగా సాగింది. ముక్కంటి భక్తులు సమర్పించిన చీరలతో స్వామివారి ధ్వజస్తంభం వద్ద ధ్వజం ఎగుర వేశారు. ధ్వజారోహణం పూర్తయిన తరువాత స్వర్ణముఖి నదీ జలాలతో త్రిశూలాన్ని శుద్ధి చేశారు.
శ్రీకాళహస్తీశ్వర ఆలయంలో మహాశివరాత్రి ఉత్సవాలకు భక్తకన్నప్ప ధ్వజారోహణంతో అంకురార్పణ జరిగిన సంగతి తెలిసిందే. రెండవ రోజైన శుక్రవారం శ్రీకాళహస్తీశ్వరునికి ధ్వజారోహణం శాస్త్రోక్తంగా నిర్వహించారు. ఇందులో భాగంగా స్వామి వారి గర్భాలయానికి ముందు భాగాన ఉన్న ధ్వజస్తంభం వద్ద గంగాభవానీ సమేత పరమశివుడు, జ్ఞాన ప్రసూనాంబ అమ్మవారి ఉత్సవ మూర్తులను ఉంచారు. ఈ ఉత్సవ మూర్తులను దివ్యాబరణాలతో అలంకరించారు. ఆలయ పురోహితులు, అధికారులు శాస్త్రోక్తంగా ధ్వజారోహణానికి పూజా ద్రవ్యాలను అందజేశారు. ఇక ధ్వజారోహణానికి అవసరమైన పూజా సామాగ్రిని, సారెను ఉభయదారులు అందజేశారు. అనంతరం వేదపండితుల మంత్రోచ్ఛరణల మధ్య స్వామి, అమ్మవార్లకు వివిధ రకాల పూజలు, అభిషేకాలు నిర్వహించారు. ధ్వజారోహణం తిలకించడానికి విశేష సంఖ్యలో భక్తులు విచ్చేశారు. ఈ కార్యక్రమంలో శ్రీకాళహస్తి శాసనసభ్యులు బియ్యపు మధుసూదనరెడ్డి, ఆలయ ఈవో పెద్దిరాజు, డిప్యూటీ ఈవో ఎన్ ఆర్ కృష్ణారెడ్డి తదితరులు పాల్గొన్నారు.
వెండి అంబారీలపై శివపార్వతుల పురవిహారం
మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలలో భాగంగా శుక్రవారం సాయంత్రం ముక్కంటి ఆలయంలో స్వామి వారి ధ్వజారోహణం కార్యక్రమం పూర్తయిన తరువాత గంగాభవానీ సమేత పరమేశ్వరుడు ఒక వెండి అంబారీపై… జ్ఞానప్రసూనాంబ అమ్మదవారు మరో వెండి అంబారీపై అధిష్టించి పురవిహారం చేశారు. శ్రీవళ్లీ, దేవసేన సమేత సుబ్రహ్మణ్యం స్వామి, చండికేశ్వరుడు, వినాయకుడు, భక్తకన్నప్ప వీరిని అనుసరించారు. మంగళ వాయిద్యాలు, మేళ తాళాల మధ్య పురవిహారం చేస్తున్న శివ, పార్వతులను దర్శించుకోవడానికి భక్తులు బారులు తీరారు. కర్పూర హారతులు సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు. కాగా స్వామి, అమ్మవార్ల పురవిహారం సందర్భంగా వివిధ కళారూపాలు ప్రదర్శించారు.
.
Discussion about this post