నేను అలనాడెప్పుడో జువాలజీ ఆప్షనల్ సబ్జెక్టుతో తెలుగు మీడియంలో బీఎస్సీ వెలగబెట్టాను., వర్టిబ్రేట్స్, ఇన్‌వర్టిబ్రేట్స్‌కు తొలిసారిగా పండితులు కూర్చుని సమాలోచనలు జరిపి రెండు పదాలను ఖాయం చేశారు. ఆ పదాలు- సకశేరుకాలు, అకశేరుకాలు. వీటితోపాటు రెప్టయిల్స్‌కు సరీసృపాలు అనే పదం కూడా తొలిసారి పరిచయమైన కాలమది.
నన్నడిగితే నిఘంటువుల నుంచి, పాఠ్యపుస్తకాల నుంచి, ఆ మాటకొస్తే వ్యవహారం నుంచి వెన్నెముక గల జీవులను పూర్తిగా తొలగించాలని విన్నవించుకుంటున్నాను.
ఎందెందు వెదికినా ఇప్పుడు వెన్నెముక గలిగిన మానవులే కన్పించడం లేదు. మనుషుల్లో వెన్నెముక ఉందా? లేక పరిణామ క్రమంలో అంతరించిపోయిందా? అనే అనుమానాలు పొడసూపుతున్నాయి. పొడసూపటమే కాదు నిర్ధారణ కూడా అవుతున్నది.
వెన్నెముక గల మనిషి నిండుగా నిటారుగా నిలబడిన మనిషి, ఊపిరితిత్తుల నిండా గాలిని పీల్చి రొమ్ములు విరుచుకుని, ఛాతీ పెంచుకుని ఆత్మ విశ్వాసంతో, వ్యక్తిత్వంతో, నిజాయితీతో, కళ్లల్లో మెరుపులతో, బతుకు మీద వల్లమాలిన ప్రేమతో, సొంత శక్తి మీద అపారమైన నమ్మికతో తిరుగాడే మనిషిని మీరెప్పుడైనా చూశారా? మీకెప్పుడైనా తారసపడ్డాడా?
కొద్దిగా వంగి నడవమంటే పారాడడానికి పరుగులు తీస్తున్నారు. గీతాకృష్ణుడివి కావయ్యా బాబూ! అంటే నేనింకా చిన్నికృష్ణుడిలా పారాడుతూనే ఉంటానని సెలవిస్తున్నారు. పోనీ చిన్ని కృష్ణుడిగా పారాడితే పారాడావు గానీ చిలిపి చేష్టలేవీ అంటే- అవి మాత్రం అడక్కు, ప్రభువులకు కోపం వస్తుంది అంటావేం?
రాజకీయం మొదలుకుని సమస్త జీవనరంగాల్లో ఒకప్పుడు వేయి వోల్టుల బల్బుల్లా వెలిగిపోతూ ధ్వజస్తంభాల్లా, వీధిలైట్లలా మేరునగధీర వ్యక్తిత్వాలతో మనుషులు, కాదు కాదు మహనీయులు, మహా దొడ్డ మనుషులు కన్పించేవారు. నమ్మిన విషయాల్లో ఎన్నడూ రాజీపడేవారు కాదు. కాసులకోసం కక్కుర్తి పనులకు తెగపడేవారు కాదు. కష్టాలు ఎదురైనా కుంగేవారు కాదు. బతుకు పయనంలో రాజీలేని పోరాటం చేసేవారు.
పిదపకాలమనుకోవాలో మరేమని చెప్పుకోవాలో తెలీటం లేదు గానీ.. ఆరడుగుల ఆజానుబాహులు దుర్భిణీ వేసి వెతికినా ఎక్కడా కనిపించడం లేదు. అదేదో రాజ్యం ఉండేదట పూర్వకాలంలో. మిరపచెట్లకు నిచ్చెనలేసుకుని ఎక్కేవారట. అంటే అంతటి మరుగుజ్జులు ఉండేవారు.
ఇప్పుడు ఆ రంగం ఈ రంగం అని తరచి చూడనక్కరలేదు. ఏ రంగంలో చూసినా మరుగుజ్జులే. ఆజానుబాహులు అంతరించిన జాతే.
EXCLUSIVE ARTICLES
సీనియర్ జర్నలిస్టు గోవిందరాజు చక్రధర్ వ్యాసాల ప్రత్యేకపేజీ కోసం క్లిక్ చేయండి
‘సుభాషితం’ సంస్కృతశ్లోకాలకు భావవివరణల వ్యాసాల కోసం ఈ పేజీ క్లిక్ చేయండి
సీనియర్ జర్నలిస్టు బీరక రవి ప్రత్యేక వ్యాసాల కోసం ఈ పేజీ క్లిక్ చేయండి
సీనియర్ జర్నలిస్టు డాక్టర్ ఎస్ రాము ప్రత్యేక వ్యాసాల కోసం ఈ పేజీ క్లిక్ చేయండి
దేవీప్రసాద్ ఒబ్బు లోపలిమాట వ్యాసాల కోసం ఈ పేజీ క్లిక్ చేయండి
సంపాదకుడు సురేష్ పిళ్లె వ్యాసాల కోసం ఈ పేజీ క్లిక్ చేయండి
మంత్రులను తీసుకోండి. ప్రభువును ప్రసన్నం చేసుకోవడానికి ఎంతకైనా దిగజారటానికి సిద్ధపడుతున్నారు.
ఒక్క రాజకీయుల్నే ఎందుకనాలి? బడుల్లో, గుడుల్లో, పత్రికల్లో, సంస్థల్లో అన్నింటా పరవశంతో పారాడే వారే. అలా పారాడుతూ మోకాలిచిప్పలు దోక్కుపోతున్నాయనే వాస్తవాన్ని గుర్తించరు.
అంతా అయిపోయాక, పాడుకాలం అంతా పూర్తయ్యాక వెనుదిరిగి చూసుకుంటే కరెన్సీ నోట్లయితే గుట్టలుగా పోగుపడినా- అది తింటే షుగరు, ఇది తింటే బీపీ అంటూ కడుపారా తినటానికి హర్డిల్స్ అనేకం ముందుకొస్తాయి.
వేలకోట్లకు పడగలెత్తినా, వేల ఎకరాలు సంపాదించినా పోయాక కావాల్సింది ఆరడుగుల నేల అనే ఇంగితం మాత్రం ఉండదు.
ఆరడుగులు కూడా ఎందుకు? ఈ మరుగుజ్జులకు మూడు అంగుళాల నేల సరిపోదూ!
దేనికీ అర్రులు చాచకుండా, అడ్డదారులు తొక్కకుండా, మనసుకు నచ్చినట్లు జీవించగలిగే రోజులు ఎప్పుడొస్తాయో!
వ్యక్తిత్వాలను విలువల కాగడాలతో వెలిగించుకునే రోజులు తారసపడతాయా?
ఏమిటో! ఇవన్నీ ఈ కాలానికి పనికిరాని కబుర్లుగా, చేతకానివాడి ప్రేలాపనల్లా అన్పిస్తున్నాయా?
సరే! అలాగే కానివ్వండి.
పారాడుతూనే ఉండండి.
వెన్నెముక ఎటూ కప్ బోర్డులో భద్రంగా పెట్టి తాళం వేసేశారుగా.
ఆ తాళం చెవికూడా ఎక్కడో పడిపోయింది. ఇప్పుడు వెదకడం వృథా.
..డాక్టర్ గోవిందరాజు చక్రధర్

.

Discussion about this post