చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తి పట్టణంలోని శ్రీకాళహస్తీశ్వర ఆలయంలో ఇద్దరు ఉద్యోగులను సస్పెండ్ చేయడంతో పాటు… మరో ఇద్దరు ఉద్యోగులకు మెమోలు జారీ చేస్తూ ఆలయ కార్యనిర్వహణాధికారి పెద్దిరాజు మంగళవారం రాత్రి ఉత్తర్వులు జారీ చేశారు.
ఇందుకు సంబంధించి వివరాలు ఇలా ఉన్నాయి. శ్రీకాళహస్తీశ్వర ఆలయంలో ఎన్నడూ లేని విధంగా వరుసగా రెండు రోజులు రాహు-కేతు సర్పదోష నివారణ పూజలు చేసుకునే భక్త్తులకు వెండి నాగపడగలు కొరత ఏర్పడింది.
ఈ కారణంగా రాహు-కేతు పూజలు గంటల తరబడి ఆగి పోయి… భక్తులు ఇబ్బంది పడ్డారు. రాహు-కేతు పూజా సామాగ్రి అందించే కౌంటర్ల వద్ద భక్తులు ఆందోళనకు దిగడంతో పాటు… అధికారులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు.
కౌంటర్ల వద్ద కమ్మీలను విరిచేయడం… అద్దాలను ధ్వంసం చేసి నిరసన తెలియజేశారు. ఇక నాగపడగల కొరతపై తెలుగుదేశం, బీజేపీ, జనసేన పార్టీల నేతలు ముక్కంటి ఆలయ పరిపాలన భవనం వద్దకు చేరుకుని వినూత్న పద్ధతిలో నిరసన తెలియజేశారు.
ఆలయ ఈవో పెద్దిరాజుకు వారు వినతిపత్రం కూడా అందజేశారు. బాధ్యులపై చర్యలు తీసుకోవాలని వారు డిమాండు చేశారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.
ఈ ఘటనలు మొత్తం రాష్ట్ర దేవదాయశాఖ కమిషనరు హరి జవహర్ లాల్ దృష్టిక వెళ్లాయి. ఆయన దీనిపై విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని ముక్కంటి ఆలయ కార్యనిర్వహణ అధికారి పెద్దిరాజును ఆదేశించారు. కమిషనరు ఆదేశాల మేరకు నాగపడగలు తయారు చేసే మింట్ సూపరింటెండెంట్ రంగస్వామిని, మింట్ అప్రైజర్ రవిని సస్పెండ్ చేశారు.
అదేవిధంగా రాహు-కేతు పూజా టికెట్ల కౌంటరు వద్ద భద్రతా పర్యవేక్షణ లోపించిన కారణంగా… సూపరింటెండెంట్ విజయసారథికి, అసిస్టెంటు కమిషనరుగా ఆలయంలో విధులు నిర్వహిస్తున్న మల్లిఖార్జున ప్రసాద్ కు మెమోలు జారీ చేశారు. ఈ ఘటన ఆలయ ఉద్యోగుల్లో గుబులు రేపుతోంది.
.