మోడీకి కూడా చంద్రబాబు అదే చెప్పారా?

145

కేసులు దాస్తే దావానలమే అని చంద్రబాబు హెచ్చరిస్తున్నారు. కరోనా సంక్షోభాన్ని రాజకీయంగా వాడుకునే ఉద్దేశం తమకు ఎంతమాత్రమూ లేనేలేదని చంద్రబాబు అండ్ కో పలు సందర్భాల్లో మాటలు వల్లిస్తూనే ఉన్నారు గానీ.. ఆచరణలో మాత్రం ఇలాంటి మాటలు కల్లబొల్లి మాటలే అవుతున్నాయి. ప్రతి అంశాన్నీ రాజకీయం చేయడానికే తెదేపా నాయకులు ప్రయత్నిస్తున్నారు. అందులో భాగంగానే.. తాజాగా చంద్రబాబు స్వయంగా కేసులు దాస్తే దావానలమే అవుతుందని హెచ్చరించడం విశేషం. 

చంద్రబాబునాయుడు నిత్యం అస్తిత్వ సమస్యతో బాధపడుతుంటారని కొందరు అంటూ ఉంటారు. ఈ దేశంలో నలభయ్యేళ్ల సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న, 14 ఏళ్లపాటూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పనిచేసిన నాయకుడు చంద్రబాబు. ఆ రకంగా ఆయన ప్రాధాన్యం ఎప్పటికీ వన్నె తగ్గనిది. సంక్షోభ సమయాల్లో ఆయన పాలనలో స్పందించే తీరు కూడా ప్రత్యేకంగా చెప్పుకోదగ్గదే. ప్రచారాభిలాష కాస్త మెండుగా ఉండి, విసుగెత్తిస్తుంది గానీ.. సహాయక చర్యల్లో తప్పుపట్టలేం. అలాంటి చంద్రబాబు కరోనా వచ్చిననాటికి హైదరాబాదులో ఇరుక్కుపోయి అక్కడినుంచి ట్విటరు మరియు లేఖల ద్వారా ప్రతిరోజూ ప్రభుత్వానికి సలహాలు ఇస్తూన్నారు. 

మోడీకి కూడా చంద్రబాబు అదే చెప్పారా?

నిజానికి ఆయన ప్రభుత్వానికి సలహాలు ఇస్తున్నారా? లేదా, తన అస్తిత్వాన్ని ప్రజలు మరచిపోకుండా తన వంతు తాను ప్రయత్నిస్తున్నారా అనేది మాత్రం అనుమానాస్పదమే. కరోనా సీజను ప్రారంభమైన తొలిరోజుల్లో ఈ అంశాన్ని రాజకీయం చేయవద్దూ అంటూ తన అనుంగు తమ్ముళ్లకు సందేశం ఇస్తున్నట్లుగా కొన్ని స్టేట్మెంట్లు ఇచ్చిన చంద్రబాబు.. ఆ తర్వాతి కాలంలో ఆ విలువల్ని తుంగలో తొక్కారు. ఆయన టీం అంతకంటె ఘాటుగా అధినేత మాటల్ని పక్కన పెట్టింది. అందివచ్చిన ప్రతి అవకాశాన్నీ రాజకీయంగా వాడుకోవడానికే, కరోనా కంటె ఎక్కువగా జగన్ ను ప్రజలకు ఎదుట బూచిగా చూపించడానికే వారు కష్టపడుతున్నారన్నది సత్యం. 

ఈ క్రమంలో మోడీ దేశంలోనే అనేక వర్గాలకు చెందిన అనేక మందితో మాట్లాడడం చంద్రబాబుకు అసహనం పెంచింది. ఎంతో సీనియర్ అయిన తనతో మాట్లాడనే లేదని ఆయన దురపిల్లిపోయారు. చివరికి తానే ఒక మెట్టు దిగి, పీఎంఓకు ఫోను చేసి ప్రధానితో మాట్లాడాలనే అభిలాషను వ్యక్తం చేశారు. మరుసటి రోజు ప్రధాని నుంచి ఫోనొచ్చింది. మాట్లాడి పెట్టేశారో లేదో.. తనకు ప్రధాని పోను చేశారంటూ ప్రత్యేకంగా ప్రెస్ మీట్ పెట్టి ప్రజల దృష్టికి చాటుకున్నారు. అప్పటినుంచి ఇక మోడీ భజన ప్రారంభించారు. 

ఏపీ కరోనా కు సంబంధించి.. ప్రభుత్వం తప్పుడు లెక్కలు చెబుతున్నదని, దుర్మార్గంగా వ్యవహరిస్తున్నదని కొత్త పాట ప్రారంభించారు. ఒకవైపు మోడీని కీర్తిస్తూ అదే సమయంలో రాష్ట్రంలో వైరస్ బాధితుల విషయంలో తప్పుడు లెక్కలు చెబుతున్నారని, రాష్ట్రం దావానలం అవుతుందని హెచ్చరించడం యాదృచ్చికం కాదు. జగన్ ప్రభుత్వం అనుభవ రాహిత్యం వల్ల, విపత్తు ఎదుర్కోనే చర్యల్లో తడబడుతుండవచ్చు గానీ, తప్పుడు లెక్కలు చెప్తారని అనుకోవడం కరెక్టు కాదు. కానీ.. చంద్రబాబు ఆశించే రాజకీయ ప్రయోజనాలే ప్రధానంగా ఆయనతో ఇలా మాట్లాడిస్తున్నాయని అనుకోవాల్సి వస్తోంది. వైకాపా నేతలవల్లనే కరోనా విస్తరిస్తోందంటూ ఆయన చెబుతున్న మాటలను గమనిస్తే, ‘‘…అందుచేత జగన్ ను కుర్చీలోంచి లేపేసి తనను కూర్చోబెట్టమని’’ ఫోనులో మోడీకి విన్నవించుకున్నారేమో అనే వ్యాఖ్యానాలు కూడా సరదాగా వినవస్తున్నాయి.

Facebook Comments