సైదాబాద్ దురాగతానికి పాల్పడిన నిందితుడు పల్లకొండ రాజు రైలు పట్టాల మీద శవంగా కనిపించాడు. జనగామ జిల్లా స్టేషన్ ఘన్‌పూర్ సమీపంలో పట్టాల మీద అతడి మృతదేహాన్ని కనుగొన్నారు. సైదాబాద్ సింగరేణి కాలలో పసిపాపై హత్యాచారానికి పాల్పడిన రాజు పోలీసులకు చిక్కకుండా తప్పించుకు తిరుగుతుండగా.. పది లక్షల రూపాయల రివార్డుకూడా ప్రకటించారు. మొత్తానికి రాజు ఎవ్వరికీ చిక్కలేదు(?) గానీ.. పట్టాల మీద శవంగా తేలాడు.
పోస్టుమార్టంలో అతడి వంటి మీద కొట్టిన గాయాలు లేవని, శరీరంలో బుల్లెట్ కూడా లేదని పోస్టమార్టం తర్వాత డాక్టర్లు తేల్చిచెప్పారు. దీంతో మరోసారి పోలీసులు దానిని ఆత్మహత్యగా ధృవీకరించారు. పల్లకొండ రాజు కుటుంబసభ్యులు మాత్రం.. పోలీసులే పట్టుకువెళ్లి.. కాల్చి చంపేశారని ఆరోపిస్తున్నారు. ఇదీ ప్రస్తుతానికి ఉన్న నేపథ్యం.
అయితే.. పల్లకొండ రాజుది పోలీసు హత్యే అనే అనుమానాలు ప్రచారం ప్రబలంగానే వినిపిస్తోంది. ఇలాంటి వాదన పుట్టడానికి, పోలీసు హత్యే అనే అభిప్రాయానికి ప్రజలు రావడానికి కూడా చాలా సహేతుకమైన కారణాలు కనిపిస్తున్నాయి.
1) రాజును పట్టుకోవడానికి ఒకవైపు ప్రయత్నాలు జరుగుతున్న సమయంలోనే.. అతడు ఆత్మహత్య చేసుకునే అవకాశం ఉన్నదని పోలీసులు అన్నట్లుగా వార్తలు వచ్చాయి. అయితే… రాజును నిర్బంధించడం కోసం చాలా పెద్ద సంఖ్యలో పోలీసు బృందాలను ఏర్పాటు చేసినందువల్ల.. తప్పించుకోవడం సాధ్యం కాదనే భయంతో.. అతను ఆత్మహత్యకు పాల్పడే అవకాశం ఉన్నదని పోలీసులు అన్నట్టుగా వార్తలొచ్చాయి.
2) రాజు ఆత్మహత్య చేసుకున్నాడనే సమాచారం కూడా లేకముందే.. పోలీసులు గుర్తు తెలియని మృతదేహం కోసం ఆస్పత్రుల్లో, మార్చురీల్లో వెతుకులాట సాగించినట్లుగా కూడా వార్తలు వచ్చాయి. సాధారణంగా నిందితుడు పారిపోతే.. ఎక్కడెక్కడికి పారిపోయే అవకాశం ఉన్నదో అక్కడ వెతికే ప్రయత్నం చేస్తారు. కానీ పోలీసులు వెరైటీగా, ఆత్మహత్య చేసుకుంటాడని ముందుగానే ఊహించి.. మార్చురీల్లో వెతకడం అనేది కొంచెం నాటకీయంగా, అసంబద్ధంగా, అనుమానాస్పదంగా తయారైంది.
3) ఇలాంటి దుర్ఘటనల్లో అవి సహజంగా జరిగిన ఆత్మహత్యలే అయినా నిందితుడి కుటుంబం పోలీసులు చేసిన హత్యగానే చెబుతుంది. ఈసంఘటనలో కూడా అలాగే జరిగింది.
4) కేవలం ఆ నలుగురి మధ్య వ్యవహారంగానే.. ‘రాజు చావు’ ఎపిసోడ్ ముగిసిపోయింది. పట్టాలమీద చూసి అతడిని వారించే ప్రయత్నం చేసానని చెప్పిన కీమెన్ సారంగం, ఇద్దరు రైతులు, రైలు కింద ఒక వ్యక్తి పడినట్లుగా అధికారులకు సమాచారం ఇచ్చిన ఇంజిన్ డ్రైవర్ మాత్రమే సాక్షులు. పట్టాల మీద మొహానికి మాస్కు పెట్టుకుని ఉన్న వ్యక్తిని చూసి సైదాబాద్ హత్యాచారం నిందితుడిగా అనుమానం కలిగిందని కీమెన్ సారంగం చెప్పడం కొంత అతిశయోక్తిగానూ ఉంది.
5) ఇలాంటి హత్యాచార ఘోరాలు జరిగినప్పుడు పోలీసులు నిందితుడిని పట్టుకున్నాక ఎన్ కౌంటర్ చేసేయడం ఇటీవలి కాలంలో మామూలు అయిపోయింది. ప్రజల్లో కూడా ఇలాంటి ఎన్ కౌంటర్లలో చనిపోయిన వారి పట్ల పెద్దగా సానుభూతి ఉండడం లేదు. అయితే.. న్యాయపరంగా, మానవహక్కుల సంఘాల పరంగా పోలీసులకు మాత్రం చాలా తలనొప్పులు తప్పడం లేదు. అందుకే ఆత్మహత్య చేసుకునే అవకాశం ఉన్నదని.. ముందుగానే ప్రచారంలో పెట్టి.. ఓ నలుగురు సాక్షులను ట్యూన్ చేసి.. తమ చేతికి దొరికిన రాజును ఈ రకంగా అంతమొందించారా? అనే అనుమానాలు కలుగుతున్నాయి.
ఏది ఏమైనప్పటికీ.. పసిపాప పట్ల ఆ కిరాతకుడు వ్యవహరించిన దుర్మార్గం మామూల్ది కాదు. అతని చావు పట్ల ప్రజల్లో పెద్దగా సానుభూతి లేదు గనుక.. ఈ చావు గురించి నిశితంగా చూస్తున్నవారు లేరు. పోలీసుల తీరు పట్ల అనుమానాలున్నా.. పట్టించుకుంటున్న వారు లేరు!
.

Discussion about this post