శ్రీకాళహస్తి మాజీ ఎమ్మెల్యే, తెలుగుదేశం ప్రభుత్వంలో మంత్రిగా కూడా సేవలందించిన బొజ్జల గోపాలకృష్ణా రెడ్డి కన్నుమూశారు. చాలాకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న బొజ్జల గోపాలకృష్ణా రెడ్డి, శుక్రవారం మధ్యాహ్నం హైదరాబాదులోని అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించారు.
బొజ్జల గోపాలకృష్ణారెడ్డి మృతి పట్ల ఆయనకు ఎంతో సన్నిహితుడు, తెలుగుదేశం అధినేత చంద్రబాబునాయుడు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆయన భార్య, కొడుకు, ఇతర కుటుంబసభ్యులకు తన ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. బొజ్జల గోపాలకృష్ణారెడ్డికి భార్య బృందమ్మ, కొడుకు సుధీర్, కోడలు రిషిత. మనవరాళ్లు అనిక, సవిక, కూతురు పద్మరేఖ, అల్లుడు గంగాభవన్ రెడ్డి! మనవడు అక్షయ్ ఉన్నారు.
గోపాలకృష్ణా రెడ్డి మరణంతో శ్రీకాళహస్తి నియోజకవర్గం దిగ్భ్రాంతికి గురైంది. నియోజకవర్గ వ్యాప్తంగా ఉన్న ఆయన అభిమానులు దుఃఖసముద్రంలో మునిగిపోయారు. ఆయన పార్థివ దేహాన్ని హైదరాబాదునుంచి శ్రీకాళహస్తి సమీపం ఊరందూరులోని స్వగృహానికి తీసుకురానున్నారు.
ఇదీ చదవండి :
శ్రీకాళహస్తిపై గోపాలన్న ముద్ర చెరగనిది!
బొజ్జల గోపాల కృష్ణారెడ్డి ఇటీవలే 73వ జన్మదినాన్ని హైదరాబాదులోని ఇంటిలో ఘనంగా జరుపుకున్నారు. ఆయన పుట్టినరోజు వేడుకలకు చంద్రబాబునాయుడు, మండవ వెంకటేశ్వరరావు, అనేకమంది ఇతర ప్రముఖులు కూడా హాజరయ్యారు. శ్రీకాళహస్తి నుంచి వందల సంఖ్యలో అభిమానులు కూడా పాల్గొన్నారు. ఆయన సంపూర్ణారోగ్యంతో ఉండాలని వారంతో శుభాకాంక్షలు అందించారు. 73వ పుట్టినరోజు తర్వాత కేవలం కొన్ని వారాల వ్యవధిలోనే ఆయన మరణించడం బాధాకరం.
బొజ్జల గోపాలకృష్ణారెడ్డి మృతికి ఆదర్శిని డాట్ కామ్ ప్రగాఢ సంతాపం తెలియజేస్తోంది.
ఆయన 73వ జన్మదినం సందర్భంగా, గోపాలకృష్ణారెడ్డి రాజకీయ ప్రస్థానంపై రూపొందించిన డాక్యుమెంటరీని చూడండి
Discussion about this post