ఎట్లైనా అధికార పీఠం చేపట్టాలని ఉవ్విళ్లూరే ప్రతిపక్ష నేతలకు..
అధికారంలో కొనసాగాలని కలలుగనే ముఖ్యమంత్రులకు..
జనాల మనసులు చూరగొని తమ నియోజకవర్గాల్లో గెలవాలని తపించే నేతలకు..
అందరికీ ఇప్పుడు కావలసిన ఒకే ఒక్క మనిషి, బీహారీ బాబు 44 సంవత్సరాల ప్రశాంత్ కిషోర్ (పీకే). ‘పొలిటికల్ కన్సల్టెంట్,’ ‘పొలిటికల్ స్ట్రాటజిస్ట్’ అని అందరూ ఇచ్చిన హోదాలు, అపర చాణక్యుడు వంటి పోలికలు నచ్చని, తనని అంతా రాజకీయుల ‘పొలిటికల్ ఎయిడ్’ (అంటే హిందీలో రాజకీయ సాహియోగి, తెలుగులో రాజకీయ సహాయకుడు) అని పిలవాలని కోరుకునే పీకే గత ఆరేడేళ్లుగా అత్యంత ప్రతిభావంతమైన, అందరూ కోరుకున్న (మోస్ట్ వాంటెడ్) బుర్ర అనడంలో అనుమానపడాల్సింది లేదు.
ఐక్యరాజ్యసమితిలో పనిచేస్తూ అప్పటి గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్ర మోడీకి ఆ రాష్ట్రంలో పోషకాహారలోపం లేకుండా చేయడానికి సహకరించిన పీకే 2012 లో గుజరాత్ లో మోడీ మరోమారు అధికారంలోకి రావడానికి, తర్వాత 2014 లో బీజేపీ కేంద్రంలో అధికారంలోకి రావడానికి ఎన్నికల వ్యూహంలో కీలక భూమిక పోషించాడు.
2013 లో సిటిజన్స్ ఫర్ అకౌంటబుల్ గవర్నెన్స్ (సీఏజీ) స్థాపించిన అయన దాన్ని మోడీ నుంచి విడిపోయిన తర్వాత ఐ-పాక్ (ఇండియన్ పొలిటికల్ యాక్షన్ కమిటీ) గా మార్చి పెను సంచలనం సృష్టిస్తున్నారు.
‘లెఫ్ట్ ఆఫ్ సెంటర్’ అయిన తన రాజకీయ సిద్ధాంతం గాంధీజీ సిద్ధాంతానికి దగ్గరని పీకే చెప్పుకుంటారు. తనను జనం ఎక్కువగా ఊహించుకుంటారని (ఓవర్ రేటెడ్), ఎన్నికల్లో గెలవడం, ఓడడం సదరు నేత శక్తి సామర్ధ్యాల మీద ఆధారపడి ఉంటుందని, తాము స్పల్ప స్థాయిలో ప్రభావాన్ని చూపగలమని పీకే చెబుతారు. ఎనిమిదేళ్ల పాటు పీకే యూ ఎన్ లో వివిధ దేశాల నాయకులకు రాజకీయ వ్యూహ రచన చేసినట్లు చెబుతారు. విచిత్రంగా, ఏ జర్నలిస్టూ ఏ ఇంటర్వ్యూ లోనూ ఆయన్ను యూ ఎన్ లో కచ్చితంగా ఏమిచేశారని గానీ, వ్యూహాలు రచించి అమలు చేయడానికి ఎంత ఛార్జ్ చేస్తారనిగానీ అడగలేదు.
మోడీ అధికారంలోకి వచ్చాక తాను ప్రతిపాదించిన వ్యూహాన్ని అయన అమలుచేయడంలేదని భావించి బైటికి వచ్చిన తర్వాత పీకే దశ తిరిగింది. అలనాటి చాణక్యుడు తనను అవమానించిన నంద రాజుల పతనం కోసం జీవితాన్ని ఫణంగా పెట్టి కేవలం బుర్ర (యుక్తి, ఎత్తులు, వ్యూహాలు)తో నెగ్గుకొచ్చిన మాదిరిగా పీకే కూడా బీజేపీ కి ఏకు మేకయ్యారు. ఆ నాటి నుంచి కమలనాథులకు వ్యతిరేకంగా పోరాడిన నాయకులకు వివిధ రాష్ట్రాల్లో వెన్నుదన్నుగా నిలిచి ఘన విజయం సాధించారు.
సొంత రాష్ట్రం బీహార్ లో నితీష్ కుమార్, పంజాబ్ లో కెప్టెన్ అమరిందర్ సింగ్, ఆంధ్రప్రదేశ్ లో వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి, పశ్చిమ బెంగాల్లో మమతా బెనర్జీ, తమిళనాడులో స్టాలిన్ లకు సహకరించిన పీకే ఉత్తరప్రదేశ్ లో కాంగ్రెస్ పక్షాన పోరాడడానికి ఒప్పుకుని బోల్తా పడ్డాడు. యూపీ లో మినహా పీకే భంగపడిన రాష్ట్రం ఒక్కటైనా లేకపోవడం, బీజేపీ ప్రాణాలొడ్డి పోరాడినా ముచ్చటగా మూడో సారి మమతా బెనర్జీ బెంగాల్ లో విజయకేతనం ఎగురవేయడంతో పీకే హవా నడుస్తోంది. ముందుగా జనతా దళ్ యునైటెడ్ లో చేరి, తర్వాత కాంగ్రెస్ లో దాదాపుగా చేరిపోయి ఆ ఆలోచన విరమించుకున్న పీకే బెంగాల్ లో దీదీ ని ఘన విజేతను చేసిన తర్వాత ఇంటి దగ్గర విశ్రాంతి (బ్రేక్) తీసుకుంటున్నట్లు చెబుతున్నారు.
అయినా, ప్రజావ్యతిరేకత ఎదుర్కుంటున్న నేపథ్యంలో ఎట్లైనా మూడో సారి అధికారంలోకి వచ్చేందుకు తెలంగాణ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు పీకే సలహా కోసం తహతహలాడుతున్నట్లు ధృవపడని వార్తలు వస్తున్నాయి. ప్రభుత్వ వ్యతిరేక ఒక తెలుగు ఛానల్ సీఈఓ ఈ మధ్యన రాజకీయ విశ్లేషణ ఇస్తూ పీకే సలహా మూలంగానే కేసీఆర్ నవంబర్ 2, 2021 (హుజూరాబాద్ ఉప ఎన్నిక ఫలితం వచ్చిన రోజు) తర్వాత కేంద్ర ప్రభుత్వంపై సమరశంఖం పూరించారని, ఈ సలహా కోసం పీకే కు భారీగా ఫీజు ముట్టినట్లు చెప్పారు. దీన్ని ఎవరూ ఖండించినట్లు లేదు.
మొత్తం రాజకీయ సమీకరణాలు మార్చే అద్భుత శక్తిసామర్ధ్యాలు పొందిన పీకే ముఖ్యంగా మూడు పనులు చేసి తను కొమ్ముకాసే పార్టీని అధికారంలోకి తెస్తారు. అవి Mechanics, Narrative, Communication (MNC).
ప్రభుత్వాలను నడుపుతున్న వారిని, రాజకీయాలను నడుపుతున్న నేతలను ప్రజలు నిత్యం అంచనా వేస్తుంటారు. జనం వారి ప్రయాణాన్ని గురించి ఏమి అనుకుంటున్నారో (మెకానిక్స్) తెలుసుకోవడం చాలా ముఖ్యం. దీన్ని అర్థం చేసుకోవడంలో విఫలమైతేనే అధికారం చేజారిపోతుంది. నేతల కోసం వ్యూహాలు రచించడానికి పీకే జరిపే మొదటి కసరత్తు ఇది. అధికార పార్టీ నేతలు, ప్రభుత్వానికి కొమ్ముకాసే మీడియా చెప్పేది కాకుండా క్షేత్ర స్థాయిలో జనం నాడిని తెలుసుకోవడంలో దిట్ట కాబట్టీ పీకే ఒక వెలుగు వెలుగుతున్నారు. బ్లాక్ స్థాయి దాకా వెళ్లి శాస్త్రీయంగా విశ్లేషణ చేయడం ఆయనకు వెన్నతో పెట్టిన విద్య అని చెబుతారు.
ఇప్పుడు రెండో స్టేజ్, తమ పార్టీ కి అనుకూలంగా కొన్ని తిరుగులేని అంశాలతో ఒక సానుకూల వాతావరణాన్ని నిర్మించడం. దీన్ని ‘నెరేటివ్ బిల్డింగ్’ అంటున్నారు. ఈ దశలో జనాలను మానసికంగా తమవైపు తిప్పుకునే బృహత్ ప్రణాళికలో భాగంగా విపక్షాలను తుత్తునియలు చేయడంలో భాగంగా కులం, మతం, తదితర సున్నిత అంశాలను అస్త్రాలుగా చేసుకోడానికి వెనకాడరు. బూత్ ల స్థాయి వరకూ పకడ్బందీ పథకాలు నిర్మించి అమలు చేయడం ఇక్కడ కీలకం.
తమను నియమించుకున్న రాజకీయ పార్టీ లో లోటుపాట్లను లోతుగా అధ్యయనం చేయడంతో పాటు ఎప్పటికప్పుడు నివేదికలు తయారుచేయడం, సర్వేలు జరపడం కూడా సాగిపోతుంది చాపకింద నీరులా. పీకే ప్రభావాన్ని వివరిస్తూ, అయన ఆహ్వానం మేరకే తాను వై ఎస్ ఆర్ సీ పీ లో చేరానని, తనను ఇలా ఇరికించి అయన తప్పుకున్నాడని నరసాపురం ఎంపీ, ఆ పార్టీ తిరుగుబాటు నేత రఘురామ రాజు బహిరంగంగానే చెబుతున్నారు.
ఇక మూడోది, కమ్యూనికేషన్. ఆధునిక రాజకీయ చరిత్రలో సోషల్ మీడియా పాత్ర ఏమిటో నేతలకు చెప్పి చూపించిన ఘనత ఐ-ప్యాక్ టీమ్ దే.
EXCLUSIVE ARTICLES
సీనియర్ జర్నలిస్టు గోవిందరాజు చక్రధర్ వ్యాసాల ప్రత్యేకపేజీ కోసం క్లిక్ చేయండి
‘సుభాషితం’ సంస్కృతశ్లోకాలకు భావవివరణల వ్యాసాల కోసం ఈ పేజీ క్లిక్ చేయండి
సీనియర్ జర్నలిస్టు బీరక రవి ప్రత్యేక వ్యాసాల కోసం ఈ పేజీ క్లిక్ చేయండి
సీనియర్ జర్నలిస్టు డాక్టర్ ఎస్ రాము ప్రత్యేక వ్యాసాల కోసం ఈ పేజీ క్లిక్ చేయండి
దేవీప్రసాద్ ఒబ్బు లోపలిమాట వ్యాసాల కోసం ఈ పేజీ క్లిక్ చేయండి
సంపాదకుడు సురేష్ పిళ్లె వ్యాసాల కోసం ఈ పేజీ క్లిక్ చేయండి
ఓటర్లను ప్రభావితం చూపే ప్రతి అంశాన్ని సామాజిక మాధ్యమాల ద్వారా ఈ బృందం డీల్ చేస్తుంది. అదే పనిగా తమ నేతలను పొగడ్డం, వైరి పక్షాలను తిట్టి గాలిగాలి చేయడంలో వీళ్ళు సిద్ధహస్తులు. ఒక వ్యవస్థ ద్వారా ఈ పనులు జరుగుతాయి కాబట్టి పీకే పంచనచేరిన రాజకీయ పార్టీలను ఢీ కొట్టి నిలవడం వైరి పార్టీలకు అంత తేలిక కాదు. ఇలా పీకే మార్క్ రాజకీయ వ్యూహ రచన గురించి ఎంత చెప్పినా తక్కువే.
ఎప్పటి నుంచో అమల్లో ఉన్న పీఆర్ (పబ్లిక్ రిలేషన్స్) వ్యవస్థ ను ఒక వంద అడుగుల ముందుకు తీసుకుపోతే ఏర్పడిందే పీకే వ్యవస్థ. ఇది కచ్చితంగా ఖరీదైన వ్యవహారమే. అధికారం కోసం ఓటర్లను భారీగా ప్రలోభపెట్టే రాజకీయ పార్టీలు పెద్ద మొత్తంలో చెల్లించి ఐ-ప్యాక్ సేవలు వినియోగించుకునేది అధికారం లోకి వచ్చి ఉచిత సేవలు చేయడానికి కాదు కదా! వడ్డీతో సహా ఆనక వారు లాగించేస్తారు.
ఈ విధంగా ప్రజాస్వామ్యం ప్రలోభ ప్రభావాల పర్వంతో మరింత దిగజారి పోతుంది. ఇది అవలక్షణమని కొందరు, సలక్షమైన ఈ సేవలను వాడుకోవడం తప్పెలా అవుతుందని అనే వారూ ఉన్నారు. మరి ఇది ఈనాటి వాస్తవం. మొత్తానికి ఇదొక పరిణామం. మనం చేయగలిగేది ఏమీలేదు. జనం సొంతగా ఆలోచించి మేల్కొనేదాకా వేచి చూడ్డం వినా చేయదగినది ఏమీ లేదు.
.. డాక్టర్ ఎస్. రాము
సీనియర్ పాత్రికేయుడు, జర్నలిజం బోధకుడు
Discussion about this post