‘ఒరేయ్! నీకు బాచిగాడు గుర్తున్నాడా?’ ఉదయాన్నే మిత్రుడు ఫోను చేసి అడిగాడు.
‘‘వాడా! గుర్తులేకేం? చీమిడి ముక్కు బాచిగాడనే వాళ్లం. నిక్కరుకు బొత్తాలు కూడా పెట్టుకోకుండా, చింపిరి జుట్టుతో క్లాసుకు వచ్చేవాడు.’’
‘‘బాగానే గుర్తుందిరా నీకు. ఆ బాచిగాడు ఇప్పుడు అమెరికాలో పెద్ద సైంటిస్టు అయ్యాడు.. అక్కడే సెటిలయ్యి అమెరికన్ లేడీని పెళ్లి చేసుకున్నాడు. రేపో మాపో బైడెన్‌తో డిన్నర్ మీటింగ్ కూడా ఉందట.’’
‘‘చీమిడి ముక్కు బాచిగాడు, సారీ భాస్కర్ గారు అంతపెద్ద వాడయ్యాడా! ఏమో అనుకున్నాం, మన బ్యాచ్‌మేట్లలో వాడే అదృష్టవంతుడు’’
ఇలా మాట్లాడి ఫోను పెట్టెయ్యగానే స్కూల్‌మేట్స్ వాట్సాప్ గ్రూప్‌లో పెద్ద చర్చోపచర్చలు.
చిన్ననాటి మిత్రుడైనంత మాత్రాన అంత చిన్నచూపుతో మాట్లాడడం ఏమీ బాగాలేదు అని ఒకరి కామెంట్.
భాస్కర్ ఎదుగుదలను చూసి ఓర్వలేకే అలా మాట్లాడాడు- మరొకరి భాష్యం.
భాస్కర్ అమెరికన్‌ను పెళ్లి చేసుకోవడమే అక్కసుకు అసలు కారణం- కోడిగుడ్డుకు ఈకలు లాగే పనిలో మరొకరు.
ఇలా కామెంట్ల శరపరంపరకు అంతే ఉండదు.
‘‘మహాప్రభో! నాకెలాంటి దురుద్దేశాలు ఎవరిమీదా లేవు. ఏదో కాజువల్‌గా గుర్తు చేసుకోవటానికి అలా అన్నానంతే. నన్ను నా క్లాస్‌మేట్స్ అందరూ క్షమించండి. నేను ఈ గ్రూప్ నుంచి ఈ క్షణమే తప్పుకుంటున్నాను.’’
= =
పై కల్పిత సంఘటన అతిశయోక్తిగా అనిపించవచ్చేమో గానీ.. ఇప్పుడు చాలామంది అనుభవంలోకి వచ్చేసిన చేదు వాస్తవమే అది.
మీరు అవతలి వ్యక్తితో ఫోను మాట్లాడుతుంటే అతడు /ఆమెతో మాత్రమే వ్యక్తిగతంగా మాట్లాడుతున్నానని మీరు అనుకోవచ్చు. భ్రమించవచ్చు.
కానీ అవతలి వ్యక్తి అలా అనుకోకపోవచ్చు. ఆ సంభాషణను మీకు చెప్పకుండానే రికార్డు చేయవచ్చు. మీ మాటలను సందర్భ శుద్ధి లేకుండా ఫేస్ బుక్ లోనో, మరింకేదైనా సోషల్ మీడియా గ్రూప్ లోనో పోస్ట్ చేసి బహిరంగపరచవచ్చు.
మీరు ఒక సందర్భంలో వాడిన మాటే దారి తప్పి శరమై, విషమై మీ గుండెల్లో లోతుగా దిగుతుంది.
కనుక పాపులర్ రజనీకాంత్ డైలాగ్‌లా- మీరు ఒకరితో మాట్లాడితే వందమందితో మాట్లాడుతున్నట్లు గుర్తుంచుకోండి.
స్మార్ట్ ఫోన్ల పాడు కాలంలో వ్యక్తిగతానికీ సామాజికానికి సరిహద్దులు చెరిగిపోతున్నాయి. మీ మాటలను షేర్ చేయటమే కాదు, మీకు చెప్పకుండా స్పీకర్‌ను ఆన్ చేసి అప్పటికప్పుడు ప్రత్యక్ష ప్రసారం చేయవచ్చు.
ఫోనులో ఎవరితో మాట్లాడితే ఏ రకమైన కొత్త చిక్కులు వస్తాయో అంతుచిక్కక తలబొప్పి కట్టిపోతోంది.
ఈ మధ్య కాలంలో సున్నితత్వాలు మరీ కరువైపోతున్నాయి. మీతో మాట్లాడుతూ మీకు చెప్పకుండా ఫోటోలు వీడియోలు తీస్తుంటారు. కాజువల్ మాటలు కూడా ఒక్కోసారి రూటుమారితే పెద్ద చిక్కే.
ఈ తలనొప్పులకు తోడు కొందరు ఔత్సాహికులకు తెల్లారిలేచిన దగ్గర్నుంచీ ప్రతిక్షణం వారి జీవితంలోని ప్రతి సంఘటనా పదిమందితో పంచుకోవాల్సిన మహత్తర విశేషంగా తోస్తోంది.
మా దొడ్లో పూచిన పువ్వు, ఈ పూట మేం తినబోయే కర్రీ, ఇదిగో రోటిపచ్చడి, అదిగో ఊరగాయ.. ఇవన్నీ పలుభంగిమల ఫోటోలతో కనువిందు చేస్తుంటాయి.
వయసుతో నిమిత్తం లేకుండా స్మార్ట్ ఫోనే లోకంగా బతికేస్తున్నారు ఇప్పుడు.
చీమ చిటుక్కుమంటే ఫోను తీసి చూసుకుంటున్నారు. పిచ్చివాళ్ల స్వర్గంలో తమలో తాము నవ్వుకుంటారు. ముఖంలో రకరకాల భావోద్వేగాలు పలికిస్తుంటారు. వాటన్నింటికీ కారణం తెలీక ఆశ్చర్యపోతుంటారు ఎదుటివారు.
చాటింగ్‌లో ఎదుటివారి జోకు కారణంగా ముఖం విప్పారవచ్చు, నెగటివ్ కామెంట్‌తో ముఖం మాడిపోనూ వచ్చు. మరింకేదో వీడియో నవరస నటనకు కారణమై ఉండవచ్చు.
ఈ కాలం వారు ఎవరూ సగర్వంగా తలెత్తుకుని బతకటం లేదు. ఉష్ట్రపక్షిలా స్మార్ట్‌ఫోన్‌లో తలదూర్చేసి జీవితానికి దూరంగా జీవించేస్తున్నారు.
ఇది కూడా ఒక రకమైన మత్తే. పక్కవారెవరో పట్టించుకోనివ్వని మత్తు. ప్రాపంచిక విషయాలు, వాస్తవ స్థితిగతులు తెలియనివ్వని మత్తు. బంధుత్వాలను, బాంధవ్యాలను దూరం చేసే మత్తు. తనను తాను ఒంటరిని చేస్తున్న మత్తు.
‘నో టుబాకో డే’ మాదిరి వారానికో రోజు ‘నో ఫోన్ డే’ ను ప్రపంచ దేశాలన్నీ ప్రకటించి స్ట్రిక్ట్‌గా దాన్ని అమలు చేస్తే-
ఆ రోజు అసలు ఏ నెట్ వర్క్ లు పని చేయనివ్వకుండా స్తంభింపజేస్తే ఏమవుతుంది!
అమ్మో! ఇంకేమైనా ఉందా? జనాలకు పిచ్చెక్కిపోదూ అనుకుంటున్నారా? వారానికోరోజు ‘నో ఫోన్ డే’ ప్రకటించి అమలు చేస్తే- చాలా మందికి బీపీలు కంట్రోల్‌లోకి వస్తాయి. పత్రికలు, పుస్తకాలు చేతిలోకి వస్తాయి. పిల్లాపాపలతో మాట్లాడే తీరుబడి చిక్కుతుంది. ఇరుగుపొరుగు కష్టం నష్టం వాకబు చేసే వీలు చిక్కుతుంది.
అన్నింటికీ మించి తన గురించి తను ఆలోచించుకునే అవకాశం అందివస్తుంది..
ఇంకా.. ఇంకా.. ఇలాంటి సవాలక్ష ప్రయోజనాలు క్యూ కట్టి ఉన్నాయి.
.. డాక్టర్ గోవిందరాజు చక్రధర్
Discussion about this post