‘మీ ఇంట్లో అమ్మమ్మ ఉందా? పోనీ, నాయనమ్మ? మరి తాతయ్యో!’
‘ఉన్నారుగానీ, అబ్బ! బుర్ర తినేస్తారు. గొణుగుతారు. నసుగుతారు. విసిగిస్తారు’.
‘వాళ్లు ఎప్పుడైనా మంచాన పడ్డారా? మీరు సేవలు చేశారా?’
‘మంచానా..? సేవలా..? ఇంకా నయం! జొరమొస్తేనే సేవల్జెయ్యలేక ఛస్తాం!’
* * * * *
సికింద్రాబాదు నుంచి కార్ఖానా వెళ్లి, జానకిపురి కాలనీలోని ‘ఆర్కే మదర్ థెరిసా ఫౌండేషన్’ (ఏబీఎం ప్లాజా)ను వెతుక్కుంటూ వెళ్లాను. మెయిన్ గేటు దగ్గరే నిలబడి స్వాగతం పలికాడు డాక్టర్ రామకృష్ణ. ఎక్కడో పరిచయమయ్యాడు. ‘ఒక్కసారి మా హోమ్‌కు రండి’ అని చాలాసార్లు అడిగాడు.
మనిషి సహజ ఆభరణాలైన ‘సమయం లేదు’, ‘బిజీగా ఉన్నాను’ వంటి కారణాలతో ఆలస్యమైపోయింది.
మొత్తానికి డాక్టర్‌తో కలిసి ఆ హోమ్‌లో అడుగు పెట్టాను.
అదో మూడంతస్తుల భవనం. ఒక్కో ఫ్లోర్‌లో రెండు ఫ్లాట్లు. మొదటి అంతస్తులోని కుడివైపు ఫ్లాటులోకి వెళ్లాం. మూడు గదుల్లో పదీపన్నెండు మంచాలు. వాటిమీద వృద్ధులు. కొందరికి సెలైన్ బాటిళ్లు ఎక్కుతున్నాయి. ఇద్దరు మహిళలకు ఇద్దరు నర్సులు ఫిజియోథెరపీ చేస్తున్నారు.
ఇంతకీ ఇది వృద్ధాశ్రమమా? ఆసుపత్రా? రెండూనా!
ఒక మంచం దగ్గర ఆగాను. డాక్టర్ రామకృష్ణ మొదలు పెట్టాడు.
‘‘ఈమె పేరు అన్నపూర్ణ. ఆఫీసు నుంచి ఇంటికెళ్తుంటే యాక్సిడెంట్ జరిగింది. వెన్నెముకకు గాయమైంది. తల నుంచీ పాదాల వరకూ మల్టిపుల్ ఫ్రాక్చర్స్ అయ్యాయి. పదహారు సర్జరీలు జరిగాయి. పిల్లలే ఖర్చులు భరించారు. కానీ, ఇంటికి చేరాక ఈమెను చూసుకోలేకపోయారు. ఒంటినిండా గాయాల కారణంగా ఆమె మామూలు మనిషి కాలేకపోయింది. మానసికంగా బలహీనపడిపోయి, తానేం చేస్తుందో తనకే తెలియని పరిస్థితికి చేరుకుంది. అప్పుడు ఎవరో చెబితే మా హోమ్‌కు తీసుకొచ్చారు. ఆరు నెలల నుంచి మా సిబ్బంది ఆమెను కంటికి రెప్పలా చూసుకున్నారు. ధైర్యం చెప్పారు. ఇప్పడు నడవగలుగుతోంది. త్వరలోనే ఇంటికి పంపించేస్తాం’’.
సహజ ఆకారం కోల్పోయిన ఆమె మొహంలోకి లోతుగా చూడలేక తల తిప్పుకొన్నాను. నమస్కారం పెట్టి ముందుకు కదిలాను.
మరో మంచం దగ్గరకు వెళ్లాం. కాళ్ల నుంచి గొంతుదాకా దుప్పటి కప్పుకొని ఉందామె. నలభై కంటే ఉండకపోవచ్చు.
‘‘ఈమె భర్త ప్రతిరోజూ తాగొచ్చి చిత్రహింసలు పెట్టేవాడు. ఓరోజు కిరోసిన్ పోసి నిప్పంటించేశాడు. సమయానికి వీథిలో జనం వచ్చి, ఆస్పత్రిలో చేర్చారు. నెల రోజుల తర్వాత డిశ్ఛార్జి చేశారు. తన ఇంటికి వెళ్లనని అక్కడి నర్సుతో మొర పెట్టుకుంది. ఆమె సాయంతో ఇక్కడికి చేరుకుంది. ఏడు నెలలుగా కాలిన గాయాలకు చికిత్స చేస్తున్నాం. చాలావరకు మానాయి..’’
డాక్టర్ మాటలకు అడ్డు పడుతూ ‘‘నమస్కారం బాబూ. నేనా సచ్చినోడి కాడికి బోనయ్యా. ఈడనే నర్సుగా పనిజేత్తా. మీరన్నా సెప్పండయ్యా, నాకుజ్జోగం ఇయ్యమని’’ మంటల ధాటికి ఛిద్రమై, ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న తన రెండు చేతుల్నీ దుప్పట్లోంచి బయటికి తీసి నమస్కరిస్తూ అందామె.
ఎదురుగా ఉన్న మరో ఫ్లాటులోకి వెళ్లాం. అందులో మగాళ్లున్నారు. టీషర్టు, నిక్కరు వేసుకున్న ఓ మంచంలోని పెద్దాయన నన్నాకర్షించాడు. మొహం పీక్కుపోయినా ఏదో అద్భుత వెలుగు. ఏదో స్ఫురిస్తోందిగానీ, లింకు కలవటం లేదు. రామకృష్ణ అందుకున్నాడు…
‘‘బహుశా, ఈయన మీకు తెలిసే ఉంటారు. గొప్ప ఆర్టిస్టు. పేరు చంద్ర’’.
ఉలిక్కిపడ్డాను. ఇప్పుడు కలిసింది లింకు.
నా కథలకు బొమ్మలు, పుస్తకాలకు అద్భుతమైన ముఖచిత్రాలు వేసిన ఆర్టిస్టు. ఎప్పుడు కనిపించినా ‘ఏం హీరో’ అంటూ పలకరించే సరదా మనిషి.
ఇలా అయిపోయాడేమిటి? ఇక్కడికెప్పుడొచ్చారు? ఎలా వచ్చారు?
వివరాలు చెప్పాడు రామకృష్ణ. వివిధ కారణాలతో ఆయన సంసారం ఎలా ఛిద్రమైందో డాక్టర్ చెబుతుంటే మనసులో బాధ నైరూప్యచిత్రంలా విస్తరించింది.
ఆయనకు దగ్గరగా వెళ్లి ‘‘చంద్ర గారూ, బాగున్నారా? నన్ను గుర్తు పట్టారా?’’ అన్నాను.
ఆయన నవ్వినట్లే నవ్వి, అంతలోనే అటువైపు తిరిగి, తనలో తాను గొణుక్కుంటూ ఉండిపోయాడు.
* * * * *
నాలుగైదు గదులు తిరిగాను. వృద్ధులే కాదు, నలుగురైదుగురు చిన్నవయసు వారూ ఉన్నారు. పోలీసుల రిఫరెన్స్‌తో చేరుకున్న అనాథలూ, పిల్లల ఆదరణకు నోచుకోని అభాగ్యులూ, ఆదరించే మనసున్నా అవసరమైన సేవలందించలేని పిల్లల తల్లిదండ్రులూ, మంచి ఉద్యోగాల్లో ఉండగానే విధి వక్రించి వికలదేహాలతో అక్కడికి చేరుకున్న దురదృష్టవంతులూ… ఒక్కొక్కరిదీ ఒక్కో వ్యధ. అందరికీ ఏదో ఒక చికిత్స జరుగుతోంది.
‘‘కోలుకున్నాక వీళ్లను ఇంటికి పంపేస్తారా?’’ అడిగాను.
‘‘పంపటానికి మేం సిద్ధమే సర్. వాళ్లే నిరాకరిస్తారు. ఆ వయసులో మరొకరి ఊతం లేకుండా ఇంట్లో ఉండలేమనీ, పిల్లల వల్ల కాదనీ చెబుతారు. అలాంటివాళ్లు పదిహేను మందికి పైగానే ఉన్నారు. వాళ్లను పై ఫ్లోర్‌లో ఉంచాం. అంటే, ఇక్కడ వృద్దాశ్రమం కూడా నడుస్తున్నట్లే..’’ నవ్వుతూ అన్నాడు డాక్టర్.
హోమ్ అంతా ఒకటికి రెండుసార్లు కలియదిరిగాను.
స్వచ్ఛందంగా ముందుకొచ్చి తక్కువ జీతానికే వంటపనంతా చేస్తున్నా యువతి, పెద్దల్ని పిల్లల్లా చూసుకుంటున్న నర్సులు, పేషెంట్ల మలమూత్రాలు ఎత్తిపోసే ఇద్దరు ఆయాలు.. ఒక్కొక్కరూ ఒక్కో మదర్ థెరిసా అయి నడుపుతున్న ఆలయంలా కనిపించిందా ఆశ్రమం.
డాక్టర్ రామకృష్ణ కోటీశ్వరుడు కాడు. ప్రభుత్వం నుంచి పైసా రాదు. బడా కంపెనీల అండ లేదు. టంఛన్‌గా అయిదో తేదీన లక్షన్నర అద్దె చెల్లించాలి. సిబ్బందికి జీతాలు, పేషెంట్లకు మందులు, కిచెన్‌లోకి సరుకులు, విద్యుత్తు బిల్లు, నీటి బిల్లు.. ఇవన్నీ ఎలా?
‘‘సంకల్పం సర్. అంతే. అదృష్టవశాత్తు మంచి టీమ్ దొరికింది. చూడటానికి వచ్చిన మీలాంటి వారు ఎంతోకొంత సాయం చేస్తున్నారు. నగరానికి దూరంగానైనా కాస్త భూమి దొరికితే, సొంత భవనం కట్టాలన్న ఆశ ఉంది. చూద్దాం..’’ రామకృష్ణ జవాబు.
* * * * *
కారెక్కాను.
ఇంకా ఆ పెద్దలందరూ నా కళ్లముందే విశ్రమిస్తున్నారు..
అవినీతి నిరోధక శాఖ దాడుల్లో నోట్లకట్టలూ బంగారు గొలుసులూ నిరంతరాయంగా బయటపడుతూనే ఉన్నాయి.
‘కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ’ కింద వేల కోట్ల రూపాయలు ఖర్చవుతున్నాయి.
కొన్ని కంపెనీలు ‘‘మా దగ్గర డబ్బుందిగానీ, జెనైన్‌గా సేవ చేసేవాళ్లు లేరబ్బా’ అంటుంటాయి. అలాంటి నాలుగైదు కంపెనీలనైనా పట్టుకోవాలి.
డాక్టర్ రామకృష్ణకు ఊపిరి అందించాలి.
కాదు కాదు… మదర్ థెరిసా సేవల్ని మరింతగా విస్తరింపజేయాలి.
మనసు కాస్త కుదుట పడింది.
(ఆర్కే మదర్ థెరిసా ఫౌండేషన్ ఫోన్: 99599 32323, 99595 02314)
.. ఎమ్వీ రామిరెడ్డి
9866777870
EXCLUSIVE ARTICLES
సీనియర్ జర్నలిస్టు గోవిందరాజు చక్రధర్ వ్యాసాల ప్రత్యేకపేజీ కోసం క్లిక్ చేయండి
‘సుభాషితం’ సంస్కృతశ్లోకాలకు భావవివరణల వ్యాసాల కోసం ఈ పేజీ క్లిక్ చేయండి
సీనియర్ జర్నలిస్టు బీరక రవి ప్రత్యేక వ్యాసాల కోసం ఈ పేజీ క్లిక్ చేయండి
సీనియర్ జర్నలిస్టు డాక్టర్ ఎస్ రాము ప్రత్యేక వ్యాసాల కోసం ఈ పేజీ క్లిక్ చేయండి
దేవీప్రసాద్ ఒబ్బు లోపలిమాట వ్యాసాల కోసం ఈ పేజీ క్లిక్ చేయండి
సంపాదకుడు సురేష్ పిళ్లె వ్యాసాల కోసం ఈ పేజీ క్లిక్ చేయండి
Discussion about this post