బ్యాంకుల్లో ఉంచుకుంటే ఏమవుతుందో అనే భయంతో.. సొమ్ము మొత్తం క్యాష్ రూపంలో ఇంట్లో దాచుకుంటున్నారా? మీ లెవెల్లో మీ వద్ద ఎంతో కొంత బ్లాక్ మనీ ఉంటే.. దానిని రూ.2000 నోట్లుగా మార్చేసి.. ఏ ఇనప్పెట్టెలోనో భద్రంగా పెట్టుకున్నారా? ఏమో ఏదో ఒక దుర్ముహూర్తంలో మీ కొంప కొల్లేరు అయిపోవచ్చు జాగ్రత్త! రెండు వేల రూపాయల నోట్ల గురించిన కొన్ని వాస్తవాలు తెలుసుకుంటూ ఉంటే.. ఏదో ఒక రోజు రాత్రి 8 గంటలకు మోదీ టీవీ లైవ్ లోకి వచ్చి.. ఆ నోట్లు రద్దు చేసేస్తున్నట్లుగా ప్రకటించే ప్రమాదం ఉన్నదని విశ్లేషకులు భావిస్తున్నారు!
ఇంతకూ అలాంటి అనుమానాలు ఎందుకు కలుగుతున్నాయో తెలుసా?
ప్రభుత్వం ఇప్పుడు రూ.2000 నోట్లను ముద్రించడం లేదు. అసలు వాటి ముద్రణను రెండేళ్ల కిందటే నిలిపివేసింది. ఇప్పుడు చెలామణీ అవుతున్నవి అన్నీ కూడా.. రెండేళ్ల కిందట ముద్రించిన నోట్లు. ఇప్పుడు కేవలం చిన్న డినామినేషన్ నోట్లను మాత్రమే ముద్రిస్తున్నారు. 2000 నోట్ల ముద్రణ రెండేళ్ల కిందట నిలిపివేసినట్లుగా.. లోక్ సభకు అందించిన లిఖితపూర్వక సమాధానంలో కేంద్ర ఆర్థికశాఖ సహాయ మంత్రి అనురాగ్ ఠాకూర్ స్వయంగా తెలియజేయడం విశేషం.
2018 మార్చి 30 నాటికి రూ. 2000 నోట్లు.. చలామణిలో ఉన్న మొత్తం నోట్లలో 3.27శాతంగా ఉండేవని, 2021 ఫిబ్రవరి 26 నాటికి అది 2.01శాతానికి (2,499 మిలియన్) పడిపోయిందని ఠాకూర్ లెక్కలు చెప్పారు. ఆయన ప్రకటన ప్రకారం.. 2019-20, 2020-21 కాలంలో రూ. 2వేల నోట్లను ముద్రించమని ప్రింటింగ్ ప్రెస్ లకు ఎలాంటి ఆర్డర్లు ఇవ్వలేదట!
2016-17 లో 3,542.99 మిలియన్ 2000 నోట్లను ముద్రించినట్టు ఆర్ బీఐ 2019లో ప్రకటించింది. 2017-18లో 111.507 మిలియన్ నోట్లు మాత్రమే ముద్రించారు. 2018-19 నాటికి అది 46.690 మిలియన్ కు పడిపోయింది. ఆ తర్వాత ఒక్క కొత్త నోటు ముద్రణ కూడా జరగలేదు.
రద్దు అంటే బ్లాక్ మనీ గగ్గోలే!
ఇలాంటి సమయంలో 2000 నోట్ల రద్దు అని ప్రధాని ప్రకటిస్తే గనుక.. బ్లాక్ మనీ దాచుకున్న వాళ్లు గగ్గోలెత్తిపోయే అవకాశం ఉంది. గతంలో నోట్ల రద్దు తర్వాత.. వచ్చిన 2000 నోట్లు అన్నీ.. సంపన్నులకే చేరిపోయాయనే విమర్శలు వచ్చాయి. కనీసం బ్యాంకుకు కూడా రాకుండా.. డబ్బు తరలించు ట్రక్కులను నేరుగా ఇళ్లకే తెప్పించుకుని నిల్వ చేసుకున్న వారు కూడా ఉన్నారనే ఆరోపణలొచ్చాయి. కొన్ని సందర్భాల్లో.. ఇళ్లమీద దాడులు నిర్వహించినప్పుడు బాత్రూం గోడల్లో 2000 నోట్ల కొత్త బండిల్స్ పేర్చుకుని దొరికిపోయిన వారు కూడా ఉన్నారు. ఇలా ఇప్పటికీ చాలా మంది బ్లాక్ మనీ వాడకం దారులు 2000 నోట్ల రూపేణా తమ అక్రమార్జనలు దాచుకుంటున్నారు.
ఇలాంటప్పుడు ఆ నోట్లు మాత్రం రద్దు చేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటే.. సామాన్యుడికి ఎలాంటి ప్రమాదం భయం లేదు. ఈలోగా.. ఇతర డినామినేషన్ నోట్లను సరిపడా ముద్రించి.. ‘2000 నోట్లు రద్దు చేసి.. వాటికి బదులుగా ఇతర నోట్లు ఇస్తాం’ అనే ప్రకటన వస్తే గనుక.. బ్లాక్ మనీ వాడేవారి కొంప కొల్లేరైపోతుంది. కొంత మొత్తాన్ని మించి బయటపెట్టే ప్రతి నోటుకు లెక్క చెప్పాల్సి వస్తుంది. మోడీ గతంలో దేశానికి హామీ ఇచ్చినట్లుగా నల్లధనం వెలికితీయడం ఈ రూపంలో సాధ్యమవుతుందేమో చూడాలి.
.
Discussion about this post