అలంకారం.. అంటే కేవలం నగలు, భూషణాలు, ఖరీదైన దుస్తులు మాత్రమే మనకు అదనపు శోభను, విలువను జతచేస్తాయి అనే అర్థం కాదు. గుణాలు, లక్షణాలు, అలవాట్లు కూడా మనకు ఆ తరహాలో అదనపు అలంకరణగా నిలుస్తాయి. నిజానికి అవే మనకు నిత్యమైన నిజమైన అలంకారాలు అని చెప్పాలి.
సాధారణంగా పుస్తకం హస్తభూషణమ్ అంటారు. సాధారణంగా చేతికి అలంకారంగా ఉండడానికి విలువైన రాళ్లు పొదిగిన బంగారు ఉంగరాలు, ఆభరణాలు అనేకం వాడుతూ ఉంటారు. కానీ.. చేతికి నిజమైన అలంకారం పుస్తకమే అని ఒక కవి అభిప్రాయపడ్డాడు.
ఎలాంటి ఆభరణాలు, నగలు ధరించి ఉన్నారు అనేదానిని గమనించి ఒక వ్యక్తి యొక్క ఆర్థిక స్థాయిని గుర్తించడం ఇదివరకటి రోజుల్లో ఉండేది. ఇప్పటికి కూడా ఉంటుంది. కేవలం అందుకోసమే.. అత్యంత ఆడంబరంగా ఉండే చాలా నగలను ధరించడానికి ఎక్కువమంది ముచ్చటపడుతుంటారు. ఆర్థికస్థాయికి అవి చిహ్నాలు కావొచ్చు గానీ.. మనిషిలోని బుద్ధికి తెలివితేటలకు చిహ్నంగా నిలిచే అలంకారం ఏది? అందుకే పుస్తకం హస్తభూషణమ్ అన్నారు. తెలివితేటల స్థాయికి కొలబద్ధగా నిలిచే భూషణం అంటే ఆభరణం.. పుస్తకం మాత్రమే అనేది ఆ కవి ఉద్దేశం. ఈ రోజుల్లో అయితే.. ఏ కుర్రవాడిని అడిగినా.. మొబైల్ ఫోన్ నిజమైన హస్తభూషణం అని అంటారేమో. ఫీచర్ ఫోన్ వాడుతున్నామా? ఐఫోన్ 12 వాడుతున్నామా అనేదానిని బట్టి మన ఆర్థిక స్థాయిని, ఆసక్తులను కూడా తూకం వేయడానికి అవకాశం ఉంటుంది కాబట్టి.
అయితే ఎలాంటి లక్షణం ఎవరికి శోభనిస్తుంది? ఏది ఎవరికి నిజమైన అలంకారంగా నిలుస్తుంది? అనే విషయంలో ఓ మంచి సుభాషితం ఉంది.
అశ్వస్య భూషణం వేగో మత్తం స్యాద్ గజభూషణమ్
చాతుర్యమ్ భూషణం నార్యా ఉద్యోగో నర భూషణమ్
గుర్రానికి వేగమే ఆభరణం. మందగమనమే ఏనుగుకు ఆభరణం. చతురత, తెలివితేటలే మహిళకు ఆభరణం. అలాగే ఉద్యోగం- అంటే ఏదైనా పని చేయడం, కార్యశీలతతో ఉండడం పురుష లక్షణం. మనిషి లక్షణం. .. అనేది శ్లోకభావం.
మనం ఆభరణాలు అనుకునేవి ఏవీ నిజంగా ఆభరణాలు కానే కాదు. పశువులకు కూడా మనం ఎన్నో అలంకారాలు చేస్తాం. కానీ.. దాని ప్రాథమిక లక్షణాన్ని విస్మరించినట్లయితే.. ఎన్ని అలంకారాలు చేసినా.. అది దండగే. ఉదాహరణకు ఒక గుర్రాన్ని ఎంత గొప్పగా అలంకరించి.. అందమైన జీను తొడిగి, తురాయిలు అలంకరించి.. శోభాయమానంగా తీర్చిదిద్దినా.. అది వేగంగా పరుగెత్తలేకపోతే.. అది మంచి, గొప్ప గుర్రం అని ఎలా అనిపించుకుంటుంది? ఎవ్వరైనా సరే దాన్ని దండగ అని తిడతారు.
అలాగే ఏనుగుకు కూడా మందగమనంతో నిదానంగా నడుచుకుంటూ వెళ్లడమే అలంకారం. అదే దానికి భూషణం. మహిళలకు చతురత, తెలివితేటలు ఆభరణాలుగా ఉండాలని చెప్పిన శతకకారుడు, ఏదో ఒక పనిలో, ఉద్యోగంలో ఉండడం అనేది మనిషి లక్షణంగా వర్ణించాడు.
‘నర’ అనే పదానికి కేవలం మగవాడు అనేది మాత్రమే అర్థం కాదు. మనుషులందరినీ మనం నరులనే వ్యవహరిస్తాం. ఆ రకంగా చూసినప్పుడు.. మనుషులందరికీ ఏదో ఒక పని ఉండాలని ఆశించినప్పటికీ.. ప్రత్యేకంగా ఆడవాళ్లకు మాత్రం.. చతురత, తెలివితేటలు ఆభరణంగా ఉండాలని చెప్పడంలో ఓ అంతరార్థం ఉంది.
దంపతుల్లో- భర్త కేవలం సంపాదించే పనిలో మాత్రమే ఉంటారని (ఉండాలని), భార్య- ఆ ధనాన్ని ఖర్చు పెట్టడం, గృహనిర్వహణ, పొదుపులు, సంపదను వృద్ధి చేయడం వంటి ఇతర అంశాల అన్నింటిని పర్యవేక్షిస్తూ ఉండాలని చెబుతూ ఉంటారు. ఇలాంటి ఏర్పాటు గురించి సనాతనంగా ధర్మం చెబుతున్న దృష్టాంతాలు అనేకం ఉన్నాయి. సరైన గృహనిర్వహణ, దాంపత్య జీవనం గురించి.. భారతంలో ద్రౌపది- సత్యభామకు చెప్పే సూత్రాలలో కూడా ఇలాంటి ఏర్పాటు ఉంటుంది. అలాంటి సంపద, గృహనిర్వహణకు సంబంధించిన మేనేజ్‌మెంట్ బాధ్యతలన్నీ మహిళ చూసుకోవాలి గనునే.. ఆమెకు చతురత, తెలివితేటలు మౌలికలక్షణంగా ఉండాలనేది అంతరార్థం. అదే ఏదో ఒక పనిలో ఉండడం అనేది సమస్త మానవజాతి లక్షణంగా ఉండాలనేది సుభాషితం చెప్పే సిద్ధాంతం.
ఇవి అసలైన ఆభరణాలు. వీటిని విస్మరించి.. చాలా చిన్న చిన్న వాటిని మనం ఆభరణాలుగా భావిస్తుంటాం. ఈ స్పష్టతను మనం తెలుసుకోగలిగితే.. చాలా బాగుంటుంది.
శుభోదయం.
.

Discussion about this post