కర్నూలు జిల్లా మహానంది మండలం.
నాణ్యమైన, సారవంతమైన నేల. దండిగా నీటి సదుపాయం. వేల ఎకరాల్లో అరటి పండిస్తున్నారు. ఎండాకాలంలోనూ పచ్చని పందిళ్లు వేసినట్లు అరటితోటలు.
మొదటిసారి అరటితోటల వెంట తిరుగుతున్నాను. నాబార్డుతో కలిసి ఆ ప్రాంత రైతుల్ని సమీకరించి, ‘‘ఫార్మర్స్ ప్రొడ్యూసర్స్ కంపెనీ’’ ఏర్పాటు చేశాం. అయిదొందల మందికి పైగా రైతుల్ని సభ్యులుగా చేర్పించాలి.
అరటిసాగులో సరికొత్త పద్ధతులు ప్రవేశపెట్టడం, కొత్త రకం విత్తనాలను పరిచయం చేయటం, మార్కెట్ లింకేజీలు సాధించటం, రైతులకు గిట్టుబాటు ధర కల్పించటం… ప్రధాన లక్ష్యాలు.
కంపెనీ ప్రారంభించిన రోజు ఓ గ్రామంలో ఏర్పాటు చేసిన సమావేశంలో నేను మాట్లాడాను.
‘‘మీరంతా ఒక్క తాటిపైకి వస్తే ఎంతో మేలు జరుగుతుంది. ఈ ప్రొడ్యూసర్స్ కంపెనీకి మీరే యజమానులు. మీ పంట ఉత్పత్తులు ఈ కంపెనీ తరఫునే అమ్ముకుంటే, దళారుల బెడద తప్పిపోతుంది. విత్తనాలు, మందులు, వ్యవసాయ పరికరాలు.. అన్నిటినీ మీ కంపెనీయే సమకూర్చుకుని రైతులందరికీ అందించవచ్చు..’’
శ్రద్ధగా విన్నారు. అర్థం చేసుకున్నారు. సభ్యులుగా చేరతామన్నారు.
కానీ, నాలుగు నెలలు గడిచినా పట్టుమని పాతిక మంది కూడా సభ్యులుగా చేరలేదు. వెయ్యి రూపాయలు కట్టమని అడిగితే వంద ప్రశ్నలు వేస్తున్నారంటూ మా ఉద్యోగి మొర పెట్టుకున్నాడు.
మొదటిసారి మీటింగులో నేనేదో పడికట్టు వాక్యాలతో రైతుల్ని చైతన్యపరిచే ప్రయత్నం చేశాను తప్ప, నిజానికి నాకు అరటిసాగుపై అవగాహన లేదు.
ముందుగా తోటల పెంపకంలో మౌలిక సమస్యల గురించి తెలుసుకోవాలన్న ఉద్దేశంతో, తోటల వెంట బయల్దేరాను.
‘‘అసలు బేరగాళ్లు ఏ లెక్కన కొంటారు అరటిగెలల్ని?’’
‘‘కిలోల్లెక్కన’’.
‘‘కిలో ఎంత ఉంటుంది?’’
‘‘రేట్లు విపరీతంగా మారుతుంటాయి సార్. ఒక్కోసారి ఇరవై రూపాయలదాకా పలుకుతుంది. మరోసారి పదీ పన్నెండుకు పడిపోతుంది’’.
‘‘సగటున ఎంతుంటుంది?’’
‘‘పదిహేను రూపాయలు’’.
రహదారి పక్కనే ఉన్న తోట దగ్గర ఓ లారీ ఆగి ఉంది. పదిమంది రైతుల తోటల్లోని గెలల్ని నింపుకొని బేరగాళ్లు బెంగళూరు వైపు బయల్దేరారు.
ఆ పదిమంది మొహాల్లో ఏ మాత్రం తేజం లేదు.
పదకొండో రైతు మొహం పక్వానికి రాని అరటిగెలలా ఉంది. కోపమూ దుఃఖమూ కలగలసి కళ్లల్లోని ప్రశాంతతను ఛిన్నాభిన్నం చేస్తున్నాయి.
‘‘అట్లా తోట వాకిట్లోనే మగ్గబెట్టుకునే బదులు ఆళ్లకిచ్చేస్తే ఎంతోకొంత గిట్టేది కదా లక్ష్మయ్యా?’’
‘‘ఇప్పుడు మీరు సుఖంగా ఉన్నారా? సంతృప్తిగా అమ్మారా? కిలో నాలుగు రూపాయలా? ఎకరానికి ఎంత పెట్టుబడి పెట్టార్రా? ఈ రేటుకు అమ్మితే ఎంత నష్టమో ఆలోచించారా?’’
‘‘కుళ్లబెట్టుకునే కన్నా తెగనమ్ముకోటమే ఉత్తమం’’.
‘‘తెగనమ్ముకోటానికి ఇదేమైనా పాడి ఎండిపోయిన పశువా? అసలు మీరంతా ఆ లారీలోకి గెలలెత్తినట్టు లేదు; శవాలెత్తినట్టుంది’’ నిర్వేదంగా అనేసి అక్కడినుంచి వెళ్లిపోయాడు లక్ష్మయ్య.
ఆరోజు సాయంత్రం మళ్లీ మా ఆఫీసులో రైతులతో సమావేశం.
నేను ప్రారంభించాను..
‘‘మనం జట్టు కట్టాలి. పట్టుదలతో ముందుకుసాగాలి. గట్టిగా కృషి చేసి, పెద్ద పెద్ద కంపెనీలతో టై అప్ పెట్టుకోవాలి. ధరను మనమే నిర్ణయించాలి..’’
రైతుల మధ్యలో కూచున్న లక్ష్మయ్య విసురుగా లేచాడు. నా వంక భయంకర తిరస్కార భావంతో చూసి, పైపంచె దులిపి, బయటికి నడిచాడు.
నాకర్థమైంది.. నేను రాజకీయ నాయకుడిలా కుళ్లిపోయిన ఉపన్యాసం అందుకున్నానని!
* * * * *
మరుసటి రోజు ఉదయం పేపరు చదువుతుండగా ఓ వార్త నా మనసును వికలం చేసింది.
‘‘కర్నూలు జిల్లా మహానంది మండలానికి చెందిన రైతు లక్ష్మయ్య ఎనిమిది ఎకరాల్లో అరటి సాగు చేశాడు. అతని కష్టానికి తగ్గట్టుగా దిగుబడి కూడా బాగానే వచ్చింది. కానీ, ధర కిలో నాలుగైదు రూపాయలకు పడిపోవటంతో గుండె రగిలిపోయింది. కాయలన్నీ చెట్ల మీంచి రాలిపోవటమే కాకుండా పండుబారిపోతున్నాయి. ఆ పరిస్థితిని చూసి తట్టుకోలేక, తోటకు నిప్పంటించాడు’’.
* * * * *
హైదరాబాదులో నేనుంటున్న మియాపూర్ ప్రాంతం…
‘‘బాబూ, అరటిపళ్లు డజనెంత?’’
‘‘అరవై సార్’’.
‘‘అరవయ్యా! మరీ మండిస్తున్నావే? యాభైకివ్వు’’
‘‘బేరం లేదు సార్. అరవై ఇవ్వండి’’ నా అనుమతి కోసం చూడకుండానే డజను పళ్లు కవర్లో పెట్టి, చేతికందించాడు.
అరవై రూపాయలు నేనతని చేతిలో పెట్టాను.
..ఎమ్వీ రామిరెడ్డి
Discussion about this post