పేరు చెప్పడం బావుండదు. మీ ఊహకే వదిలేస్తున్నాను. ఆయనేమీ రిపోర్టర్ కాదు. సెలబ్రిటీ కాదు. అయినా ఉదయం లేవగానే హైదరాబాద్ నగరంలో ఏ హాలులో ఎన్ని గంటలకు ఏ ప్రోగ్రామ్ ఉందో తెలుసుకుని నోట్ చేసుకుంటాడు. దానికోరూట్ మ్యాప్ గీసుకుని ఇక ఊరిమీద పడతాడు.
వేషధారణ చెప్పక్కర్లేదు. నుదుట అలంకరణల మాట ప్రత్యేకంగా అనుకోవలసిన పనిలేదు. ప్రత్యేక శిరోజాలు సరేసరి.
ముఖమంతా గాంభీర్యం నింపుకుని ఒక్కో సమావేశ మందిరం తలుపు తడతాడు. ఆ సభలో ముందు వరసలోవెళ్లి కూచుంటాడు. నిర్వాహకులు ఆయన రాకను గమనించి వేదిక మీదకు ఆహ్వానం పలుకుతారు.
వేదిక మీద ఆయన గారు చేసే పనేమీ ఉండదు. చేసే ప్రసంగమూ ఉండదు. ఇచ్చే దివ్య సందేశమూ ఏమీ ఉండదు. కానీ చాలా విద్యలు తెలుసు. ప్రెస్ ఫోటోగ్రాఫర్లు, వీడియో గ్రాఫర్ల దృష్టిలో ఎలా పడాలో తెలుసు. గుంపులో ఎక్కడ నిలబడితే బాగా కనబడతామో తెలుసు. ఎలాంటి రంగుల వస్త్రాలతో ఫోటోలలో కొట్టొచ్చినట్టు కనిపిస్తామో తెలుసు!
కొన్ని సభల్లో ముందు వరసలో కూచున్నా వేదిక మీదకు పిలవరు. పరిస్థితిని గమనించుకుని ఇక ఈ సభలో సమయం వృథా చేసుకోవడం అనవసరమనే జ్ఞానం కలిగి అక్కడినుంచి జారుకుంటాడు.
ఆయన గారి ఈ దినచర్య సభలూ సమావేశాలకే పరిమితం కాలేదు. ప్రముఖుల ఇంట్లో పెళ్లి వేడుకలోనూ దర్శనమిస్తాడు. ఆహ్వానం అందుకునే వచ్చాడా? అని అడిగితే సమాధానం అవుననో కాదనో చెప్పడం కష్టం.
‘మిమ్మల్ని ఎవరు పిలిచారు? ఎందుకు వచ్చారు?’ అని నిలదీసి అడిగేవారు ఎవరూ ఉండరు.
పెళ్లిళ్లకే ఆయన పర్యటనలు పరిమితం కావు. చావు ఇళ్లకూ హాజరు తప్పనిసరి. ఏ మంత్రిగారో, ముఖ్యమంత్రి గారో పుష్పగుచ్ఛం ఉంచుతుంటే ఆ పక్కనే ఆయన ఉంటాడు.
మొన్నా మధ్య దాకా సభలో ఫలానా వారు కూడా పాల్గొన్నారని రాస్తూ ఆ పేర్ల సరసన ఆయన పేరూ రాస్తుండేవారు విలేకరులు.
అలా రాయటం కూడా అనవసరమనే జ్ఞానబోధ విలేకరులకు కలిగినట్లుంది. వార్తల్లోనూ ఫోటో రైటప్పుల్లోనూ పేరు కన్పించడం లేదు.
‘‘ఏ సభకు పడితే ఆ సభకు వెళ్లాలంటే భయంగా ఉంది. మన పక్కనే వేదిక మీద ఆయనా నిల్చుంటే మన పరువేం గాను!’’ అని ఓ ప్రముఖుడి కామెంట్.
ఇలా పిలవని పేరంటానికి వెళ్లినట్లు, ఎవరూ పిలవకుండానే సభలూ సమావేశాలకు శుభాశుభాకార్యాలకు వెళ్లి ఆయన గారు సాధించేమిటి? బహుశ పబ్లిసిటీ పిచ్చి పీక్స్ లో ఉండి ఉండటం కావచ్చు. పదుగురి కంట్లో పడుతూ ఉంటే చలామణిలో ఉంటామని కావచ్చు.
ఇంతకంటె చేయదగ్గ పని వేరే ఏమీ ఉండకపోవడమూ కావచ్చు. అసలు కారణాలేమిటో ఆ మహానుభావుడికే తెలియాలి. లేదా ఆయనకూ తెలియకపోయి ఉండాలి. కానీ అలా పట్టువదలని విక్రమార్కుడిలా రోజూ బోలెడంత ఎక్సర్‌సైజ్ చేసి శ్రమపడీ, రవాణా ఖర్చు పెట్టుకుని ఊరిమీద పడి ఊరేగడానికి చాలా గట్స్ కావాలి.
ఎవరేమనుకుంటే నాకేమిటి? అనే తెగువ కావాలి. పట్టించుకున్నా పట్టించుకోకున్నా సమభావంతో చూసే హృదయ వైశాల్యం కావాలి. మనసునూ మెదడునూ కోల్డ్ స్టోరేజీలో పెట్టి తిరగగల తెంపరితనం కావాలి. జాతకాలు చెప్తామంటూ తిరిగే కొందరి దగ్గర అద్భుతమైన ఫోటో ఆల్బమ్‌లు ఉంటాయి. దేశవిదేశీ ప్రముఖులందరితో కలిసి తీయించుకున్న ఫోటోలు ఆ ఆల్బమ్‌లలో నిండి ఉంటాయి. అలనాటి నెహ్రూ నుంచి నేటి ఆయన మునిమనుమడు రాహుల్ దాకా ఆ ఆల్బమ్‌లో లేని ఫోటో ఉండదు.
అరుదైన అపురూప చిత్రాలు కావలసిన జర్నలిస్టులు వారి ఆల్బమ్ లనుంచి వాటిని సేకరించుకోవచ్చు. తన జాతకాలను ఆ ప్రముఖులంతా చెప్పించుకున్నారు కనుక నువ్వేమీ శంకించే పనిలేదని నమ్మకం కలిగించటానికి ఆల్బమ్ ఒక మార్కెటింగ్ సాధనం కావచ్చు.
మరికొందరు ఉంటారు. ఎక్కడికి వెళ్లినా ప్రముఖులతో కలిసి ఫోటోలు తీయించుకోవడమే జీవిత ధ్యేయంగా పెట్టుకుంటారు. అవతలి వ్యక్తి స్థాయిని బట్టి ఆ ఫోటోను పెద్దది చేసి డ్రాయింగ్ రూమ్ లో అలంకరించుకుంటూ ఉంటారు.
ఎవరి పిచ్చి వారి కానందం.
పిలవని సభల చుట్టూ తిరిగే ఆ పెద్దమనిషిని చూసి కాస్తంత జాలి పడండి. ఆ పరిస్థితి మరెవరికీ రాకూడదని ఆశించండి.
..డాక్టర్ గోవిందరాజు చక్రధర్
Discussion about this post