ఈ మధ్య మన తెలుగు సినిమా ఆర్.ఆర్.ఆర్. గురించిన వార్తలు మాధ్యమాల్లో, ముఖ్యంగా వాట్స్ ఆప్ లో,ఎక్కువ వస్తున్నాయి. ఆ సినిమా ఏవో విభాగాలలో ఆస్కార్ పురస్కారానికి పోటీ పడుతోందని, బరిలో నిలిచేలా హాలీవుడ్ ప్రముఖులే సిఫార్సు చేశారని ఆ వార్తల సారాశం. ఆ వార్తలు నిజమో కాదో తెలియదు కానీ మన తెలుగు వాళ్ళే ఆ చిత్రానికి అనుకూలంగా కొందరు, ప్రతికూలంగా మరి కొందరు, మరే ముఖ్యవిషయం లేనట్టు, వ్యాఖ్యలు,వ్యాఖ్యానాలు చేస్తున్నారు. (రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన పన్నెండు బొమ్మల్లో నేను ఎందుకనో సదరు మూడు ఆర్లు సినిమా చూడలేదు)
తెలుగువాడి ఉనికిని నందమూరి తారకరామారావు ప్రపంచానికి చాటిచెప్పితే, తెలుగు సినిమాను విశ్వవ్యాప్తం చేసింది నిస్సందేహంగా దర్శకుడు రాజమౌళి అనే విషయం ఎవరైనా, కనీసం వారి మదిలోనైనా, అంగీకరిస్తారు.
ఏవేవో సినిమాలను (ముఖ్యంగా హాలీవుడ్ చిత్రాలు) కాపీగొట్టి సినిమాలు తీస్తాడని, ఇద్దరు పోరాట వీరులు కలిస్తే ఎలా ఉండేది అనే ఊహ ఆధారంగా తీసిన చిత్రం అని చెప్పినా, చరిత్రను వక్రీకరించి ఆర్.ఆర్.ఆర్.తీశాడనీ, పైన పేర్కొన్న దర్శకునిపై తెలుగువారే నిత్యమూ వేసే నింద!బాహుబలి చిత్రం మొదటి భాగంలో అతను చూపెట్టిన ఒక దృశ్యం అతనిపై విమర్శ చేయడానికి అవకాశం ఇచ్చిందని చెప్పాలి. (సుళ్ళు తిరుగుతూ ప్రవహిస్తున్న నీటిలోనుంచి పసి పాపడితో బయటకొచ్చిన స్త్రి చేయి దృశ్యమది)
సదరు దృశ్యాన్ని 1998 లో మార్క్ స్టీవెన్ జాన్సన్ దర్శకత్వంలో వచ్చిన హాలీవుడ్ హాస్య చిత్రం సైమన్ బిర్చ్ (Simon Birch) నుంచి యధాతధంగా కాపీ కొట్టినాడని విమర్శ ఉంది.
పై రెండు చిత్రాలకన్నా ఎంతో ముందు,అంటే 1972-73 లోనే, తన చిత్రాలతో “చందమామ” పత్రికను దశాబ్దాలపాటు ఉన్నతంగా నిలిపిన ప్రముఖ చిత్రకారుడు,మన తెలుగు వాడు, వ.పా. అనే వడ్డాది పాపయ్య గారు అలాంటి చిత్రాన్ని “వటపత్ర శాయికి వరహాల లాలి” పేరుతో వేశారు.(వ పా గారి బొమ్మ క్రింద జతచేస్తున్నాను)
మరి మార్క్ స్టీవెన్ జాన్సన్ మన వ.పా. గారి బొమ్మను ఎక్కడో చూసి స్ఫూర్తి పొంది తన చిత్రంలో కదిలేదృశ్యంగా చూపెట్టాడా? లేదా మనిషిని పోలిన మనుషులు ప్రపంచంలో ఏడుగురు ఉంటారన్నట్టు ఊహాశీలురలకు ఓకే రకం ఆలోచన వస్తే అలా సామ్యం కనిపిస్తుందా?
ప్రపంచ సినీవేత్తలు ఎందరో చెప్పినట్టు ఉన్న ఏడుకథల ఆధారంగానే ప్రపంచంలోని సినిమాలన్నీ తయారవుతున్నాఏమో!
అయినా కాపీ కొట్టడం కాదు… ఏకంగా వేరొకరి ప్రతిభను బహిరంగంగానే దోచుకొని తమపేరుతో దాన్ని ప్రపంచం అంతటా ప్రచారం చేసుకోవడమే కాదు ఆ ప్రతిభా పాటవాలు ప్రదర్శించిన వారిని కూడా ఔనేమో అని నమ్మించడంలో పాశ్చాత్యులు,ముఖ్యంగా బ్రిటిష్ వాళ్ళు,బాగా ఆరితేరిపోయారు.
ఇది కూడా చదవండి :
బర్త్ డే స్పెషల్ : మెగాస్టార్ కు పవన్ కల్యాణ్ ఎమోషనల్ గ్రీటింగ్స్
1852 లోనే మనవాడు బెంగాలీ సర్వేయరు,గణిత శాస్త్రవేత్త అయిన రాధానాధ్ సిగ్దర్ అప్పటికి “శిఖరం 15” అని పిలువబడుతున్న హిమాలయాలలోని ఎత్తైన శిఖరాన్ని అందుబాటులో ఉన్న అతితక్కువ పరికరాలతో లెక్కగట్టి దాని ఎత్తు ఖచ్చితంగా 8848 మీటర్లు అని తేలిస్తే, జీవితంలో ఒక్కసారి కూడా హిమాలయాల పాదాల చెంతకైనా వెళ్ళని “ఎవరెస్ట్” అనే వాడికి ఆ ఘనతను అంటగట్టి ఇప్పటికీ ప్రచారం చేసుకొంటున్నారు. జగతిలో ఎత్తైన శిఖరం పేరు “మౌంట్ ఎవరెస్ట్” అని!
1897 లో మరో బెంగాలీ జగదీశ్ చంద్రబోస్ రేడియో ను ప్రపంచంలో మొదటిసారి విజయవంతంగా ఆవిష్కరిస్తే ఇప్పటి బి.బి.సి.కి పూర్వ నామమైన “బ్రిటిష్ బ్రాడ్కాస్టింగ్ కంపెనీ” ని స్థాపించిన “మార్కొని” రేడియో పరిజ్ఞానాన్ని తస్కరించి 1902 జూన్
13న లండన్ రాయల్ సొసైటీ సహకారంతో రేడియోపై పేటెంట్ హక్కులు దక్కొంచుకొన్నాడు.(1997లో I EEE Journal జూన్ సంచికలో D.T.Emerson అనే పెద్దమనిషి వ్రాసిన వ్యాసం)
టైఫాయిడ్, పాండురోగం, బోదకాలు,స్ప్రూ,రక్తహీనత,క్షయ వంటి చాలా జబ్బులను రూపుమాపే అనేక మందులను, టెట్రాసైక్లోన్,హెట్రోజన్ వంటి ఔషధాలను కనుగొని మందుల పరిశోధనను అనూహ్యమైన మలుపుతిప్పిన గొప్ప పరిశోధకుడు మన యల్లాప్రగడసుబ్బారావు*కు నోబెల్ బహుమతి ఇవ్వడానికి చేతులు రాలేదుకానీ పై వాటిపైనే పరిశోధనలు చేసిన కనీసం ముగ్గురికి ఆ బహుమతి ఇచ్చి తమ నైజాన్ని చాటుకొన్నారు.
(Penetrate, Threaten and Steal) చొచ్చుకుపో, బెదిరించు, దోచుకో! ఈ పద్ధతిలోనే బ్రిటిష్ వలస పాలన సాగింది.
పైన పేర్కొన్న నలుగురు మహోన్నతవ్యక్తులే కాదు భారతీయులు ఎవరూ పేటెంట్ల కోసం ప్రాకులాడలేదు.కీర్తి కండూతి లేనివారు.
మరో ముఖ్య కారణం… మనవాళ్ళకి తెల్లతోలు లేకపోవడం.ఎందుకూ కొరగానివారు అనుకొనే హిందువులకు ఆ కీర్తి దక్కకుండా చేయాలనే వాళ్ల జాత్యహంకారం కూడా తోడయ్యింది.
మౌంట్ ఎవరెస్ట్ కాదు మౌంట్ సిగ్దర్ అని మన దేశ సహకారంతో 1971 లో స్వాతంత్ర్యం పొందిన బాంగ్లాదేశ్ Bangla Pidiya లోపొందుపరిచారు.నేపాల్ కూడా దాన్ని “సాగర్ మాత” అనే పేర్కొంటున్నది.
గతాన్ని వదిలేద్దాం! ప్రపంచంలో మనదేశ ప్రతిష్టను పెంచేలా ఇప్పుడున్న కేంద్ర ప్రభుత్వం ఇకనైనా పూనుకొని పై నిజాలను ప్రపంచానికి చాటిచెప్పేలా దేశంలోనిమేధావులందరూ ఏకతాటి పై నిలిచి గొంతుకలు విప్పాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
మానసిక బానిసత్వాన్ని వదిలేద్దాం
..గడ్డం దేవీప్రసాద్
8971830473
Discussion about this post