సంఘం, సమాజం అంటే మనమే. దేశమంటే మట్టికాదోయ్.. దేశమంటే మనుషులోయ్ అని అంటూ మన గురజాడ మహాకవి ఎప్పుడో చెప్పాడు. ఇంకో రకంగా చెప్పాలంటే.. సమాజాన్ని ఉద్ధరించాలని, సమాజాన్ని బాగు చేయాలని ప్రయత్నం చేయడానికి ముందు.. మనల్ని మనం బాగు చేసుకోవడం నేర్చుకోవాలి.
మనం ఇతరులతో మెలిగే పద్ధతుల్ని సక్రమమైన పద్ధతిలో తీర్చిదిద్దుకుంటే చాలు.. ఈ పని అందరూ చేయగలిగినప్పుడు ఆటోమేటిగ్గా మొత్తం సమాజం ఎంతో బాగుపడిపోతుంది. స్థూలంగా చెప్పాలంటే వ్యక్తి హితమే- సంఘహితం. ఆత్మోద్ధరణే సామాజికోద్ధరణ. మనం మంచి సంస్కారాలను అలవాటు చేసుకోవడమే.. సమాజాన్ని సంస్కరించడం అవుతుంది.
ఈ విషయాన్ని భర్తృహరి తన సుభాషితాల్లో అద్భుతమైన రీతిలో సెలవిస్తాడు. నలుగురితో మంచిగా మెలగడాన్ని ప్రతిఒక్కరూ అలవాటు చేసుుంటే చాలు.. సమాజం, లోకం మొత్తం హాయిగా సుఖంగా ఉండగలదని అంటాడు. ఆ శ్లోకాన్ని గమనిద్దాం.
దాక్షిణ్యం స్వజనే, దయా పరిజనే, సాఠ్యం సదా దుర్జనే
ప్రీతిః సాధుజనేనయోః నృపజనే, విద్వజ్జనేచార్జవం
శౌర్యం శతృజనే, క్షమా గురు జనే, నారీజనే ధృష్టతా
యే చైవం పురుషాః కలాసు కుశలాస్తేష్వేవ లోక స్థితిః
మన చుట్టూ ఉండే ప్రపంచంలోని మనుషుల్లో ఏయే రకాల వారితో ఏవిధంగా మెలగాలో తెలియజెప్పే శ్లోకం ఇది.
‘దాక్షిణ్యం స్వజనే’- దాక్షిణ్యం అంటే అభిమానం లేదా మొహమాటం. మనం సొంత వారితో అంటే బంధువులు, మిత్రులు, మన అనుకోగలిగే ఆప్తులతో అభిమానంగా ఉండాలి. కొంత మొహమాటంగా ఉండడం కూడా తప్పదు. అచ్చంగా మన ఇష్టం ప్రకారం కాకపోయినా వారికోసం కొన్ని పనులు చేయాల్సి వస్తుంది. అలాగే ‘దయా పరిజనే’ అంటే మన వద్ద పనచేసేవాళ్ల పట్ల దయతో ఉండాలి. మనవద్ద పనిచేసేవాళ్లు అంటే.. మనకంటె వారు బలహీనులు, మన మీద ఆధారపడిన వాళ్లు, వెనుకబడిన వాళ్లు. కనుక, ఇలాంటి వారిపట్ల మనకు దయ, సానుభూతి ఉండాలి.
చెడ్డవారి పట్ల కఠినంగా ఉండాలి. మొహమాటానికి పోకూడదు. అలాంటి మొహమాటం మరింత చేటు చేస్తుంది. అలాగే సాధుజనులు అంటే మంచివాళ్ల పట్ల ప్రేమగా ఉండాలి. మనం మంచివాళ్ల పట్ల ప్రేమగా, ప్రియంగా ఉండడం అలవాటు చేసుకుంటే.. మన ప్రేమను వారికి అనుభవంలోకి తెస్తే.. వారి తరహాలో మంచివాళ్లుగా ఉండేవాళ్ల సంఖ్య పెరుగుతుంది. సమాజం మొత్తం మంచిగా తయారవుతుంది.
నృపజనే విద్వజ్జనే చ ఆర్జవం అంటున్నాడు భర్తృహరి. రాజులు, పండితుల పట్ల రుజువర్తన కలిగి ఉండాలి. చక్కగా ప్రవర్తించాలి. రాజులు అంటే ఇవాళ్టి తరానికి పాలకులు, అధికారులు అనుకుందాం. వారితోపాటు మేధావుల వద్ద వెర్రి మొర్రి వేషాలు వేయకుండా చక్కటి ప్రవర్తన కలిగిఉండాలి. గురువుల పట్ల ఓర్పు ఉండాలి. ఒక్కో గురువుకు విద్య నేర్పడంలో ఒక్కొక్క శైలి ఉంటుంది. వారిని మనం వేగిరపెట్టకూడదు. ఓర్పుగా ఉంటూ వారినుంచి విద్యను సంగ్రహించడానికి ప్రయత్నించాలి.
స్త్రీల పట్ల దిట్టతనం ఉండాలి. దృఢత్వం ఉండాలి. ఇలాంటి విద్యల్లో అందరూ ఇలాంటి నైపుణ్యాలను కలిగిఉంటే.. అలాంటి వారి మీదనే సమాజం యొక్క స్థితిగతులు ఆధారపడి ఉంటాయి..
.. అని భర్తృహరి సుభాషితం చెబుతుంది.
ఇవి కూడా చదవండి:
Good Morning : తెలివైన, చెడ్డవాడితో స్నేహం చేయాలా? వద్దా?
ఫిరాయింపుకోసం గాల్లో ఎగురుతున్న టీడీపీ తుర్రుపిట్ట!
Pawan Trivikram వాహ్! సినీజీవులా? సాహితీమూర్తులా?
ఆన్లైన్ లో ప్రభుత్వం సినిమా టికెట్లు అమ్మితే.. దోపిడీ ఆగుతుందా?
ఇది నిజమే లోకస్థితి- సమాజగమనం అనేదానిని మనం ప్రత్యేకంగా, విడిగా చూడలేం. మనమే సమాజం అనుకుంటున్నప్పుడు.. భర్తృహరి చెప్పిన తరహాలో మనం ఏయే రకాల వ్యక్తులతో ఏయేరీతిగా మెలగుతున్నామో.. అలాంటి మన ప్రవర్తనే సమాజ స్థితిగతులను నిర్ణయిస్తుంది.
మనం సాధారణంగా ‘అందరూ బాగుండాలి.. ఆ అందరిలో నేనుండాలి’ అనే మాటను తరచుగా వింటూ ఉంటాం. ఇది నిజమే. మంచి మాటే! ఇది సుఖంగా ఉండడానికి సంబంధించిన మాట! అదే తరహాలో మనం ఇంకో సిద్ధాంతాన్ని కూడా మన ప్రతి ఒక్కరి యొక్క వ్యక్తిగత జీవితానికి నిర్దేశించుకోవాలి. ‘నేను మంచిగా ప్రవర్తించాలి.. సమాజం (అందరూ) నాలాగే ప్రవర్తించాలి’ అని అనుకోవాలి. ఇది ప్రవర్తనకు సంబంధించిన జీవనవేదం అవుతుంది. సత్సమాజాన్ని తీర్చిదిద్దుతుంది.
.

Discussion about this post