ఇసుకనుంచి నూనె తీయవచ్చు గానీ.. మూర్ఖుడిలో మార్పు తీసుకురాలేం అనే సంగతి మనకు చాలా బాగా తెలుసు. అయినా సరే.. ఎవరైనా సదుపదేశాలు, సలహాలు చెప్పడం మానుకుంటున్నారా? అందరూ బోలెడు సలహాలు చెబుతూనే ఉంటారు. ఆచరించే వారే కావాలి. కేవలం మాటలు సలహాలతో మార్పు రాదని తెలిసినప్పుడు.. మరి అందుకు తగిన తరుణోపాయం ఏమిటో స్ఫురించాలి.
ఇతరులనుంచి మనకు సలహాలు వచ్చినప్పుడు వాటిని మనం ఎంత మేర ఆచరిస్తున్నామో.. మనం సలహాలు చెబుతున్నప్పుడు ఇతరులు కూడా అంతే ఆచరిస్తారు. నూటికి తొంభయి శాతం ఒక చెవితో విన్నదానిని మరొక చెవితో విడిచిపెడుతుంటారు. మూర్ఖుల విషయంలో ఇది మరింత నిజం. మాట విన్నట్టే, మారినట్టే కనిపిస్తారు. చిటికెలో మళ్లీ తమ పూర్వ స్వభావాన్ని పుష్కలంగా అందిపుచ్చుకుంటారు.
ఇదే విషయాన్ని ఒక సుభాషితం కూడా, మనకు అర్థమయ్యే రీతిలో చిన్న ఉదాహరణతో ఇలా సరళంగా చెబుతుంది.
స్వభావో నోపదేశేన శకక్యతే కర్తృమన్యథా
సుతప్తమపి పానీయం పునర్గచ్ఛతి శీతతామ్
ఏ విధంగా అయితే నీటిని బాగా వేడిచేసినప్పటికీ.. తిరిగి అది చల్లగా మారిపోతుందో.. అదే విధంగా – ఉపదేశం చేసినంత మాత్రాన.. మంచి మాటలు చెప్పినంత మాత్రాన మూర్ఖులలో మార్పు తీసుకురావడం సాధ్యం కాదు. ..అనేది శ్లోకభావం.
మంచి మాటలు చెప్పడానికి మనకు చాలా మంది దొరుకుతూ ఉంటారు. అయితే వాటిని ఆచరించడానికి ఎందరు దొరుకుతారనేది మిలియన్ డాలర్ ప్రశ్న. పొద్దునలేస్తే వాట్సప్, ఇన్ స్టా సోషల్ మీడియాలలో సదుపదేశాలు వెల్లువగా వచ్చి పడుతూ ఉంటాయి. కొన్ని కోట్ల మంది వాటిని ప్రతినిత్యం చూస్తూ ఉంటారు. సదరు ఉపదేశాలలోని మర్మం మొత్తం తమ సొంత భావజాలమే అయినట్టుగా.. మళ్లీ అందరికీ ఫార్వర్డ్ చేస్తూ పంచిపెట్టేస్తూ ఉంటారు. ఈ మంచిమాటలను నిజంగా అందరూ ఆచరించడం నిజమైతే గనుక.. ప్రపంచంలో మూర్ఖులనే వాళ్లే ఉండరు.
ఈ శ్లోకభావాన్ని సరిగ్గా అన్వయించుకుంటే.. చాలా లోతుగా అర్థం ధ్వనిస్తుంది.
నీళ్లు తమ సహజమైన స్వభావంతో చల్లగానే ఉంటాయి. వాటిని వేడిచేస్తాం. వేడినీళ్లవుతాయి. అయితే కాసేపటికి అవి మళ్లీ చల్లగా అయిపోతాయి. మూర్ఖులతో కూడా అంతే కదా.. అని శ్లోకం చెబుతుంది. మన నిత్యవ్యవహారంలో బోధపడిన విషయాలతో మనం దీనిని అన్వయించుకుని మరోసారి చూడాలి.
నీటిని వేడిచేస్తాం. వాటిని అలాగే వదిలేస్తే.. తిరిగి చల్లారిపోతాయి. లేదా, అలా వేడిచేస్తూనే ఉంటే.. ఆవిరైపోతాయి. మూర్ఖులు కూడా అంతే. మంచి మాటలు చెబుతాం. సన్మార్గంలో పెట్టడానికి ప్రయత్నిస్తాం. మారినట్టే కనిపిస్తారు. వదిలేస్తే.. తిరిగి తమ సొంత దుర్మార్గపు అలవాట్లవైపు మళ్లుతారు. లేదా, అలా ఉపదేశాలు చెబుతూ చెబుతూ ఉంటే.. ఎందుకూ కొరగాకుండా పోతారు. మాటలను అసలు పట్టించుకోవడమే మానేస్తారు. ఇలాంటి విపరిణామాలు ఉంటాయి.
మరి దీనికి ఉపాయం ఎలాగ?
నీటిని మనం వేడిచేస్తాం.. అవి వేడిగా ఉండగానే వాటిని వినియోగంలోకి తీసుకురాగలిగినప్పుడు దాని వలన ఫలితం ఉంటుంది. నీళ్లు వేడిగా ఉండగానే అందులో బియ్యం వేస్తే అది ఉడికి ఆకలి తీర్చే అన్నం అవుతుంది. ఇదే పద్ధతిని మూర్ఖులను మార్చే విషయంలోనూ అనుసరించాలి. సదుపదేశాలతో మాటలతో మారినట్టుగా వారు కనిపిస్తున్న సమయంలోనే వారిని వినియోగంలోకి తీసుకురావాలి. వారిని కార్యసాధనలో భాగస్వాముల్ని చేయాలి. ఇలా చేయడం వలన అసలు ప్రయోజనం సిద్ధిస్తుంది. తమలోని మార్పు వలన కలిగే ఫలితం ఒకసారి స్వానుభవంలోకి వస్తే.. వారిలో మార్పు స్థిరంగా ఉండే అవకాశం ఉంటుంది.
ఈ సుభాషితం మనకు ఆచరణీయమైన విషయాన్ని సగమే చెప్పి ఉండవచ్చు. మాటలతో మార్చడం సాధ్యం కాదని, మూర్ఖులు తిరిగి పూర్వస్వభావానికి మరలిపోతారని చెప్పి ఉండవచ్చు. కానీ.. ఇంకో అడుగు ముందుకు వేసి ఆలోచిస్తే.. మూర్ఖులను మారే ఆలోచన పుట్టినప్పుడే.. మారడం వలన కలిగే ఫలితాన్ని వారి అనుభవంలోకి తీసుకురాగలిగితే.. కేవలం మాటలతో ఆగకుండా కార్యశీలతను అలవాటు చేస్తే.. అసలైన ఫలితం కలుగుతుంది.
శుభోదయం.
EXCLUSIVE ARTICLES
సీనియర్ జర్నలిస్టు గోవిందరాజు చక్రధర్ వ్యాసాల ప్రత్యేకపేజీ కోసం క్లిక్ చేయండి
‘సుభాషితం’ సంస్కృతశ్లోకాలకు భావవివరణల వ్యాసాల కోసం ఈ పేజీ క్లిక్ చేయండి
సీనియర్ జర్నలిస్టు బీరక రవి ప్రత్యేక వ్యాసాల కోసం ఈ పేజీ క్లిక్ చేయండి
సీనియర్ జర్నలిస్టు డాక్టర్ ఎస్ రాము ప్రత్యేక వ్యాసాల కోసం ఈ పేజీ క్లిక్ చేయండి
దేవీప్రసాద్ ఒబ్బు లోపలిమాట వ్యాసాల కోసం ఈ పేజీ క్లిక్ చేయండి
సంపాదకుడు సురేష్ పిళ్లె వ్యాసాల కోసం ఈ పేజీ క్లిక్ చేయండి
.

Discussion about this post