సోము వీర్రాజు వ్యవహారం చాలా పెద్దదిగా మారుతోంది. తొలిరోజు చేసిన ప్రసంగం ఒక స్థాయి వరకు పార్టీకి నష్టంచేస్తే.. దాన్ని సర్దిచెప్పుకునే ప్రయత్నంలో రెండోరోజు చేసిన ప్రకటన అదనపు నష్టాన్ని కలిగించింది. అటు భారతీయ జనతా పార్టీలోనూ.. ఇటు రాజకీయ పరిశీలకుల్లోనూ ఇప్పుడు ఒకటే అనుమానం రేకెత్తుతోంది.
ఇంతకూ భారతీయ జనతా పార్టీ రాష్ట్ర శాఖకు సారథ్యం వహిస్తున్న సోము వీర్రాజు.. అమాయకుడా? లేదా, రాష్ట్రంలో పార్టీని పాతిపెట్టేయడానికి శల్యసారథ్యం నడుపుతున్న వ్యూహచతురుడా? అని!
‘ప్రజా ఆగ్రహ సభ’ పేరుతో భారతీయ జనతా పార్టీ ఓ పెద్ద సభను నిర్వహించింది. ఆ పార్టీకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంపై చాలా ఆశలున్నాయి. ప్రత్యేకహోదా లాంటి అంశాలను ప్రజలు నెమ్మదిగా మరచిపోతున్నారనే నమ్మకం ఉంది. ఇలాంటి నేపథ్యంలో.. కాస్త చురుగ్గా పనిచేయడం మొదలెడితే.. అచ్చంగా 2024 ఎన్నికలకు టాప్‌గేర్‌లోకి రాలేకపోయినా సరే.. పార్టీకి బలం పెరుగుతుందనే ఆశ ఉంది.
పవన్ కల్యాణ్‌తో ఎటూ పొత్తులు ఉన్నాయి గనుక.. ఆయన ఎత్తుగడల్లో- వ్యవహారసరళిలో నిలకడ వచ్చి, అనుకోకుండా పరిస్థితులు కలిసి వస్తే.. కాసిని సీట్లు కూడా దక్కుతాయనే కోరిక కూడా ఉంది. అలాగే ప్రజల్లో జగన్మోహన్ రెడ్డి పరిపాలన పట్ల వ్యతిరేకత ఉందనే అభిప్రాయం కూడా బీజేపీ నేతల్లో ఉంది.
సరిగ్గా ఆ వ్యతిరేకతను తమకు అనుకూలంగా మలచుకునే ప్రయత్నాలు చేయకపోతే.. ఎప్పటికీ రాష్ట్రంలో వేళ్లూనుకోలేం అనేది వారి భయం. ఆ రూపేణా జరిగిన ప్రయత్నమే ఈ ‘ప్రజా ఆగ్రహ సభ’!
ప్రభుత్వం మీద గట్టిగానే దాడికి దిగాలని భారతీయ జనతా పార్టీ అనుకుంది. అందుకోసమే.. ఢిల్లీస్థాయిలో కూడా జగన్ సర్కారు మీద వైరభావంతోనే ఉన్నారనే సంకేతాలు ఇవ్వడానికి అక్కడినుంచి ప్రకాశ్ జవదేకర్ కూడా వచ్చారు. ఆ మోతాదులోనే ఆయన దాడికి దిగారు. బెయిలుపై బయట ఉన్న ఏపీ నాయకులంతా త్వరలోనే జైలుకు వెళ్తారనే కేంద్ర మంత్రి ప్రకటన ఆషామాషీ మాట కాదు.
ప్రభుత్వ వైఫల్యాలు, అవినీతి లాంటి ప్రస్తావనలను మించి.. బెయిలు గురించి మాట్లాడడం చాలా తీవ్రమైన విషయం. అయితే బీజేపీ చేసిన ఈ సీరియస్ విమర్శలన్నీ గాలికి కొట్టుకుపోయాయి. రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు ప్రల్లదనంతో పలికిన ఒకే ఒక్క మాట మాత్రమే.. ఇవాళ మొత్తం దేశం దృష్టిని ఆకర్షిస్తోంది.
భారతీయ జనతా పార్టీని దేశవ్యాప్తంగా వారి వ్యతిరేకులు ఒక రేంజిలో ఉతికి ఆరేస్తున్నారు. ‘వాటే స్కీమ్.. వాటే షేమ్’ అంటూ కేటీఆర్ ఎద్దేవా చేశారు. ‘ఈ బంపర్ ఆఫర్.. పార్టీ తీసికట్టుగా ఉన్న రాష్ట్రమైన ఏపీ ప్రజలకు మాత్రమేనా? దేశానికంతా వర్తిస్తుందా?’ అని ఆయన ట్వీట్ చేశారు. తృణమూల్ కాంగ్రెస్ కు చెందిన ఎంపీ మహువా మొయిత్రా తన ట్వీట్ లో ఇంకో రేంజిలో ఆడుకున్నారు. ఏపీ బీజేపీ చీఫ్- కోటి ఓట్లు వేస్తే రూ.70కే లిక్కర్ ఆఫర్ ను ఎద్దేవా చేస్తూనే.. మోడీ, షాను ఉద్దేశించి.. ‘తర్వాత ఏమిటి? గోమాంసం కబాబ్ లు వడ్డిస్తారా?’ అంటూ గేలిచేశారు. అలా సోము వీర్రాజు వ్యాఖ్యల పర్యవసానంగా.. సర్వవిధాలుగానూ పార్టీ భ్రష్టుపట్టిపోతోంది.
మిగిలిన పరువు కూడా తీసేసిన సోము!
ఎప్పుడు మాట్లాడినా ఏం మాట్లాడుతున్నాడో తనకే తెలియక మాట్లాడుతున్నాడా అనిపించేలా.. గందరగోళంగా మాట్లాడే సోము వీర్రాజు ఏదో ఫ్లోలో సభలో అలా మాట్లాడేశారని ఎవరైనా సర్దుకుపోయే వారు, జాలి చూపించేవారు ఉంటే వారికి షాక్ ఇది. ఈ వ్యాఖ్యల తరువాత కూడా బీజేపీకి ఏపీ రాజకీయాల్లో ఏ కొంతైనా గౌరవం మిగిలుంటే.. సోము వీర్రాజు బుధవారం నాడు దాన్ని పూర్తిగా తుడిచిపెట్టేశారు.
తన వ్యాఖ్యలు రచ్చరచ్చ అవుతుండే సరికి నష్టనివారణ కోసం ప్రత్యేకంగా ప్రెస్ మీట్ పెట్టిన సోము వీర్రాజు.. వైసీపీ ప్రభుత్వం మీద మాటల దాడిచేస్తూనే.. పనిలో పనిగా.. లిక్కర్ గురించి కూడా అదనపు సమాచారం ఇచ్చారు. తాను పేదల పక్షపాతినని, పేదలకు 50కే చీప్ లిక్కర్ అందిస్తే.. మిగిలిన డబ్బును వారి కుటుంబం బాగుకోసం వాడుకుంటారనేది ఆయన మాట. చీప్ లిక్కర్ ధర తగ్గింపును ఎరగా వేసి ఓట్లు అడుక్కొన్న క్రితంరోజు వ్యాఖ్యలను సమర్థించుకోవాలని ఉంటే.. అందుకు ఇంకేదైనా రీతిలో మాటల గారడీతో, మసిపూసి మారేడుకాయ చేయాల్సింది.
కానీ.. అదేమీ పట్టకుండా.. ఆయన సమర్థించుకున్న తీరు ఎలా ఉన్నదంటే.. ‘చీప్ లిక్కర్ ధర విషయంలో తాను చాలా చిత్తశుద్ధితో, పూర్తి స్పృహతో, నిర్దిష్టమైన ప్రణాళికతో’ చెప్పినట్లుగా ఉన్నది. చర్యతో పార్టీకున్న ఆ కాస్త పరువూ పోయింది. ‘పేదవాడి రక్తం తాగుతున్న ఈ ప్రభుత్వంలాగా కాకుండా.. మద్యం ధరలను నియంత్రిస్తాం’ లాంటి జనాంతికమైన మాటతో ముగించి ఉంటే బాగుండేది. కానీ సోము వీర్రాజు అత్యుత్సాహానికి వెళ్లి ఇరుక్కున్నారు. కేంద్రంలో అధికారంలో ఉన్న జాతీయ పార్టీ- రాష్ట్ర శాఖ సారధికి.. సజావైన ఆలోచన దృక్పథం లేకపోవడం మాత్రమే కాదు.. జ్ఞానం కూడా లేదని వీర్రాజు సాధికారికంగా నిరూపించుకున్నారు.
ఆంద్రప్రదేశ్ రాష్ట్ర జనాభానే అయిదు కోట్లు. ఓటర్లు 4.04 కోట్ల మంది. అయితే ‘‘రాష్ట్రంలో కోటిమంది చీప్ లిక్కర్ తాగేవాళ్లున్నారు.. ఆ కోటి ఓట్లు మాకు వేయండి..’’ అని అంటున్నారంటే.. ఆయన ఉద్దేశం ప్రజల్లో ప్రతి నలుగురిలో ఒకరు చీప్ లిక్కర్ తాగుతున్నారనేనా? ఉన్న ఓటర్లలో పురుషులు ఇంచుమించు 2 కోట్లు ఉంటే.. మహిళలు 2.04 కోట్ల వరకు ఉన్నారు. వీరిలో ఎందరిని సోము వీర్రాజు తాగుబోతుల కింద గుర్తిస్తున్నారు. నిజంగానే తాగుబోతులకు మేలు చేసి.. వారి ఓట్లను దక్కించుకోవాలని ఉంటే గనుక.. మొత్తంగా మద్యం ధరలను నియంత్రిస్తాం అని ఉండాల్సింది.
చీప్ లిక్కర్ మాత్రమే ఎందుకు తగ్గించాలి. అదికూడా 70కు ఇస్తామని రాబడి బాగుంటే 50కు ఇస్తామని అనడం ఇంకా చిత్రం. ప్రజలు ఇప్పుడు తాగుతున్న మోతాదులోనే తాగితే రాబడి పడిపోతుంది గానీ.. ఎలా పెరుగుతుంది. ఆయన 50కు అందించేలా రాబడి పెరగాలంటే.. ప్రజలందరూ ఒక్కొక్కరు మూడునాలుగు సీసాల చీప్ లిక్కర్ తాగాలి! అదే సోము వీర్రాజు కోరికా?
సోము వీర్రాజు ఇదంతా అమాయకంగా మాట్లాడుతున్నారని అనుకోడానికి వీల్లేదు. ఆయన మరీ అంత అమాయకుడు కాదు! అమాయకుడే అయితే.. అలకపూని రాష్ట్ర పార్టీ సారథ్యం సాధించుకునే వాడే కాదు! కానీ ఇలా పార్టీ పరువు పోయేలా.. మాట్లాడడం వలన ఆయన వైసీపీకి అనుకూలంగా, లోపాయికారీగా వ్యవహరించే వ్యక్తి అనే ప్రచారం ఇంకాస్త పెరిగేలా ఉంది.
ఇది శల్యసారథ్యమేనా?
2024లో అధికారంలోకి వచ్చి తీరుతాం అనే ప్రగల్భాలు ఎంతగా పలుకుతున్నప్పటికీ.. భారతీయ జనతాపార్టీకి ఆ ఆశగానీ, నమ్మకంగానీ లేవు. కాకపోతే.. ఇప్పుడున్నంత అంగుష్టమాత్రంగా కాకుండా రాష్ట్ర రాజకీయాల్లో కూడా ప్రభావం చూపగల పార్టీగా ఎదుగుతామనే నమ్మకం ఉంది. వారు- అమరావతికి మద్దతిచ్చినా, ప్రభుత్వ వ్యతిరేకతతో రెచ్చిపోవాలని నిర్ణయించుకున్నా అందుకే. కానీ.. సారథి పార్టీ పరువును ఏ రకంగా తీసేస్తాడో అర్థం కాని పరిస్థితుల్లో.. ప్రజాదరణ పరంగా పార్టీ ఒక అడుగు ముందుకు వేసేలోగా.. సారథి పది అడుగులు వెనక్కు లాగేసే తీరుతో ఉంటే.. వారి ప్రస్థానం ఎలా సాగుతుంది?
ఇప్పుడు పార్టీ వర్గాల్లో రేకెత్తుతున్న కొత్త చర్చ ‘ఇదంతా సోము వీర్రాజు వ్యూహాత్మకంగా చేస్తున్నారా?’ అనేది. ఆయన వైసీపీకి అనుకూలంగా వ్యవహరించే వ్యక్తి అనే పేరును ఇదివరలో మూటగట్టుకున్నారు. పార్టీ కీలక నాయకులతో తిరుపతిలో నిర్వహించిన భేటీలో.. ‘మన పార్టీలో వైసీపీ కోవర్టులున్నారని’ అమిత్ షా అనేవరకూ పరిస్థితి వెళ్లిందంటే చిన్న సంగతి కాదు. ( also read : మన పార్టీలో జగన్ ఏంజట్లు : అమిత్ షా ఆగ్రహం) ప్రజల్లో గుర్తింపు తెచ్చుకోవాలి.. ఎదగాలి అని కలగంటున్న పార్టీని ఇలా భ్రష్టు పట్టించేయడం ఒక వ్యూహం ప్రకారం జరుగుతున్నదా? దీని వెనుక వైసీపీ వారి మార్గదర్శనం కూడా ఉన్నదా అని అనుమానిస్తున్న వారు కూడా లేకపోలేదు.
EXCLUSIVE ARTICLES
సీనియర్ జర్నలిస్టు గోవిందరాజు చక్రధర్ వ్యాసాల ప్రత్యేకపేజీ కోసం క్లిక్ చేయండి
‘సుభాషితం’ సంస్కృతశ్లోకాలకు భావవివరణల వ్యాసాల కోసం ఈ పేజీ క్లిక్ చేయండి
సీనియర్ జర్నలిస్టు బీరక రవి ప్రత్యేక వ్యాసాల కోసం ఈ పేజీ క్లిక్ చేయండి
సీనియర్ జర్నలిస్టు డాక్టర్ ఎస్ రాము ప్రత్యేక వ్యాసాల కోసం ఈ పేజీ క్లిక్ చేయండి
దేవీప్రసాద్ ఒబ్బు లోపలిమాట వ్యాసాల కోసం ఈ పేజీ క్లిక్ చేయండి
సంపాదకుడు సురేష్ పిళ్లె వ్యాసాల కోసం ఈ పేజీ క్లిక్ చేయండి
ఏదేమైనా సోమువీర్రాజు అధ్యక్ష పదవికి రోజులు దగ్గర పడ్డాయి. సాధారణంగా అధ్యక్షుడిని రెండు దఫాలు పదవిలో కొనసాగించే బీజేపీ సాంప్రదాయం.. సోము విషయంలో నిజం కాకపోవచ్చు. కొత్తసారధిగా రాష్ట్ర పార్టీని నడిపించాలనే ముచ్చట చాలా మంది నాయకుల్లో ఉంది. అయితే, ఇప్పటి పరిణామాల తర్వాత శిథిలాల్లోంచి- పార్టీ నిర్మాణం అనేది వారికి పెద్ద సవాలు అవుతుంది.
Discussion about this post