తెలిసిన ఒక జర్నలిస్టు మిత్రుడున్నారు. ఆయన ఒక పత్రికలో సంపాదకీయ రచయిత. చాలా ఏళ్లుగా సంపాదకీయాలు రాసే పనికే అంకితమయ్యారు. పత్రిక చదివినా, టీవీ చూసినా, ప్రపంచంలో జరుగుతున్న సమస్త విషయాలనూ ఎడిటోరియల్ కోణంలోనే చూస్తారు. ఏ సంఘటన జరిగినా దాన్ని ఎడిటోరియల్‌గా ఎలా రాయవచ్చు అనే పరిధిలోకి కుదించుకుని చూస్తారు.
ఈ ధోరణిని, మనస్తత్వాన్ని కేవలం జర్నలిస్టులకే పరిమితం చేసి చూడనక్కరలేదు. సమస్త వృత్తుల వారికీ, ఆమాటకొస్తే ఏపనీ చేయకుండా రికామీగా తిరిగేవారికి కూడా ఈ సూత్రం వర్తిస్తుంది.
సంపాదకీయ రచయిత స్థానంలో కవి ఉంటే సమాజంలో జరిగే విషయాలను కవిత్వం ఫ్రేమ్‌లోకి ఎలా తేవాలో మధనపడుతుంటాడు. అప్పుడే తోటనుంచి కోసి తెచ్చిన కూరగాయలు కంటపడితే పాకశాస్త్ర నిపుణుడికో, ఇల్లాలికో ఆ కూరను ఎన్ని రకాలుగా వండి రుచులకు రుచి నేర్పించవచ్చో ఆలోచిస్తారు.
ఏళ్లతరబడి ఒకే పనిలోనే మునిగి తేలుతుండేవారికి ఆపని చేయడంలో బోల్డంత ఒడుపులూ, సులువులూ తెలుస్తాయి. పదిమంది కుటుంబ సభ్యులకు ఏళ్ల తరబడి వంటలు వండి వార్చిన గ్రాండ్ మా చేతిలోకి తీసుకునే ఉప్పూ కారాలు గ్రాముల లెక్కన కుదిరి శభాష్ అనిపిస్తాయి. అదేపని కొత్తకోడలికి బ్రహ్మప్రళయం అవుతుంది. పక్కనే ఎన్ని వంటల పుస్తకాలున్నా పాకం కుదరదు.
ఇలా గాడిలోపడి నల్లేరు మీద నడకలా సాగించే ప్రయాణాలు ఒక్కోసారి బాట తప్పుతాయి. సంపాదకీయ రచయిత వార్త రాయాల్సివస్తే కాసేపు పెన్ను ముందుకు సాగదు. అయితే ఇదే సార్వత్రికం కాదు. మినహాయింపులు చాలా ఉంటాయి. ఏపని చేస్తుంటే ఆ పనికి తగ్గట్లు ఒడుపుగా చేసే బహుముఖ ప్రజ్ఞావంతులూ ఉంటారు.
ఇలాంటి వారు ఏ పనిలో ఉంటే అందులోనే పూర్తిగా లీనమవుతారు. ఇలా ట్యూన్ కావటం ఆషామాషీ కాదు. దానికి ప్రతి పనిపట్లా శ్రధ్ధ, ఆకళింపు వగైరా లక్షణాలు అనేకం జతకలవాలి.
నేనా? ఈపని చేయడమా? అనే అహంకారాన్ని దరిచేరనివ్వని మనో వైశాల్యమూ అవసరమే.
ఇంతకీ మీరు ఏపనికైనా సులువుగా ట్యూన్ కాగలుగుతున్నారా?
– డాక్టర్ గోవిందరాజు చక్రధర్

.

Discussion about this post