ఏఎస్సీగా పనిచేస్తున్న అధికారి వద్దనున్న తుపాకీ… అతని హోమ్ గార్డ్ వద్ద భద్రం చేయబడింది! అలా భద్రం చేయబడ్డ తుపాకీ మిస్ ఫైర్ కావడంతో పాపం హోమ్ గార్డు భార్య అక్కడికక్కడే మరణించింది. ఇది వినడానికి చక్కటి కథలా చాలా విడ్డూరంగా ఉంది కదూ… కానీ ఇది కథ మాత్రం కాదు… నిజంగానే జరిగిన సంఘటన. వివరాల్లోకి వెళితే…
విజయవాడ సమీపం గొల్లపూడిలో సిఎం సెక్యూరిటీ వింగ్ లో పనిచేసే ఏఎస్సీ శశిభూషణ్ వద్ద వినోద్ అనే హోమ్ గార్డ్ అసిస్టెంట్ గా విధులు నిర్వహిస్తున్నాడు. అయితే మూడు రోజుల క్రితం శశిభూషణ్ అనంతపురం క్యాంప్ కు వెళ్లాడు. ఆ సమయంలో ఏఎస్సీ తుపాకీ హోమ్ గార్డ్ వినోద్ వద్ద ఉండిపోయింది(!).
కాగా ఆదివారం నాడు రాత్రి తన భార్య సూర్యరత్నప్రభకు సరదాగా(!) తుపాకీ ఎలా వాడాలో చూపిస్తున్న సమయంలో ఆ తుపాకీ మిస్ ఫైర్ అయింది. తూటా సూటిగా భార్య గుండెల్లోకి దూసుకుపోయింది. దీంతో రత్నప్రభ అక్కడిక్కడే మృతి చెందింది. అదికూడా ఈ ఘటన తెల్లవారు ఝామున 2 గంటల సమయంలో జరిగింది. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు.
అయినా తుపాకీ అనేది చాలా కీలకమైన ఆయుధం. దాన్ని హోమ్ గార్డ్ వద్ద వదలివేసి ఆ అదికారి వెళ్లడం ఏంటో… తుపాకీని చాలా జాగ్రత్త చేయాల్సిన హోమ్ గార్డ్ దాన్ని తన భార్యకు అందునా అర్ధరాత్రి రెండున్నర గంటల సమయంలో.. ఆ భార్యాభర్తల మధ్య తుపాకీ పనితనాన్ని చెక్ చేసే సరదా ఆట ఏంటో… అదే సమయానికి అది మిస్ ఫైర్ కావడం ఏంటో… అయినా ఆ గుండు సూటిగా ఆమె గుండెల్లోకి దూసుకుపోవడం ఏంటో… అంతా అయోమయంగా ఉంది.
ఇది వరకు కూడా కొందరు పోలీసుల చేతుల్లో తుపాకీలు మిస్ ఫైర్ జరిగినట్టు వార్తలు వచ్చాయి. కానీ ఆ ఫైర్ నుండి వెలువడిన తూటా ఎదుటి వ్యక్తి భుజం లోకి దూసుకుపోవడం లాంటి ప్రమాదాలు జరిగాయి కానీ ఇలా ప్రాణాలు పోవడం అనేది చాలా అరుదు అనే చెప్పుకోవాలి. ఏది ఏమైనా మిస్ ఫైర్ పాపం సూర్యరత్నప్రభ ప్రాణాలు తీసింది.
సదరు మిస్ ఫైర్ అనేది.. పేలిన తుపాకీ గుండు చుట్టూతా.. పోలీసులు అల్లుతున్న కహానీనా? అనే సందేహం చాలా మందికి కలుగుతోంది.
.

Discussion about this post