అన్నదాతకు ఎరువు కరువైంది. బస్తా ఎరువు కోసం రోజంతా దుకాణాల వద్ద పడిగాపులు కాయాల్సి వస్తోంది. ఎరువు దొరక్క పోవడంతో సాగు ప్రశ్నార్థకంగా మారింది. ఈ ప్రభావం రాష్ట్ర వ్యాప్తంగా కనిపిస్తోంది. అయినా పాలకులు, వ్యవసాయ అధికారులు ఎరువుల కొరత లేదని బుకాయిస్తున్నారు. వారు చెప్పే మాటలకు… క్షేత్ర స్థాయిలో రైతులు పడుతున్న కష్టాలకు పొంతన ఉండట లేదు. ప్రభుత్వ అధికారులు ఒకవైపు ఎరువుల కొరత లేదంటూనే…ఇంకా కావాలంటూ కేంద్రానికి ఇండెంట్లు పెట్టడం వెనుక డొల్లతనం కన్పిస్తోంది.
ఎరువుల కొరతను ఆసరాగా తీసుకుని… వ్యాపారులు చీకటి దందా కొనసాగిస్తున్నారు. మార్కెట్ ధర కంటే అధికంగా విక్రయిస్తూ… అన్నదాతను నిలువునా దోచుకుంటున్నారు. ప్రైవేటు డీలర్ల వద్ద బస్తా యూరియా రూ.266కు విక్రయించాల్సి ఉండగా… రూ.500కు విక్రయిస్తున్నారు. డీఏపీ రూ.1,400 నుంచి రూ.1,550 వరకు విక్రయిస్తూ చీకటి దందా చేస్తున్నారు. ఈ విషయం పాలకులకు తెలిసినా… ఏమీ ఎరగనట్లు నటిస్తున్నారు. ఎరువుల కోసం అన్నదాతలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదంటూ ప్రకటనలు గుప్పిస్తున్నారు. ఇది పాలకుల చిత్తశుద్దిని శంకించాల్సి వస్తోంది.
దేశ వ్యాప్తంగా ప్రస్తుతం ఎరువుల కొరత పట్టి పీడిస్తోంది. ముఖ్యంగా యూరియా రైతులకు అందుబాటులో ఉండటం లేదు. ఏపీలోనూ ఇదే దుస్థితి. ఖరీఫ్ ఆరంభం నుంచి ఏపీలో రైతులు ఎరువుల కోసం ఎన్నో కష్టాలు పడుతున్నారు. సొసైటీలకు ఎరువులు వస్తున్నాయని తెలియడంతో గంటల కొద్దీ రైతులు బారులుతీరి ఎదురు చూస్తున్నారు. రైతు సేవా కేంద్రాల ద్వారా ఎరువులను పంపిణీ చేస్తున్నప్పటికీ… యూరియా కొరత తీవ్రంగా ఉంది. గతంలో రైతు భరోసా కేంద్రాల్లో డబ్బులు కట్టిన వెంటనే ఎరువులు, పురుగు మందులు ఇవ్వగా… ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. నెల రోజుల క్రితం నుంచి యూరియా కోసం రైతులు పడిగాపులు కాస్తున్నారు. రాష్ట్రంలో ఎటు చూసినా ఎరువుల కోసం రైతులు నిత్యం రోడ్డెక్కుతూనే ఉన్నారు. ఎరువుల నిల్వలపై అధికారులు చెబుతున్న లెక్కలకు… క్షేత్రస్థాయిలో కనిపిస్తున్న నిల్వలకు పొంతన ఉండటం లేదు.
అరకొరగా కేటాయింపులు
ఖరీఫ్ ఆరంభం నుంచి ఏపీలో ఎరువులుకు ఎక్కువ డిమాండు పెరిగింది. అయినా అధికారులు రైతు సేవా కేంద్రాలు, ప్రాథమిక వ్యవసాయ పరిమితి సంఘాలు, జిల్లా కేంద్ర మార్కెటింగ్ కేంద్రాలకు సైతం అరకొరగా కేటాయిస్తున్నారు. దీంతో క్షేత్రస్థాయిలో కొరత ఎక్కువుగా ఉంది. ఇదే సమయంలో డీలర్లు కృత్రిమ కొరత సృష్టిస్తూ… అన్నదాతను నుంచి దోచుకుంటున్నారు. ఎరువులు మహాప్రభో అంటూ అన్నదాతలు వేడుకుంటున్నప్పటికీ పాలకులు మాటలతో కాలం గడిపేస్తున్నారు. మరోవైపు ఎరువుల కొరత లేదని బుకాయిస్తూ రైతులను ఇబ్బందులకు గురి చేస్తున్నారు. రాష్ట్రంలో ఈ ఖరీఫ్ లో 85.26లక్షల ఎకరాల్లో సాగు లక్ష్యంగా ఉంది. ఇందులో ఇప్పటి వరకు సగం కూడా సాగు కాలేదని అధికారుల నివేదికలు చెబుతున్నాయి. గతంలో యేటా ఖరీఫ్ సీజన్ కు 19లక్షల టన్నుల ఎరువులు కేటాయించేవారు. 2024-25లో 17.50 లక్షల టన్నుల ఎరువులు కేటాయించగా… 2025-26లో 16.76లక్షల టన్నులకు కుదించారు. ప్రారంభ నిల్వలతో కలిపి 13.56 లక్షల టన్నుల ఎరువులు అందుబాటులో ఉన్నట్లు వ్యవసాయశాఖ నివేదికలు చెబుతున్నాయి. ఇక సరఫరా చేస్తున్న ఎరువుల్లో 70 శాతానికిపైగా ప్రైవేటు వ్యాపారులకే కేటాయిస్తున్నారు.
పెరిగిన ఎరువుల ధరలు
ఎరువుల ధరలు ప్రతి యేటా పెరుగుతూనే ఉన్నాయి. ఈ ధరలు నియంత్రించడానికి పాలకులు ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదు. గత యేడాదితో పోలిస్తే… ఈ యేడాది సగటున బస్తాకు రూ.50 నుంచి రూ.330కు వరకు పెరిగాయి. అత్యధికంగా 1026 రకం ఎరువు బస్తా ధర రూ.1,470 నుంచి రూ.1,800కు పెరిగింది. పొటాష్ ధర రూ.1,530 నుంచి రూ.1,800కు చేరింది. చైనా నుంచి ఎరువుల దిగుమతి నిలిచి పోవడంతో డ్రిప్ ఎరువుల ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి. ఇప్పటివకు 11.84 లక్షల టన్నుల ఎరువుల విక్రయాలు జరగ్గా… అందులో అత్యధికంగా యూరియా 4.89 లక్షలు… కాంప్లెక్స్ 4.09 లక్షలు… డీఏపీ 1.53లక్షలు… ఎస్ఎస్ పీ 76వేలు… ఎంవోసీ 57వేలు టన్నులు విక్రయం జరిగినట్లు నివేదికలు చెబుతున్నాయి. ప్రస్తుతం 6.23 లక్షల టన్నుల ఎరువులు అందుబాటులో ఉన్నట్లు అధికారులు చెబుతున్నారు. ఇందులో యూరియా కేవలం 1.50 లక్షల టన్నులు… డీఏపీ 84వేల టన్నులు ఉంది.
ఎక్కడ చూసినా యూరియా కొరత
ఏపీలో ఎక్కడ చూసినా యూరియా కొరత కనిపిస్తోంది. రాష్ట్రంలోని 25 జిల్లాల్లో ఈ సమస్య ఉంది. నిల్వలు తక్కువగా ఉండటంతో యూరియా రైతులు పెద్ద సంఖ్యలో బారులు తీరుతున్నారు. రైతు సేవా, మార్క్ ఫెడ్, సొసైటీ కేంద్రాల దగ్గర యూరియా ‘నో స్టాక్’ బోర్డులు పెడుతున్నారు. రాష్ట్ర కోటా మేరకు ఎరువులు వస్తే… అవి ఎక్కడికి వెళ్లాయన్న ప్రశ్నలు రైతుల మదిలో మెదలుతున్న ప్రశ్న. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు రాష్ట్రవ్యాప్తంగా రైతులకు ఎరువుల నిరంతర సరఫరా చేయాలని… అధికారులకు ఇటీవల దిశానిర్దేశం చేశారు. అయినా ఆ దిశగా అధికారులు ఇంకా చర్యలు తీసుకోవడం లేదనే విమర్శలు వినపడుతున్నాయి. ప్రైవేటు డీలర్ల కంటే ప్రాథమిక సహకార సంఘాలకు ప్రాధాన్యం ఇవ్వాలని, రోజువారీ మానిటరింగ్ బృందాలు ఏర్పాటు చేసి పోలీసు, రవాణా, విజిలెన్స్, వ్యవసాయ అధికారులు, కలెక్టర్లు కలిసి పర్యవేక్షించాలని సీఎం సూచించారు. ఇది అమలు జరిగితే రైతులకు ఎరువు సమస్య తీరుతుంది. లేదంటే ఈ సమస్య కొనసాగి… అన్నదాతలు నష్ట పోవలసి వస్తుంది. ఇది పాలకులు, అధికారులు గమనించి తగు చర్యలు తీసుకుని అన్నదాతను ఎరువుల కష్టం నుంచి ఆదుకోవాల్సి ఉంది.
Discussion about this post